పార్టీలో ఉండి ఏం ప్రయోజనం?
పసుపుదండులో అసమ్మతి జ్వాల రాజుకుంటోంది. అధికారమే అండగా, అక్రమార్జనతో బొజ్జలు నింపుకున్న బడా నాయకులు పార్టీ స్థాపించిన నాటి నుంచి జెండా మోసిన తమ్ముళ్లను విస్మరించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బాగా వెనకేసుకున్న నేతలు
సరిగ్గా ఎన్నికల ముందు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి పొరపాటున ఓడిపోతే దా‘రుణ’మైన పరిస్థితులు చవిచూడాల్సిన ఓ టీడీపీ బడా నాయకుడు అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. చంద్రబాబు అబద్దపు హామీలను నమ్మిన రైతన్నలు, మహిళలు, యువకుల పుణ్యమాని చాన్నాళ్ల తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు. అంతే సరిగ్గా ఇరవై నెలల్లోనే అప్పులన్నీ తీర్చి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఇంకో రెండు ఎన్నికలు ఎదుర్కొనేంతటి ఆర్థిక పరిపుష్టిని సంపాదించేశాడు. డెల్టాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పరిస్థితి కూడా ఇంతే. ఆర్థికబాధలతో కొట్టుమిట్టాడిన ఆయన ఇప్పుడు కేవలం ఒక్క ఇసుక దోపిడీ ద్వారానే రూ.వంద కోట్లు వెనకేశాడు. నాదగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా.. అని కార్యకర్తలను చీటికీమాటికీ కసురుకునే ఓ టీడీపీ నాయకుడు ఇప్పుడు కోడిపందేల్లో రూ.కోట్లు పోయినా లెక్కచేయనంత సంపాదించేశాడు.
జిల్లాలోనే అతితక్కువ ఓట్ల మెజారిటీతో బయటపడ్డ ఓ ప్రజాప్రతినిధి... ఎలాగోలా తొలిసారి గెలిచాం.. మళ్లీ ఛాన్స్ రాదు.. అందినంత ఇప్పుడే దోచేయాలంటూ తమ్ముడిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. ఇసుక, మట్టి, పైరవీలు, బలవంతపు వసూళ్లు.. ఇలా ప్రతి పనిలోనూ కాసులు కొల్లగొడుతున్నాడు. ఇక ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అయితే రూ.వంద కోట్ల లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ మనదేనంటూ అస్మదీయులకు చెప్పుకుని ధనార్జనే ధ్యేయంగా అవసరమైతే దౌర్జన్యాలకూ దిగుతున్నాడు. ఇలా.. వీళ్లే కాదు. జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధుల్లో దాదాపు అందరి పరిస్థితి ఇదే. ఎవరికి వారు.. ఎవరిస్థాయిలో వాళ్లు అడ్డూఅదుపూ లేకుండా అందినంత దోచుకుంటున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగరహస్యం.
ప్రజల కంటే ముందుగా కార్యకర్తల్లోనే తీవ్ర వ్యతిరేకత
ఇరవై నెలల పాలనలో ధనార్జనే లక్ష్యంగా పాకులాడుతున్న ప్రజాప్రతినిధులపై ప్రజల కంటే ముందు తెలుగుతమ్ముళ్ల నుంచే వ్యతిరేకత మొదలైంది. కేవలం తమకు, తమ చుట్టూ ఉండే భజనపరులకు తప్పించి కార్యకర్తల బాగోగులు పట్టించుకోని నేతలపై క్యాడర్ దాడి ప్రారంభమైంది. ‘నేతల్లా అడ్డగోలు సంపాదన మాకొద్దు.. అవినీతి, అక్రమాల సొమ్ము వద్దే వద్దు.. కనీసం మా బాగోగులు పట్టించుకునేవారేరీ.. నామినేటెడ్ పోస్టులూ జిల్లాకు దక్కలేదు. పార్టీ పదవులైనా వచ్చాయా అంటే అదీ లేదు.. పార్టీ పదవులకు కూడా మేం పనికిరామా’ అని కార్యకర్తలు నేరుగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి వచ్చింది. గ్రామ, మండల కమిటీలు వేయకుండా ఎన్నాళ్లు పట్టించుకోకుండా వదిలేస్తారు.. ఏదన్నా పదవిస్తే విజిటింగ్ కార్డు కొట్టించుకుని ఆనందపడదామనుకున్నాం.. చివరికి ఆ చిన్నపాటి సంతోషాలకూ మేం నోచుకోలేకపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం ప్రయోజనం?
‘పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నాం.. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజలకేమో గానీ మాకే అందడం లేదు., ఇసుకను దోచేసి చాలామంది నేతలు కోట్లకు పడగలెత్తారు. కానీ కార్యకర్తలైన మేము ఇళ్లు కట్టుకుందామంటే ఇసుక దొరక్క అష్టకష్టాలు పడుతున్నాం.. కార్యకర్తలైన మాకే రుణాలు అందడం లేదు.. పచ్చచొక్కాలు వేసుకున్న మాకే ఈ పరిస్థితి ఉంటే నిత్యం ప్రజల మధ్యనే ఉండే మేము ఏ ముఖం పెట్టుకుని బయట తిరుగుతాం..’’ అని కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఎన్నాళ్ల నుంచో గూడుకట్టుకున్న ఆవేదన, అసంతృప్తి ఇటీవల భగ్గుముంది.
మూడురోజుల క్రితం ఏలూరులో జరిగిన పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశంలో కార్యకర్తల ఆగ్రహం బట్టబయలైంది. క్యాడర్ మాటల దాడితో నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రతిపక్షాల తీరు బాగోలేదంటూ బిగ్గరగా మాట్లాడి ఒకరు, సంబంధం లేని పొలికేకలు వేసి మరొక నేత ఆ సమావేశం నుంచి ఎలాగొలా బయటపడ్డారు. కానీ నిఘావర్గాలు, రాజకీయ పరిశీలకుల్లో మాత్రం ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. పసుపుదళంలో రెండేళ్లుగా గూడుకట్టుకుని ఒక్కసారిగా రగిలిన అసమ్మతి జ్వాల పచ్చ నేతల రాజకీయ భవితవ్యాన్ని దహించివేయడం ఖాయమని అప్పుడే రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.