cheating farmers
-
ఇదేంటి.. మంత్రివర్యా!
రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నా అలాంటిదేమీ లేదని బొంకుతున్న సర్కారు నిత్యం వేలం ప్రకటనలు జారీ చేస్తున్న బ్యాంకులు చంద్రబాబు హామీ అమలుకాక జిల్లాలో రూ.3,550 కోట్ల విలువైన బంగారం వేలం నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు’ అన్నట్టుంది పాలకుల తీరు. బంగారు ఆభరణాలను.. చివరకు భార్య మెడలోని పుస్తెలను సైతం బ్యాంకుల్లో తనఖాపెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఢంకా బజాయించి మరీ హామీలిచ్చి.. ఆనక మొహం చాటేసి.. అన్నదాతలను అడుగడుగునా దగా చేస్తున్న పాలకులు ఇప్పుడు కొత్తపల్లవి అందుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో చేసిన ప్రకటన జిల్లాలోని రైతులను ఆశ్చర్య చకితుల్ని చేసింది. ‘పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్నట్టు సమాచారం లేదు’ అని మంత్రి ప్రత్తిపాటి నిండు సభలో నిర్లజ్జగా బొంకేశారు. రైతులు కుదువబెట్టిన బంగారాన్ని జిల్లాలోని బ్యాంకులన్నీ ఏడాది కాలంగా వరుసపెట్టి మరీ వేలం వేస్తున్నాయి. ఇదేమీ పట్టించుకోని సర్కారు తనకేమీ తెలియనట్టే నిద్ర నటిస్తోంది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. పాలకులు నిర్లజ్జగా అబద్ధపు ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. బంగారంపై జిల్లాలోని రైతులు తీసుకున్న రుణాలు.. ఆభరణాలను వేలం వేస్తున్న తీరు తెన్నులను పరిశీలిస్తే... ఏలూరు (మెట్రో) : ‘రుణాన్ని చెల్లించని కారణంగా ఏ ఒక్క రైతుకు చెందిన బంగారాన్ని వేలం వేసేందుకు చర్యలు తీసుకోలేదు. పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్నట్టు సమాచారం లేదు’ అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలివి. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి.. రుణమాఫీ హామీని నమ్మిన పాపానికి రైతుల్లో చాలామంది ఇప్పటికే బంగారాన్ని పూర్తిగా వదిలేసుకోవాల్సి వచ్చింది. తక్షణమే రుణం మొత్తాన్నిచెల్లించకపోతే బంగారాన్ని వేలం వేస్తామంటూ అనేక మంది రైతులకు నిత్యం బ్యాంకుల నుంచి నోటీసులు అందుతూనే ఉన్నాయి. ‘ఆదుకోండి మహాప్రభో’ అని అన్నదాతలు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. కనీసం రుణాల చెల్లింపునకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా.. ఏ ఒక్క రైతుకు చెందిన బంగారాన్ని వేలం వేయడం లేదని, బ్యాంకులు ఇలాంటి పని చేస్తున్నట్టు సమాచారం కూడా తమ వద్ద లేదని సాక్షాత్తు మంత్రి ప్రత్తిపాటి ప్రకటించడం కర్షకులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. రూ.3,550 కోట్ల విలువైన బంగారం బ్యాంకుల పరం రుణమాఫీ హామీ నెరవేరక.. వడ్డీ భారం తడిసిమోపెడు కావడంతో అప్పులను తీర్చలేక.. జిల్లాలో 2లక్షల మంది రైతులు తాము కుదువబెట్టిన రూ.3,550 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకులకే వదిలేశారు. జిల్లాలో మొత్తం 8 లక్షల మంది రైతులు రూ.7,245 కోట్లను పంట రుణాలుగా తీసుకోగా.. వీరిలో 3.50 లక్షల మంది కేవలం బంగారాన్ని తనఖాపెట్టి రూ.3,800 కోట్ల రుణాలు పొందారు. ఇదంతా 2013, 2014 సంవత్సరాల్లో జరిగింది. బ్యాంకు బకాయిలను చెల్లించి.. బంగారాన్ని విడిపించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. ఊరూవాడా పర్యటించిన చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బంగారు ఆభరణాలపై రైతులు తీసుకున్న పంట రుణాలను సైతం పూర్తిగా మాఫీ చేస్తామని ఎడాపెడా హామీలు గుప్పించారు. దీంతో బంగారంపై రుణాలు తీసుకున్న రైతులు కూడా బ్యాంకులకు ఆ మొత్తాలను చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక.. బంగారు ఆభరణాలపై గల రూ.3,800 కోట్ల రుణాల్లో కేవలం రూ.250 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. దీంతో రూ.3,550 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకుల చెరలోనే ఉండిపోయాయి. ఈ రుణాలపై వడ్డీలు పెరిగిపోవడంతో బ్యాంకులు గత ఏడాది మార్చి నుంచి రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. వారి బంగారాన్ని బహిరంగ వేలంలో విక్రయించగా వచ్చిన సొమ్మును బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. అలా చేసినా బకాయి మొత్తం తీరకపోతే మిగిలిన సొమ్మును తక్షణమే చెల్లించాలంటూ తిరిగి నోటీసులు ఇస్తున్నాయి. బకాయి తీరిపోగా రూ.వందో, రెండొందలే మిగిలితే చెక్కుల రూపంలో రైతులకు చెల్లిస్తున్నాయి. తిరగరాసినా కష్టమవుతోంది అక్కడక్కడా కొందరు రైతులు మాత్రం బయటి నుంచి అధిక వడ్డీలకు అప్పుతెచ్చి బ్యాంకు బకాయిలను చెల్లిస్తున్నారు. అవే ఆభరణాలను తిరిగి అదే బ్యాంకులో తనఖా పెట్టి ఆ మొత్తాల్ని తీసుకెళ్లి రుణదాతలకు ఇస్తున్నారు. ఇలా చేసే సందర్భంలో చేతిసొమ్ము కూడా హారతి అవుతోంది. మరోవైపు కొందరు రైతులు వడ్డీ మొత్తాన్ని చెల్లించి బంగారంపై అప్పును తిరగరాయించుకుంటున్నారు. ఇలా సుమారు 1.50 లక్షల మంది రైతులు బకాయిలను తిరగ రాయించుకుని వడ్డీ రూపంలో రూ.17 కోట్లను చెల్లించారు. ఇంకా 2 లక్షల మంది రైతులు కేవలం వడ్డీ రూపంలోనే రూ.33 కోట్లను చెల్లించాల్సి ఉంది. వీరంతా అసలు అప్పు మాట దేవుడెరుగు.. కనీసం వడ్డీ సొమ్ము సైతం చెల్లించి రుణాన్ని తిరగరాయించుకునే స్థోమత లేక బంగారు ఆభరణాలను బ్యాంకులకే వదిలేస్తున్నారు. చంద్రబాబు మాట విని నిలువునా మునిగాం చంద్రబాబు మాటలు విని రుణమాఫీ అవుతుందని భావించాము. నిలువునా మునిగిపోయాం. రుణమాఫీ కాకపోగా తీసుకున్న అప్పుకంటే అధికంగా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా అధిక వడ్డీ వసూలు చేసి మా నగలను వేలం వేసే స్థితికి చంద్రబాబు హామీలు తీసుకెళ్లాయి. - బోయిడి ప్రసాద్, సిద్ధాంతం మొదటికే మోసం వచ్చింది రుణమాఫీ వర్తిస్తుందని ఎదురు చూసినప్పటికీ నిరాశే మిగిలింది. అప్పు చేసిన దానికంటే అధికంగా వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. మొదటికే మోసం వచ్చినట్టైంది మా పరిస్థితి. రుణమాఫీ కోసం ఎదురుచూసిన మేమంతా వడ్డీల భారం పెరిగిపోవడంతో చివరకు బంగారం వేలం వేయించుకునే స్థితికి చేరుకున్నాం. - ధర్నాల వెంకట సూర్యనారాయణ, మునమర్రు -
నీ హామీ ‘బంగారం’ గానూ!
►బ్యాంకర్లు నోటీసులివ్వడంతో ఒత్తిడిలో రైతన్నలు ► బంగారు ఆభరణాలు వేలం వేసేందుకు సిద్ధమైన బ్యాంకులు ► దిక్కుతోచని స్థితిలో రైతులు వారంతా మాయామర్మం తెలియని మట్టిమనుషులు. మట్టినే నమ్ముకుని..శరీరంలోని స్వేదాన్ని కరిగించి మట్టికి ధారపోసి..కళ్లలో ఒత్తులు వేసుకుని కష్టసేద్యం చేస్తారు. వారి పదివేళ్లు మట్టిలోకి వెళ్తేనే ప్రపంచ ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్తాయి. పదిమందికీ అన్నం పెట్టే అన్నదాతలపై ప్రకృతి ఆగ్రహించినప్పుడు పాలకుల దయకోసం..వారిచ్చే హామీలకోసం దీనంగా ఎదురుచూస్తారు. సరిగ్గా అప్పుడే సార్వత్రిక ఎన్నికలు రావడం.. అధికారం ఎలాగైనా చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో.. మీరు అప్పులు తీర్చవద్దు..మేం అధికారంలోకి వచ్చాక మీ అప్పులన్నీ తీర్చేస్తాం.. మీరు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలకూ మాదే బాధ్యత..అన్న హామీలను నమ్మారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నమ్మిన రైతులు ఇప్పుడు అప్పులోళ్ల ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: హామీలు గుప్పించి అధికార పగ్గాలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయా రైతులను, వారి అప్పులను పట్టించుకోకపోవడంతో అన్నదాతలు అప్పులోళ్ల ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. జిల్లాలో 80వేల మంది రైతులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.432 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.86.40కోట్లు మాఫీ జరిగినట్టు భావించాల్సి ఉంటోంది. ఇంకా రూ.345.60 కోట్ల మేర రైతులు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు రుణాలు తీసుకున్న వారు ముఖ్యమంత్రి హామీలు నమ్మి రుణాలు తీర్చకపోవడంతో ఆయా బ్యాంకులు ఇప్పుడు నోటీసులిస్తున్నాయి. జిల్లాలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారందరికీ ఇప్పుడు బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో తెల్లబోతున్నారు. ప్రతి రోజు బంగారు ఆభరణాల వేలం ప్రకటనలు బ్యాంకుల నుంచి జారీ అవుతున్నాయి. గడువు దాటితే వేలం తప్పదు బంగారు ఆభరణాల రుణ కాల పరిమితి ఏడాదే. ఈలోగా చెల్లింపులు చేయాలి. ఆ తర్వాత చెల్లించకపోతే నోటీసులిస్తాం. అయినప్పటికీ స్పందించకపోతే బంగారు ఆభరణాలు వేలం వేస్తాం. ఇప్పుడా విధానం కొనసాగుతోంది. మాఫీ కాగా మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాలి. ఒకవేళ మిగతా మొత్తం కూడా మాఫీ అయితే సదరు రైతులకు పిలిచి మరీ ఇస్తాం. - ఎ. గురవయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రుణమాఫీ కాలేదు- రుణం పుట్టలేదు నేను చిన్నకారు రైతు కుటుంబానికి చెందిన వాడిని. పంట మదుపుల కోసం పెదబోగిలి ఎస్బీఐలో రూ.40వేలు రుణం తీసుకున్నాను. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో రుణం చెల్లించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా అప్పుతెచ్చి వడ్డీతో కలిపి రూ.60 వేలు తీర్చాల్సి వచ్చింది. పి నాగరాజు రైతు,బుడ్డిపేట,సీతానగరం. బాబు మాటలు విని ఆర్థిక ఇబ్బందులు నేను సీతానగరం మండలంలోని పెదబోగిలి ఎస్బీఐలో వ్యవసాయ రుణంగా రూ.50 వేలు తీసుకుని ఏటా పంట చేతికొచ్చిన అనంతరం రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నాను. చంద్రబాబు రుణమాఫీ చేస్తామని, ఉన్న అప్పులు తీర్చవద్దని చెప్పడంతో రెన్యువల్ చెయ్యించలేదు. దీంతో రుణమాఫీ వర్తించక పోగా బ్యాంకులో తీసుకున్న రుణం వడ్డీతోకలిపి తడిసి మోపెడయ్యింది. రుణాన్ని చెల్లించాలని అధికారులు ఒత్తిడి తేవడంతో ప్రైవేటుగా అప్పుతెచ్చి రూ.80 వేలు చెల్లించాను. రుణమాఫీ ఇప్పటికీ వర్తించక చంద్రబాబు మాటలు విని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. -శంకరాపు సింహాచలం, రైతు, బుడ్డిపేట గ్రామం సీతానగరం మండలం. -
అన్నదాతతో సర్కారు ఆటలు
రాజమండ్రి :రుణమాఫీ కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తొలి సంతకం చేసి.. కొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. కానీ ఇప్పటికీ అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అడ్డగోలు నిబంధనలతో తొలి విడతలోనే ప్రభుత్వం సగంమందిని ఏరివేసింది. మిగిలిన వారిలో చాలామందికి ఆధార్ నంబరు కలవలేదని, భూమి సర్వే నంబరు తప్పని ఎగ్గొట్టింది. దీనికి బ్యాంకు అధికారుల తప్పిదాలు కూడా తోడయ్యాయి. వీటన్నింటి పుణ్యమా అని జిల్లాలో 25 శాతం మంది అర్హులైన రైతులకు ఇప్పటికీ రుణమాఫీ వర్తించలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అన్ని అర్హతలూ ఉండి రుణమాఫీ పొందనివారు ఈ నెల 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఆయా డివిజన్ కేంద్రాల్లో రైతు రుణమాఫీ సలహా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రుణమాఫీ కావాలనుకున్న రైతులు తమ దరఖాస్తులను ఈ కేంద్రాల్లో అందిస్తే.. వాటిని అక్కడి సిబ్బంది పరిశీలిస్తారు. అంతా బాగా ఉంటే.. ఆ రైతులు తమ దరఖాస్తులను తిరిగి కాకినాడ తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకినాడలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వారం రోజులుగా రైతులు పోటెత్తుతున్నారు. సెలవులు మినహా ప్రతి రోజూ దాదాపు 250 మంది దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 1,600 మంది దరఖాస్తులు అందజేశారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సలహా కేంద్రాలకు సైతం రైతులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రాజమండ్రిలోని సలహా కేంద్రాన్ని రోజుకు 80 నుంచి 110 మంది, అమలాపురంలో 50 నుంచి 60 మంది, పెద్దాపురంలో 70 నుంచి 100 మంది, రామచంద్రపురంలో రోజుకు 50 మంది వరకూ వచ్చి, దరఖాస్తులు ఇస్తున్నారు. గిరిజన రైతులకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడం, తగినంత ప్రచారం చేయకపోవడంతో రంపచోడవరం సలహా కేంద్రానికి రైతులు నామమాత్రంగానే వస్తున్నారు. గడచిన నాలుగు రోజుల్లో ఇక్కడకు కేవలం ఏడుగురు రైతులు మాత్రమే రావడం గమనార్హం. కానరాని కనీస సౌకర్యాలు ఈ కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. ఎండన పడి వస్తున్న రైతులు సేద తీరేందుకు అవకాశం లేదు. సమ్మెతో ఆర్టీసీ బస్సులు లేక, ఉన్న బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక వారు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు కూడా కార్యాలయాల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. దరఖాస్తు నింపడం తెలీక, అందుబాటులో ఎక్కువమంది సిబ్బంది లేక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 50 ఏళ్లు పైబడినవారితోపాటు మహిళా రైతులు సైతం ఈ కేంద్రాలకు వస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. ఇంతా చేసి సలహా కేంద్రం వద్ద దరఖాస్తును సరిచూసి బాగానే ఉందని కాకినాడలో అందజేయాలని చెప్పడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ‘మళ్లీ అక్కడికేం వెళ్తాం? ఇక్కడే తీసుకోవచ్చు కదా’ అని రైతులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పేవారే లేరు. ఎందుకిలా కాల్చుకు తింటున్నారు? ‘నాలుగైదుసార్లు తిప్పితే నీరసం వచ్చి పోతారు.. డబ్బులివ్వక్కర్లేద్దని చూస్తున్నారు. మాఫీ రాదంటే పోతాం కదా! మమ్మల్ని ఇలా ఎందుకిలా కాల్చుకు తింటున్నారు?’ అని వాపోతున్నారు కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన రైతు గొసుల లచ్చయ్య. ఈయనకు 3.32 ఎకరాల భూమి ఉంది. దీనిపై రూ.85 వేల రుణం తీసుకున్నారు. అయితే 2.40 ఎకరాలు మాత్రమే ఉందని, ఇందుకు రూ.57,600 మాత్రమే మాఫీ వస్తుందని ఆన్లైన్లో వచ్చింది. అదేమంటే ‘పై నుంచి అలా వస్తే మమ్మల్నేం చేయమంటారు?’ అని బ్యాంకోళ్లు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తే ఇవ్వాలి.. లేకపోతే మానేయాలి.. ‘ఇస్తే ఇవ్వాలి. లేకపోతే మానేయాలి. ఎన్నిసార్లు తిప్పుతారు? అమ్మకు బాగోక నేనొచ్చాను. ఇక్కడికొచ్చాక కాకినాడ ఎల్లమంటున్నారు’ అని వాపోతున్నారు సీతానగరానికి చెందిన బొల్లంపల్లి శాంత. తల్లి శ్యామల 2012లో రూ.12 వేలు అప్పు తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.18 వేలైంది. ఇంతా చేస్తే అదే సర్వే నంబరు మీద కౌలుదారులు మాఫీ పొందారని సమాచారం రావడంతో శ్యామల, శాంత అయోమయానికి గురవుతున్నారు. -
అన్నదాతకు వెన్నుపోటే
పట్టిసీమ ఎత్తిపోతలకు సిద్ధమవుతున్న సర్కారు డెల్టా ఎడారవుతుందన్నా ఖాతరు చేయని మొండితనం (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానానికి తావిస్తున్నాయి. ఒక రంగంతో ముడిపడి ప్రత ్యక్షంగా, పరోక్షంగా పలు రంగాలపై ప్రభావం చూపే అంశాల్లో కూడా ప్రజాభిప్రాయానికి సర్కార్ విలువ నివ్వడం లేదు. భవిష్యత్తరాలకు భరోసా ఇవ్వలేని నిర్ణయాన్ని సర్కార్ ఏ ప్రయోజనం కోసం తీసుకున్నా తప్పే. ఈ వారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ని ర్ణయం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ధుల మంజూరు, త్వరలో శంకుస్థాపన. గత రెండు, మూడు నెలలుగా పట్టిసీమకు చంద్రబాబు సర్కార్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిసినప్పటి నుంచి గోదావరి జిల్లాల రైతులు కంటిపై కునుకు లేకుండా ఉన్నారు. బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కుతున్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతలు వద్దేవద్దని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పార్టీరహితంగా కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలు మొండి సర్కార్‌ను కదిలించలేదు. రుణమాఫీపై ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబుపై నెలకొన్న వ్యతిరేకతను పళ్లబిగువున అదిమిపట్టుకుంటే పట్టిసీమ ఎత్తిపోతలతో మరోసారి నడ్డివిరిచారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏటా వచ్చే వరదలతో సుమారు 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే.. దాన్ని సద్వినియోగం చేసేందుకే పోలవరం ప్రాజెక్టు తలపెట్టారు. అలాంటప్పుడు మధ్యలో ఎత్తిపోతలు ఎందుకంటే రాయలసీమ కోసమేనంటున్న చంద్రబాబు సర్కార్‌కు గోదావరి జిల్లాల్లో ఏటా రబీలో ఎదురవుతున్న సాగునీటి ప్రతిబంధకాలు కనిపించడం లేదా అని రైతు ప్రతినిధులు నిలదీస్తున్నారు. ఒక్క మన జిల్లాలోని గోదావరి డెల్టాలో వరి రబీలో 3.50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇవి కాక చేపల చెరువులు, తీరప్రాంత మండలాల్లోని కొబ్బరితోటలకు డెల్టా కాలువలే ఆధారం. ప్రస్తుతం వీటన్నింటికీ సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటప్పుడు ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా భూములు బీడువారి ఎడారులు కాక ఏమవుతాయనే విజ్ఞుల ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కానీ నిరంకుశ ధోరణితో పట్టిసీమ శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. హోం మంత్రి సొంత మండలంలోనే దళిత సర్పంచ్‌పై దౌర్జన్యం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా జిల్లాలో అధికారపార్టీ నేతల తీరు మారడం లేదు. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులతో అసలు పాలకులు ఎటు పోతున్నారా అనే అనుమానం కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు పెచ్చుమీరుతున్నాయి. తునిలో మొదలైన ఈ తరహా దాడులు కోనసీమకు కూడా పాకాయి. కోనసీమలో సామాజిక వర్గ పోరు ఎప్పటి నుంచో వేళ్లూనుకుని ఉంది. ఒక సామాజికవర్గమంటే మరో సామాజికవర్గం పొడగిట్టని పరిస్థితి. ఇది గ్రామాల్లో మరీ ఎక్కువనే చెప్పొచ్చు. యువత ఆలోచనలు విద్య, వ్యాపారాల వైపు మళ్లడంతో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈ తరుణంలో కోనసీమలోని ఎస్.యానాంలో సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై టీడీపీ నాయకులు దాడికి దిగడమే కాక ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చిన 108ని కూడా ధ్వంసం చేశారు. దాడులకు పాల్పడ్డ వారికి తెరవెనుక అధికారపార్టీ పెద్దలు ప్రోత్సాహమో, ఏమైనా వారు చూసుకుంటారన్న ధీమాయో ఈ బరితెగింపునకు కారణం. అధికారం ఉందని అనవసర వివాదాలను ప్రోత్సహిస్తే ‘కొరివితో తలగోక్కున్నట్టే’నని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. హోం మంత్రి రాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తం పరిధిలోని ఎస్.యానాంలో.. అందునా ఎమ్మెల్యేగా, ఎంపీగా దళితులే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. దళిత సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై దాడి జరిగిన విషయంలో పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘర్షణల విషయంలో పోలీసుల తీరు కూడా పలు సందేహాలకు తావిచ్చింది. సామాజిక నేపథ్యం ఉన్న ఇలాంటి ఘర్షణలప్పుడే పోలీసులు మరింత చురుకైన పాత్ర పోషించాలి. లేదంటే భారీ మూల్యం తప్పదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. కాగా అమలాపురంలో పోలీసుల చొరవను కోనసీమవాసులు అభినందిస్తున్నారు. అక్కడ పాతుకుపోయి సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేస్తున్న రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం, ఆ ప్రాంతానికి చెందిన చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రితో కూడిన హోంమంత్రి పదవి రావడంతో రౌడీషీటర్లు పేట్రేగిపోయారని చెప్పొచ్చు. విషయాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన మీదట జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కొంత కఠినంగా వ్యవహరించబట్టే సర్కిల్ స్థాయిలో పోలీసులు కూడా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. గొల్లవిల్లిలో జాతీయస్థాయి క్రీడాపర్వం మొదటి నుంచి క్రీడలకు పెద్దపీట వేసే ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ఈ వారం జాతీయస్థాయి నిమ్మకాయల వెంకటరంగయ్యనాయుడు మెమోరియల్ పేరుతో వాలీబాల్పోటీలకు ఆతిథ్యమిచ్చింది. రెండోసారి మహిళా వాలీబాల్‌పోటీలు సైతం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ , తమిళనాడు, కర్నాటక సహా మహరాష్ట్రలతో పాటు రైల్వే ప్రాంతీయ జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. నాలుగు రోజులు జరిగిన పోటీల్లో అంతర్జాతీయ వాలీబాల్, బీచ్‌వాలీబాల్ క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించి స్ఫూర్తిగా నిలిచారు. ఇద్దరిని బలిగొన్న గ్యాస్ రీఫిల్లింగ్ తునిలో వంట గ్యాస్ రీ ఫిల్లింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రమాదమని తెలిసీ కొందరు స్వార్థపరులు వంట గ్యాస్ అక్రమ రీఫిలింగ్ చేస్తూనే ఉన్నారు. దుర్ఘటనలు జరిగినప్పుడు సివిల్ సప్లయిస్ అధికారులు, పోలీసులు హడావిడి చేయడం, తరువాత పట్టనట్టు వదిలేయడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇళ్లలో పెద్దఎత్తున గ్యాస్ నిల్వ చేస్తున్నారంటే ఇందుకు ఏజెన్సీలు సహకరించడం కూడా కారణమే. -
ఆదుకునేది ఇంకెన్నడో?
విపక్షంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు అన్నదాతలపై తుపానుస్థాయిలో ప్రేమను ఒలకబోశారు. వారి శ్రేయస్సే లక్ష్యమని గర్జించారు. అప్పటి ప్రభుత్వాలపై కన్నెర్రజేశారు. ఆందోళనలూ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. యథాప్రకారం రైతన్నల పాలిట తన మునుపటి నైజాన్నే చాటుతున్నారు. రైతు రుణమాఫీ అమలులో మెలికలూ, మడతలే కాదు.. హెలెన్ తుపాను బాధిత రైతులకు నేటికీ పెట్టుబడి రాయితీ అందకపోవడమూ ఆయన పాలన స్వభావాన్ని పట్టిచ్చే మచ్చుతునకే. అమలాపురం :అధికారంలోకి వస్తే రైతులకు ఎన్నో మేళ్లు చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం పెంచి, సకాలంలో అందజేయడం ఒకటి. అధికారం దక్కాక ఒకదాని తరువాత ఒక హామీని పక్కనపెడుతున్నట్టే.. ఈ హామీని కూడా బాబు విస్మరించారు. ఈ కారణంగా హెలెన్‌కు రావాల్సిన పెట్టుబడి రాయితీ ఈరోజుకు కూడా రైతులకు అందలేదు. 2013 నవంబరులో వచ్చిన హెలెన్ తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి తుడిచి పెట్టుకుపోయింది. పరిహారంగా జిల్లాలోని రైతులకు రూ.110 కోట్ల వరకు ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) రావాల్సి ఉంది. అప్పటి వరకు హెక్టారుకు రూ.ఆరు వేలు ఉన్న పరిహారాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.పది వేలకు పెంచారు. అంతకుముందే పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు ఇవ్వాలని ప్రతిపక్షనేతగా చంద్రబాబు నిరాహారదీక్ష చేశారు. రైతులకు తక్షణం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నది కూడా నిరాహారదీక్ష డిమాండ్లలో ఒకటి. ఈ నేపథ్యంలో బాబు అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడి రాయితీ పెంచుతారని రైతులు ఆశించారు. హుదూద్ తుపాను వల్ల ఉత్తరాంధ్రలో పంటలు తుడిచిపెట్టుకుపోయి, రైతులు కట్టుబట్టలతో మిగిలినా బాబు మాత్రం పెట్టుబడి రాయితీ పెంచలేదు. పోనీ సకాలంలో ఇచ్చారా అంటే అదీలేదు. హెలెన్ తుపాను వచ్చి 16 నెలలు కావస్తున్నా పెట్టుబడి రాయితీ మాత్రం విడుదల కాలేదు. దీనితో రైతులు నిరాశ చెందుతున్నారు. ఒకవైపు రుణమాఫీ ఈ రోజుకూ తేలకుండా పోవడం, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందలేకపోవడం, మరోవైపు రాయితీలందక రైతులు ఖరీఫ్ సాగులో చేసినట్టే రబీకి కూడా అప్పులు చేస్తున్నారు. ఎంఎన్ఏఐఎస్ను అపహాస్యం చేస్తున్న బీమా సంస్థ హెలెన్ తుపానుతో నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారాన్ని కూడా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికీ కొంత మందికి పూర్తిగా అందించలేదు. వివిధ కారణాలు చూపి పరిహారాన్ని జాప్యం చేస్తోంది. జిల్లాలోని కొన్ని గ్రామాలకు ఇంకా పరిహారం అందించలేదు. ప్రధానంగా 250 ఎకరాల కన్నా తక్కువ వరిసాగు జరుగుతున్న గ్రామాలను గ్రూపింగ్ విలేజ్లంటూ పక్క గ్రామాల్లో కలుపుతున్నారు. లేకపోతే గ్రామం యూనిట్‌గా పరిహారం నమోదు ఇబ్బంది అవుతోందన్న వంకతో పరిహారాన్ని ఆలస్యం చేస్తున్నారు. రుణాలు తీసుకోకుండా వ్యక్తిగతంగా ప్రీమియం చెల్లించిన వారికి కూడా ఇంతవరకు పరిహారం అందలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీమా ప్రీమియం చెల్లించాల్సినప్పుడు గడువు పెట్టి మరీ కట్టించుకుని, పరిహారం ఇచ్చేటప్పుడు గడువు అనేది లేకుండా వాయిదాలపై వాయిదాలు వేయడం భావ్యం కాదని వాపోతున్నారు. రుణాలతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన సుమారు నాలుగు వేల మంది రైతులు పరిహారం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. అలాగే పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం అందించాలన్న నిబంధన కూడా హెలెన్ నష్టానికి సంబంధించి అమలు కాలేదు. తద్వారా సవరించిన పంటల బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్) పథకాన్ని బీమా సంస్థ అపహాస్యం చేస్తోంది. -
అన్నదాతకు అష్టకష్టాలు
రైతుకూ బాబు వెన్నుపోటు అప్పులతో కుదేలు.. మాఫీ కాక దిగాలు 8నెలల పాలనలో అన్నివిధాలా నష్టాలు నిరాశ, నిస్పృహలతో కర్షకులు సంక్షోభం దిశగా వ్యవసాయం సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారతదేశ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులు మునుపెన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలో.. ప్రతికూల వాతావరణమో కాదు.. కేవలం రైతన్నపై పగపట్టినట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లనే పశ్చిమ రైతు కాడి కిందపడేసే దుస్థితి నెలకొంది. హుదూద్ తుపానును సైతం తట్టుకుని పంట పండించిన జిల్లా రైతు సర్కారు దెబ్బకు మాత్రం విలవిల్లాడిపోతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో అన్నదాత కష్టాల సాగుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రుణమాఫీపై సర్కారు నయామోసం, సాగుకోసం బ్యాంకులు కొత్త రుణా లు ఇవ్వని నిర్వాకంతో ఎక్కువ వడ్డీకి ప్రైవేటు అప్పులు చేయడం, సాగునీటి అవస్థలు, యూరియా కష్టాలు, విత్తన మోసాలు, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించలేక నష్టపోవడం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేక.. అన్నీ కలగలిపి రైతన్నను తీవ్ర అగాధంలోకి నెట్టి వేస్తున్నాయి. అన్నదాతలపై కనీస కనికరం లేని సర్కారు తీరుతో తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశా నిస్పృహలతో జిల్లా రైతులు కుంగిపోతున్నారు. 1. రుణం నిజం.. మాఫీ మోసం చంద్రబాబు రుణమాఫీ మాయాజాలంలో చిక్కుకుని పశ్చిమ రైతు నిండా మునిగిపోయాడు. జిల్లావ్యాప్తంగా 8లక్షల 79 వేలమంది రైతుల అకౌంట్లు, మరో లక్షకి పైగా ఉన్న డ్వాక్రా సంఘాల అకౌంట్లకు గాను దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే లక్షన్నర పరిమితి, ఇంటిలో ఒక్కరికే మాఫీ మెలికతో జిల్లాలో రైతుల రుణమాఫీకి సర్కారు విదిల్చంది కేవలం రూ.369 కోట్లు మాత్రమే. కనీసం కేటాయించిన ఆ రూ.369 కోట్లయినా రైతుల ఖాతాల్లో జమ అయిందా అంటే అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటే జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ ప్రసహనం ఎలా కొనసాగుతుందో అర్థమవుతుంది. 2. ప్రైవేటు అప్పుల ఊబిలో రైతన్నలు రుణమాఫీ జాప్యం, అమల్లో అస్తవ్యస్త విధానాలు చివరికి రైతులకు బ్యాంకు నుంచి అప్పులు పుట్టకుండా చేశాయి. 2013-14లో పంటరుణాల లక్ష్యం రూ.4,374కోట్లు కాగా, రూ.6,084 కోట్ల రుణాలను బ్యాంకర్లు రైతులకు అందించారు. ఆ ఏడాది లక్ష్యానికి మించి అప్పులు తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని రూ.5221 కోట్లకు పెంచారు. కానీ సర్కారు రుణమాఫీ మోసంతో పంటరుణాల పంపిణీని బ్యాంకులు నామమాత్రం చేసేశాయి. గడిచిన ఖరీఫ్ సీజన్లో కేవలం రూ. 900 కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేయగా, ప్రస్తుత రబీ సీజన్లో ఇంతవరకూ రుణాల పంపిణీనే మొదలు కాలేదు. ఇక కౌలు రైతులకు రెండు సీజన్లలోనూ నయా పైసా కూడా బ్యాంకుల నుంచి అప్పు పుట్టలేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లోనే తిష్టవేసి అధిక వడ్డీలను రైతుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. మరో పక్క ధాన్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి కుదించడంతో మిల్లర్లు కమిషన్‌దారుల ద్వారా రైతులకు ఇప్పించే రుణాలను తగ్గించేశారు. దీంతో కొన్నిచోట్ల సాగుదారులు అప్పులు దొరక్క విల్లవిల్లాడే పరిస్థితి కూడా నెలకొంది. 3. యూరియా కష్టాలు ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో యూరియా వినియోగం పెరిగిన ప్రస్తుత నేపథ్యంలో రైతులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. అందుబాటులో ఉన్నచోట డీలర్ల మాయాజాలం, ఇష్టారాజ్యంగా అధిక రేట్లకు విక్రయించడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ వద్ద యూరియా బస్తా ధర రూ.280లు ఉండగా ప్రైవేటు డీలర్లు రూ.320 నుంచి రూ.330లు చొప్పున విక్రయిస్తున్నారు. సొసైటీలకు ఎరువు వచ్చినా రైతులకు సకాలంలో సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది. రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నప్పటికీ చాలా మండలాల్లో రైతుకి ఒక్క బస్తా చొప్పున మాత్రమే అందిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి పంటతో పాటు మెట్టలో సాగ వుతున్న వర్జీనియా పొగాకు, చెరుకు, మొక్కజొన్న, అరటి, కూరగాయలు పంటలకు సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల తాళ్లపూడి మండలం మలకపల్లిలో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలే లేవు. 4. ధాన్యం విక్రయాలతో నష్టాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబడి అమ్మిన రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాడు. జిల్లా మొత్తం మీద 171 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికే ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు డివిజన్లలో కేంద్రాలను మూసివేశారు. నర్సాపురం డివిజన్లో మాత్రం అక్కడక్కడా తెరిచి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా 37,454 మంది రైతుల నుంచి 4,67 లక్షల క్యూబిక్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.650 కోట్లు కాగా వీటిని నిర్వహించినందుకు గాను డ్వాక్రా సంఘాలకు రూ.15 కోట్లు కమీషన్‌గా ఇచ్చారు. ఇందులో ధాన్యం అమ్మిన రైతులకు రూ.32 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 5. చి‘వరి’ భూములకు సాగునీటి అవస్థలు ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి సమస్యతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి తలెత్తినా అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవువుతుండగా, ప్రస్తుత దాళ్వాలో ఒక్క పశ్చిమ డెల్టాలోనే 2.32 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆచంట ప్రాంతాల్లోని శివారు భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. వేసవికాలానికి ఇంకా రెండు నెలల ముందుగానే గోదావరిలో నీటి లభ్యత రోజురోజుకీ తగ్గిపోతుండటంతో సాగునీటికి తీవ్ర కటకట తలెత్తింది. 6. విత్తన మోసాలు విత్తనాల కంపెనీల మోసాలతో పశ్చిమ రైతులు నిలువునా దగా పడుతున్నారు. బహుళ జాతి విత్తన కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీసీడ్స్ సరఫరా చేసిన విత్తనాలతో కూడా పంటలు దెబ్బతింటున్నాయంటే ఇక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో నల్లజర్ల, పోలవరం, తాళ్లపూడి, మండలాల్లో వేలాదిమంది రైతులు ఏపీ సీడ్స్ పంపిణీ చేసిన విత్తనాలు సాగు చేశారు. అయితే వేసిన అన్ని చోట్లా మొత్తం పంట దెబ్బతింది. పరిహారం కోసం రైతులు చెప్పులు కాదు.. కాళ్లరిగేలా తిరిగినా ఇంతవరకు ఏపీ సీడ్స్ పట్టించుకోలేదు. ఇక ప్రైవేటు కంపెనీల మాయాజాలం సరేసరి. కేంద్రమంత్రి సుజనాచౌదరి సమీప బంధువుకు చెందిన విభాసీడ్స్ కంపెనీ విత్తనాలను లింగపాలెం, పెదవేగి, చింతలపూడి మండలాల్లోని సుమారు రెండువేల మంది మొక్కజొన్న రైతులు కొనుగోలు చేశారు. నిర్ణీత సమయానికి పంట కోసి తిరిగి అదే కంపెనీకి విక్రయించారు. 35 రోజుల్లోపు ఆ సొమ్మును చెల్లించాల్సిన కంపెనీ ఆర్నెల్లు దాటినా పైసా కూడా ఇవ్వలేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ రైతుల సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. 7. బీమా లేక పంటల బీమా పథకాలున్నా పశ్చిమ రైతులకు కొరగాకుండా పోతున్నాయి. ఏటా వందల రూ.కోట్లు బీమా ప్రీమియం చెల్లిస్తున్నా అక్కరకు మాత్రం రావడం లేదు. హెలెన్, పెలైన్, లెహర్ తుపాను దెబ్బలకు వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. అయితే బాబు సర్కారు వచ్చిన తర్వాత రెండు నెలల కిందట వచ్చిన బీమా పరిహారం కేవలం రై. 200 కోట్లు. ఇది కూడా వాస్తవ సాగుదారులకు కాకుండా భూయజమానులకు మాత్రమే అందుతోందన్న ఆరోపణలున్నాయి. ఇక రుణమాఫీ జాప్యం ఫలితంగా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయలేదు. దీంతో బీమా ప్రీమియం కూడా రైతులు చెల్లించలేదు. ఫలితంగా బీమాకు రైతులు దూరమయ్యారు. 8. అటకెక్కిన ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల కంటే సర్కారు కొట్టే చావు దెబ్బే రైతును బాగా కుంగదీస్తోందనడానికి ఇన్పుట్ సబ్సిడీ ప్రసహనమే ఉదాహరణ. ఏడాదిన్నర కితం కురిసిన భారీ వర్షాలకు, హెలెన్, లెహెర్ తుపానులకు జిల్లాలో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు జిల్లాలో పర్యటించి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వెంటనే ఆదుకుంటానని హామీనిచ్చారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది నెలలు గడుస్తున్నా, బాబు ఎక్కడా దీని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆహార పంటలకు ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.20 వేలు ఇవ్వాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న బాబు నోట ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ మాటే పెగలడం లేదన్న విమర్శలున్నాయి.