నీ హామీ ‘బంగారం’ గానూ! | Chandrababu Naidu Cheating Farmers | Sakshi
Sakshi News home page

నీ హామీ ‘బంగారం’ గానూ!

Published Mon, Jan 25 2016 7:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

నీ హామీ ‘బంగారం’ గానూ!

నీ హామీ ‘బంగారం’ గానూ!

 బ్యాంకర్లు నోటీసులివ్వడంతో ఒత్తిడిలో  రైతన్నలు
  బంగారు ఆభరణాలు వేలం వేసేందుకు సిద్ధమైన బ్యాంకులు
  దిక్కుతోచని స్థితిలో రైతులు

 
 వారంతా మాయామర్మం తెలియని మట్టిమనుషులు. మట్టినే నమ్ముకుని..శరీరంలోని స్వేదాన్ని కరిగించి మట్టికి ధారపోసి..కళ్లలో ఒత్తులు వేసుకుని కష్టసేద్యం చేస్తారు. వారి పదివేళ్లు మట్టిలోకి వెళ్తేనే ప్రపంచ ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్తాయి. పదిమందికీ అన్నం పెట్టే అన్నదాతలపై ప్రకృతి ఆగ్రహించినప్పుడు పాలకుల దయకోసం..వారిచ్చే హామీలకోసం దీనంగా  ఎదురుచూస్తారు. సరిగ్గా అప్పుడే సార్వత్రిక ఎన్నికలు రావడం.. అధికారం ఎలాగైనా చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో.. మీరు అప్పులు తీర్చవద్దు..మేం అధికారంలోకి వచ్చాక మీ అప్పులన్నీ తీర్చేస్తాం.. మీరు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలకూ మాదే బాధ్యత..అన్న హామీలను నమ్మారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నమ్మిన రైతులు ఇప్పుడు అప్పులోళ్ల
 ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు.  
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: హామీలు గుప్పించి అధికార పగ్గాలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయా రైతులను, వారి అప్పులను పట్టించుకోకపోవడంతో  అన్నదాతలు అప్పులోళ్ల ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. జిల్లాలో 80వేల మంది రైతులు  బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.432 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి.  ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.86.40కోట్లు మాఫీ జరిగినట్టు భావించాల్సి ఉంటోంది. ఇంకా రూ.345.60 కోట్ల మేర రైతులు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు రుణాలు తీసుకున్న వారు ముఖ్యమంత్రి హామీలు నమ్మి రుణాలు తీర్చకపోవడంతో ఆయా బ్యాంకులు  ఇప్పుడు నోటీసులిస్తున్నాయి. జిల్లాలో
 
 బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారందరికీ ఇప్పుడు బ్యాంకుల  నుంచి నోటీసులు రావడంతో తెల్లబోతున్నారు. ప్రతి రోజు బంగారు ఆభరణాల వేలం ప్రకటనలు బ్యాంకుల నుంచి జారీ అవుతున్నాయి.   
 
 గడువు దాటితే వేలం  తప్పదు  
 బంగారు ఆభరణాల రుణ కాల పరిమితి ఏడాదే. ఈలోగా చెల్లింపులు చేయాలి. ఆ తర్వాత చెల్లించకపోతే నోటీసులిస్తాం. అయినప్పటికీ స్పందించకపోతే బంగారు ఆభరణాలు వేలం వేస్తాం. ఇప్పుడా విధానం కొనసాగుతోంది. మాఫీ కాగా మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాలి.  ఒకవేళ  మిగతా మొత్తం కూడా మాఫీ అయితే సదరు రైతులకు పిలిచి మరీ ఇస్తాం.
 - ఎ. గురవయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్
 
 రుణమాఫీ కాలేదు- రుణం పుట్టలేదు
 నేను చిన్నకారు రైతు కుటుంబానికి చెందిన వాడిని. పంట మదుపుల కోసం   పెదబోగిలి ఎస్‌బీఐలో రూ.40వేలు రుణం తీసుకున్నాను.   అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో రుణం చెల్లించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా అప్పుతెచ్చి వడ్డీతో  కలిపి రూ.60 వేలు తీర్చాల్సి వచ్చింది.  
 పి నాగరాజు రైతు,బుడ్డిపేట,సీతానగరం.
 
 బాబు మాటలు విని ఆర్థిక ఇబ్బందులు
 నేను సీతానగరం మండలంలోని  పెదబోగిలి ఎస్‌బీఐలో వ్యవసాయ రుణంగా రూ.50 వేలు తీసుకుని  ఏటా పంట చేతికొచ్చిన అనంతరం రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నాను. చంద్రబాబు రుణమాఫీ చేస్తామని, ఉన్న అప్పులు తీర్చవద్దని చెప్పడంతో రెన్యువల్ చెయ్యించలేదు. దీంతో రుణమాఫీ వర్తించక పోగా బ్యాంకులో తీసుకున్న రుణం  వడ్డీతోకలిపి తడిసి మోపెడయ్యింది. రుణాన్ని చెల్లించాలని అధికారులు ఒత్తిడి తేవడంతో  ప్రైవేటుగా  అప్పుతెచ్చి  రూ.80 వేలు చెల్లించాను. రుణమాఫీ ఇప్పటికీ  వర్తించక చంద్రబాబు మాటలు విని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.  
  -శంకరాపు సింహాచలం,
  రైతు, బుడ్డిపేట గ్రామం సీతానగరం మండలం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement