విపక్షంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు అన్నదాతలపై తుపానుస్థాయిలో ప్రేమను ఒలకబోశారు. వారి శ్రేయస్సే లక్ష్యమని గర్జించారు. అప్పటి ప్రభుత్వాలపై కన్నెర్రజేశారు. ఆందోళనలూ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. యథాప్రకారం రైతన్నల పాలిట తన మునుపటి నైజాన్నే చాటుతున్నారు. రైతు రుణమాఫీ అమలులో మెలికలూ, మడతలే కాదు.. హెలెన్ తుపాను బాధిత రైతులకు నేటికీ పెట్టుబడి రాయితీ అందకపోవడమూ ఆయన పాలన స్వభావాన్ని పట్టిచ్చే మచ్చుతునకే.
అమలాపురం :అధికారంలోకి వస్తే రైతులకు ఎన్నో మేళ్లు చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం పెంచి, సకాలంలో అందజేయడం ఒకటి. అధికారం దక్కాక ఒకదాని తరువాత ఒక హామీని పక్కనపెడుతున్నట్టే.. ఈ హామీని కూడా బాబు విస్మరించారు. ఈ కారణంగా హెలెన్‌కు రావాల్సిన పెట్టుబడి రాయితీ ఈరోజుకు కూడా రైతులకు అందలేదు. 2013 నవంబరులో వచ్చిన హెలెన్ తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి తుడిచి పెట్టుకుపోయింది. పరిహారంగా జిల్లాలోని రైతులకు రూ.110 కోట్ల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) రావాల్సి ఉంది. అప్పటి వరకు హెక్టారుకు రూ.ఆరు వేలు ఉన్న పరిహారాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.పది వేలకు పెంచారు.
అంతకుముందే పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు ఇవ్వాలని ప్రతిపక్షనేతగా చంద్రబాబు నిరాహారదీక్ష చేశారు. రైతులకు తక్షణం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నది కూడా నిరాహారదీక్ష డిమాండ్లలో ఒకటి. ఈ నేపథ్యంలో బాబు అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడి రాయితీ పెంచుతారని రైతులు ఆశించారు. హుదూద్ తుపాను వల్ల ఉత్తరాంధ్రలో పంటలు తుడిచిపెట్టుకుపోయి, రైతులు కట్టుబట్టలతో మిగిలినా బాబు మాత్రం పెట్టుబడి రాయితీ పెంచలేదు. పోనీ సకాలంలో ఇచ్చారా అంటే అదీలేదు. హెలెన్ తుపాను వచ్చి 16 నెలలు కావస్తున్నా పెట్టుబడి రాయితీ మాత్రం విడుదల కాలేదు. దీనితో రైతులు నిరాశ చెందుతున్నారు. ఒకవైపు రుణమాఫీ ఈ రోజుకూ తేలకుండా పోవడం, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందలేకపోవడం, మరోవైపు రాయితీలందక రైతులు ఖరీఫ్ సాగులో చేసినట్టే రబీకి కూడా అప్పులు చేస్తున్నారు.
ఎంఎన్‌ఏఐఎస్‌ను అపహాస్యం చేస్తున్న బీమా సంస్థ
హెలెన్ తుపానుతో నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారాన్ని కూడా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికీ కొంత మందికి పూర్తిగా అందించలేదు. వివిధ కారణాలు చూపి పరిహారాన్ని జాప్యం చేస్తోంది. జిల్లాలోని కొన్ని గ్రామాలకు ఇంకా పరిహారం అందించలేదు. ప్రధానంగా 250 ఎకరాల కన్నా తక్కువ వరిసాగు జరుగుతున్న గ్రామాలను గ్రూపింగ్ విలేజ్‌లంటూ పక్క గ్రామాల్లో కలుపుతున్నారు. లేకపోతే గ్రామం యూనిట్‌గా పరిహారం నమోదు ఇబ్బంది అవుతోందన్న వంకతో పరిహారాన్ని ఆలస్యం చేస్తున్నారు. రుణాలు తీసుకోకుండా వ్యక్తిగతంగా ప్రీమియం చెల్లించిన వారికి కూడా ఇంతవరకు పరిహారం అందలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బీమా ప్రీమియం చెల్లించాల్సినప్పుడు గడువు పెట్టి మరీ కట్టించుకుని, పరిహారం ఇచ్చేటప్పుడు గడువు అనేది లేకుండా వాయిదాలపై వాయిదాలు వేయడం భావ్యం కాదని వాపోతున్నారు. రుణాలతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన సుమారు నాలుగు వేల మంది రైతులు పరిహారం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. అలాగే పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం అందించాలన్న నిబంధన కూడా హెలెన్ నష్టానికి సంబంధించి అమలు కాలేదు. తద్వారా సవరించిన పంటల బీమా పథకం (ఎంఎన్‌ఏఐఎస్) పథకాన్ని బీమా సంస్థ అపహాస్యం చేస్తోంది.
ఆదుకునేది ఇంకెన్నడో?
Published Sun, Feb 22 2015 12:00 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement