ఎన్నాళ్లీ ఎదురుచూపులు? | nominated posts Replaced | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

Published Mon, May 18 2015 1:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

nominated posts Replaced

 ప్రపంచంలోనే కార్యకర్తల బలమున్న పార్టీ తెలుగుదేశం.. నేతలు ఎందరు బయటకు వెళ్లినా కేడర్ అండతోనే పార్టీ ముందుకుపోతోంది.. అటువంటి తమ్ముళ్ల కోసం ఏమైనా చేస్తా.. అంటూ తరచూ టీడీపీ శ్రేణులను ఉత్తేజ పరిచే చంద్రబాబునాయుడు తీరా పదవులు పందేరం వచ్చేటప్పటికి వాయిదా మంత్రం జపిస్తుండడంతో నేతలు మనస్థాపం చెందుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నామినేటెడ్ పదవుల కోసం ఎన్నాళ్లిలా ఎదురుచూపులు చూడాలని వారు మథనపడుతున్నారు.
 
 ఏలూరు :దసరా, సంక్రాంతి, ఉగాది ఇలా పండగలు దాటిపోయినా పదవుల పంపిణీ విషయంలో ముహూర్తం నిర్ణయించకపోవడంతో టీడీపీ నేతల్లో కలవరం రేగుతోంది. అష్టకష్టాలు పడి వ్యయప్రయాసలకోర్చి పార్టీపరంగా అన్ని సీట్లు గెలిపించినా అధిష్టానం కనికరించకపోవడంతో  సీనియర్ నాయకులు, కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. ఇప్పటి వరకు కేవలం మొక్కుబడిగా నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను ఏడాది కాలానికి ప్రభుత్వం ప్రకటించింది. దీనికితోడు టీటీడీ పాలకవర్గంలోను జిల్లాకు సముచిత స్థానం దక్కలేదు. డెరైక్టర్ పదవులను ఆశించిన ఇద్దరి నేతలూ భంగపడేలా పార్టీ అధినేత వ్యవహరించడంతో వారు మనస్థాపంతో ఉన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పాలకవర్గం ఎంపికలో దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరి అంతా ఓకే అయినా ఇంతవరకు ప్రకటించకపోవడంతో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
 
 మహిళా నేతలు కూడా ఈసారి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. ఉంగుటూరు ఏఎంసీ పదవి కోసం పార్టీ మహిళా నాయకురాలు, నారాయణపురం మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నీటి సంఘాల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ పోస్టులను కూడా నామినేటెడ్ కోటా కిందకు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. త్వరలో అన్ని నామినేటెడ్ పోస్టుల్ని కలిపి ఒకేసారి ప్రకటిస్తారా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.
 
 మహానాడు తర్వాత
 ఈ నె ల 27వ తర్వాత గండిపేటలో జరిగే పార్టీ మహానాడు పూర్తి అయ్యాక నామినేటెడ్ పదవుల పంపిణీలో అందరికీ న్యాయం చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం చెప్పారు. దీంతో తమ్ముళ్ల ఆశలు చిగురించాయి. అయితే జిల్లా కార్యవర్గంలో పార్టీ పదవుల ఎంపిక కూడా ఈ వారంలో పూర్తి చేయాల్సి ఉండడంతో ఎక్కడా అసంతృప్తికి తావు లేకుండా సాఫీగా పదవులు పందేరం పూర్తి చేయడానికి ఈ ప్రకటన చేశారా అన్న అనుమానాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.
 
 స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి యత్నాలు
 త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులకు సైతం నేతలు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి పైడిచింతపాడు నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సైదు సత్యనారాయణ, గతంలో మాదేపల్లి నుంచి కాంగ్రెస్ రెబ ల్ అభ్యర్థిగా పోటీపడి ఓటమి పాలైన బాలిబోయిన వెంకటేశ్వరరావులు ఈ దిశగా జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
 
 విప్ చింతమనేని ప్రభాకర్ వెంట సైదు, మాజీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ వెంట వెంకటేశ్వరరావులు తిరుగుతున్నారు. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల విషయంలో పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మంతెన సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణలు అవకాశం దక్కకపోతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో నిలిచే అవకాశం ఉంది. దీంతో పోటీ పెరుగుతుంది. ఈ రేసులో ఎవరు విజయం సాధిస్తారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement