వనితల పీకపై వసూళ్ల కత్తి | chandrababu naidu cheating Dorka on loan waiver | Sakshi
Sakshi News home page

వనితల పీకపై వసూళ్ల కత్తి

Published Wed, Jun 11 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

వనితల పీకపై వసూళ్ల కత్తి

వనితల పీకపై వసూళ్ల కత్తి

 సాక్షి, రాజమండ్రి :‘మీరు తీసుకున్న అప్పు నయాపైసా కూడా తిరిగి కట్టక్కర్లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వాటిని మాఫీ చేస్తారు’ అంటూ ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలను నమ్మించారు తెలుగు తమ్ముళ్లు. కానీ, ఆయన అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే రుణమాఫీ చేయకుండా.. అందుకు విధివిధానాలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో అప్పుల ఊబి నుంచి బయట పడవచ్చనుకున్న డాక్రా మహిళలు హతాశులయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో తీసుకున్న అప్పు తక్షణం తిరిగి చెల్లించాలంటూ బ్యాంకర్లు వారిపై ఒత్తిడి తెస్తున్నారు.
 
 చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీ రుణమాఫీపై విధివిధానాలు రూపొందించేలోగా వచ్చినంత వరకూ అప్పులు తిరిగి వసూలు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా మూడేళ్ల నుంచి వసూలు కాని అప్పులతో పాటు నెలవారీ వాయిదాలను కూడా బతిమాలో, బెదిరించో రాబట్టేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకుల ఫీల్డు అధికారులు రెండు రోజులుగా మహిళా సంఘాల వద్దకు వెళ్లి నెలాఖరులోగా బకాయిలు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. రుణ మాఫీపై తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని, ప్రస్తుత బకాయిలను షెడ్యూల్ ప్రకారం  చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
 
 బకాయిలు ఇలా...
 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పరిధిలో 71,025 మహిళా స్వయంశక్తి సంఘాలున్నాయి. వీటిల్లోని మహిళలు ఇప్పటివరకూ రూ.1,264 కోట్ల అప్పు తీసుకున్నారు.ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఐటీడీఏ పరిధిలోని 3,900 పైగా సంఘాలు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించాలి.మొత్తం 74,935 సంఘాల్లోని మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు రూ.1,294 కోట్లు.8,865 సంఘాలు ఆరు నెలలుగా తాము రుణంగా తీసుకున్న రూ.106 కోట్లకు సంబంధించిన నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు.
 మిగిలిన సంఘాలవారు కూడా చంద్రబాబు హామీపై ఆశలు పెట్టుకుని గత నెల నుంచి రుణాల చెల్లింపును పూర్తిగా నిలుపు చేశారు.దీంతో బ్యాంకు అధికారులు రంగంలోకి దిగి ‘ఆపరేషన్ కలెక్షన్’ ప్రారంభించారు.
 
 రద్దు చేస్తామన్నారుగా..
 రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అయినా అధికారులు వాయిదాలు కట్టాలంటూ బలవంతం చేస్తున్నారు. పాత బకాయిలు కూడా చెల్లించాలంటున్నారు. రెండు రోజుల నుంచి బ్యాంకుల ఫీల్డ్ అధికారులు ఇంటికి వచ్చి మరీ బకాయిల గురించి అడుగుతున్నారు. వారి ఒత్తిడిని తట్టుకోలేక వాయిదాలు కట్టేస్తామని చెబుతున్నాం. అసలు మాఫీ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఎవ్వరూ చెప్పడంలేదు.
 - కొండేటి శ్రీదేవి,
 సరోజనీనాయుడు మహిళా సంఘం అధ్యక్షురాలు, రాజేంద్రనగర్, రాజమండ్రి
 
 అయోమయంగా ఉంది
 రుణమాఫీపై హామీ ఇచ్చారు కానీ, ఎప్పటి నుంచి అప్పులు రద్దు చేస్తారో చెప్పనే లేదు. బ్యాంకుల ఫీల్డ్ అధికారులు బకాయిల కోసం వస్తుంటే మాఫీ అవుతాయని చెబుతున్నాం. కానీ, మాఫీపై ఇంకా ఆర్డర్లు రాలేదని బ్యాంకు వాళ్లు చెబుతున్నారు. ఎప్పుడు ఆర్డర్ ఇస్తారు? అసలు ఇస్తారా? లేదా? అనేది మాకు అయోమయంగా ఉంది. రుణాలు పూర్తిగా మాఫీ చేయడంతోపాటు, చిన్న వ్యాపారాలు పెట్టుకునేందుకు కొత్త లోన్లు ఇవ్వాలి.
 - ముకినాడ సత్యవతి,
 మహాలక్ష్మి మహిళా సంఘం గ్రూపు
 అధ్యక్షురాలు, రాజమండ్రి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement