ఇదేంటి.. మంత్రివర్యా! | TDP Govt cheating farmers | Sakshi
Sakshi News home page

ఇదేంటి.. మంత్రివర్యా!

Published Thu, Mar 10 2016 1:12 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

ఇదేంటి.. మంత్రివర్యా! - Sakshi

ఇదేంటి.. మంత్రివర్యా!

 రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నా అలాంటిదేమీ లేదని బొంకుతున్న సర్కారు
 నిత్యం వేలం ప్రకటనలు జారీ చేస్తున్న బ్యాంకులు
 చంద్రబాబు హామీ అమలుకాక జిల్లాలో రూ.3,550 కోట్ల విలువైన బంగారం వేలం

 
 నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు.. నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు’ అన్నట్టుంది పాలకుల తీరు. బంగారు ఆభరణాలను.. చివరకు భార్య మెడలోని పుస్తెలను సైతం బ్యాంకుల్లో తనఖాపెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఢంకా బజాయించి మరీ హామీలిచ్చి.. ఆనక మొహం చాటేసి.. అన్నదాతలను అడుగడుగునా దగా చేస్తున్న పాలకులు ఇప్పుడు కొత్తపల్లవి అందుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో చేసిన ప్రకటన జిల్లాలోని రైతులను ఆశ్చర్య చకితుల్ని చేసింది.
 
  ‘పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్నట్టు సమాచారం లేదు’ అని మంత్రి ప్రత్తిపాటి నిండు సభలో నిర్లజ్జగా బొంకేశారు. రైతులు కుదువబెట్టిన బంగారాన్ని జిల్లాలోని బ్యాంకులన్నీ ఏడాది కాలంగా వరుసపెట్టి మరీ వేలం వేస్తున్నాయి. ఇదేమీ పట్టించుకోని సర్కారు తనకేమీ తెలియనట్టే నిద్ర నటిస్తోంది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. పాలకులు నిర్లజ్జగా అబద్ధపు ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. బంగారంపై జిల్లాలోని రైతులు తీసుకున్న రుణాలు.. ఆభరణాలను వేలం వేస్తున్న తీరు తెన్నులను పరిశీలిస్తే...
 
 ఏలూరు (మెట్రో) : ‘రుణాన్ని చెల్లించని కారణంగా ఏ ఒక్క రైతుకు చెందిన బంగారాన్ని వేలం వేసేందుకు చర్యలు తీసుకోలేదు. పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలను బ్యాంకులు వేలం వేస్తున్నట్టు సమాచారం లేదు’ అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలివి. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి.. రుణమాఫీ హామీని నమ్మిన పాపానికి రైతుల్లో చాలామంది ఇప్పటికే బంగారాన్ని పూర్తిగా వదిలేసుకోవాల్సి వచ్చింది. తక్షణమే రుణం మొత్తాన్నిచెల్లించకపోతే
 
 బంగారాన్ని వేలం వేస్తామంటూ అనేక మంది రైతులకు నిత్యం బ్యాంకుల నుంచి నోటీసులు అందుతూనే ఉన్నాయి. ‘ఆదుకోండి మహాప్రభో’ అని అన్నదాతలు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. కనీసం రుణాల చెల్లింపునకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా.. ఏ ఒక్క రైతుకు చెందిన బంగారాన్ని వేలం వేయడం లేదని, బ్యాంకులు ఇలాంటి పని చేస్తున్నట్టు సమాచారం కూడా తమ వద్ద లేదని సాక్షాత్తు మంత్రి ప్రత్తిపాటి ప్రకటించడం కర్షకులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
 
 రూ.3,550 కోట్ల విలువైన బంగారం బ్యాంకుల పరం
 రుణమాఫీ హామీ నెరవేరక.. వడ్డీ భారం తడిసిమోపెడు కావడంతో అప్పులను తీర్చలేక.. జిల్లాలో 2లక్షల మంది రైతులు తాము కుదువబెట్టిన రూ.3,550 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకులకే వదిలేశారు. జిల్లాలో మొత్తం 8 లక్షల మంది రైతులు రూ.7,245 కోట్లను పంట రుణాలుగా తీసుకోగా.. వీరిలో 3.50 లక్షల మంది కేవలం బంగారాన్ని తనఖాపెట్టి రూ.3,800 కోట్ల రుణాలు పొందారు.
 
 ఇదంతా 2013, 2014 సంవత్సరాల్లో జరిగింది. బ్యాంకు బకాయిలను చెల్లించి.. బంగారాన్ని విడిపించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. ఊరూవాడా పర్యటించిన చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బంగారు ఆభరణాలపై రైతులు తీసుకున్న పంట రుణాలను సైతం పూర్తిగా మాఫీ చేస్తామని ఎడాపెడా హామీలు గుప్పించారు. దీంతో బంగారంపై రుణాలు తీసుకున్న రైతులు కూడా బ్యాంకులకు ఆ మొత్తాలను చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక.. బంగారు ఆభరణాలపై గల రూ.3,800 కోట్ల రుణాల్లో కేవలం రూ.250 కోట్లను మాత్రమే మాఫీ చేశారు.
 
 దీంతో రూ.3,550 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకుల చెరలోనే ఉండిపోయాయి. ఈ రుణాలపై వడ్డీలు పెరిగిపోవడంతో బ్యాంకులు గత ఏడాది మార్చి నుంచి రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. వారి బంగారాన్ని బహిరంగ వేలంలో విక్రయించగా వచ్చిన సొమ్మును బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. అలా చేసినా బకాయి మొత్తం తీరకపోతే మిగిలిన సొమ్మును తక్షణమే చెల్లించాలంటూ తిరిగి నోటీసులు ఇస్తున్నాయి. బకాయి తీరిపోగా రూ.వందో, రెండొందలే మిగిలితే చెక్కుల రూపంలో రైతులకు చెల్లిస్తున్నాయి.
 
 తిరగరాసినా కష్టమవుతోంది
 అక్కడక్కడా కొందరు రైతులు మాత్రం బయటి నుంచి అధిక వడ్డీలకు అప్పుతెచ్చి బ్యాంకు బకాయిలను చెల్లిస్తున్నారు. అవే ఆభరణాలను తిరిగి అదే బ్యాంకులో తనఖా పెట్టి ఆ మొత్తాల్ని తీసుకెళ్లి రుణదాతలకు ఇస్తున్నారు. ఇలా చేసే సందర్భంలో చేతిసొమ్ము కూడా హారతి అవుతోంది. మరోవైపు కొందరు రైతులు వడ్డీ మొత్తాన్ని చెల్లించి బంగారంపై అప్పును తిరగరాయించుకుంటున్నారు. ఇలా సుమారు 1.50 లక్షల మంది రైతులు బకాయిలను తిరగ రాయించుకుని వడ్డీ రూపంలో రూ.17 కోట్లను చెల్లించారు. ఇంకా 2 లక్షల మంది రైతులు కేవలం వడ్డీ రూపంలోనే రూ.33 కోట్లను చెల్లించాల్సి ఉంది. వీరంతా అసలు అప్పు మాట దేవుడెరుగు.. కనీసం వడ్డీ సొమ్ము సైతం చెల్లించి రుణాన్ని తిరగరాయించుకునే స్థోమత లేక బంగారు ఆభరణాలను బ్యాంకులకే వదిలేస్తున్నారు.
 
 చంద్రబాబు మాట విని నిలువునా మునిగాం

 చంద్రబాబు మాటలు విని రుణమాఫీ అవుతుందని భావించాము. నిలువునా మునిగిపోయాం. రుణమాఫీ కాకపోగా తీసుకున్న అప్పుకంటే అధికంగా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా అధిక వడ్డీ వసూలు చేసి మా నగలను వేలం వేసే స్థితికి చంద్రబాబు హామీలు తీసుకెళ్లాయి.
 - బోయిడి ప్రసాద్, సిద్ధాంతం
 
 మొదటికే మోసం వచ్చింది
 రుణమాఫీ వర్తిస్తుందని ఎదురు చూసినప్పటికీ నిరాశే మిగిలింది. అప్పు చేసిన దానికంటే అధికంగా వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. మొదటికే మోసం వచ్చినట్టైంది మా పరిస్థితి. రుణమాఫీ కోసం ఎదురుచూసిన మేమంతా వడ్డీల భారం పెరిగిపోవడంతో చివరకు బంగారం వేలం వేయించుకునే స్థితికి చేరుకున్నాం.
 - ధర్నాల వెంకట సూర్యనారాయణ, మునమర్రు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement