రాజమండ్రి :రుణమాఫీ కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తొలి సంతకం చేసి.. కొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. కానీ ఇప్పటికీ అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అడ్డగోలు నిబంధనలతో తొలి విడతలోనే ప్రభుత్వం సగంమందిని ఏరివేసింది. మిగిలిన వారిలో చాలామందికి ఆధార్ నంబరు కలవలేదని, భూమి సర్వే నంబరు తప్పని ఎగ్గొట్టింది. దీనికి బ్యాంకు అధికారుల తప్పిదాలు కూడా తోడయ్యాయి. వీటన్నింటి పుణ్యమా అని జిల్లాలో 25 శాతం మంది అర్హులైన రైతులకు ఇప్పటికీ రుణమాఫీ వర్తించలేదు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అన్ని అర్హతలూ ఉండి రుణమాఫీ పొందనివారు ఈ నెల 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఆయా డివిజన్ కేంద్రాల్లో రైతు రుణమాఫీ సలహా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రుణమాఫీ కావాలనుకున్న రైతులు తమ దరఖాస్తులను ఈ కేంద్రాల్లో అందిస్తే.. వాటిని అక్కడి సిబ్బంది పరిశీలిస్తారు. అంతా బాగా ఉంటే.. ఆ రైతులు తమ దరఖాస్తులను తిరిగి కాకినాడ తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకినాడలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వారం రోజులుగా రైతులు పోటెత్తుతున్నారు.
సెలవులు మినహా ప్రతి రోజూ దాదాపు 250 మంది దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 1,600 మంది దరఖాస్తులు అందజేశారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సలహా కేంద్రాలకు సైతం రైతులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రాజమండ్రిలోని సలహా కేంద్రాన్ని రోజుకు 80 నుంచి 110 మంది, అమలాపురంలో 50 నుంచి 60 మంది, పెద్దాపురంలో 70 నుంచి 100 మంది, రామచంద్రపురంలో రోజుకు 50 మంది వరకూ వచ్చి, దరఖాస్తులు ఇస్తున్నారు. గిరిజన రైతులకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడం, తగినంత ప్రచారం చేయకపోవడంతో రంపచోడవరం సలహా కేంద్రానికి రైతులు నామమాత్రంగానే వస్తున్నారు. గడచిన నాలుగు రోజుల్లో ఇక్కడకు కేవలం ఏడుగురు రైతులు మాత్రమే రావడం గమనార్హం.
కానరాని కనీస సౌకర్యాలు
ఈ కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. ఎండన పడి వస్తున్న రైతులు సేద తీరేందుకు అవకాశం లేదు. సమ్మెతో ఆర్టీసీ బస్సులు లేక, ఉన్న బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక వారు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు కూడా కార్యాలయాల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. దరఖాస్తు నింపడం తెలీక, అందుబాటులో ఎక్కువమంది సిబ్బంది లేక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 50 ఏళ్లు పైబడినవారితోపాటు మహిళా రైతులు సైతం ఈ కేంద్రాలకు వస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. ఇంతా చేసి సలహా కేంద్రం వద్ద దరఖాస్తును సరిచూసి బాగానే ఉందని కాకినాడలో అందజేయాలని చెప్పడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ‘మళ్లీ అక్కడికేం వెళ్తాం? ఇక్కడే తీసుకోవచ్చు కదా’ అని రైతులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పేవారే లేరు.
ఎందుకిలా కాల్చుకు తింటున్నారు?
‘నాలుగైదుసార్లు తిప్పితే నీరసం వచ్చి పోతారు.. డబ్బులివ్వక్కర్లేద్దని చూస్తున్నారు. మాఫీ రాదంటే పోతాం కదా! మమ్మల్ని ఇలా ఎందుకిలా కాల్చుకు తింటున్నారు?’ అని వాపోతున్నారు కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన రైతు గొసుల లచ్చయ్య. ఈయనకు 3.32 ఎకరాల భూమి ఉంది. దీనిపై రూ.85 వేల రుణం తీసుకున్నారు. అయితే 2.40 ఎకరాలు మాత్రమే ఉందని, ఇందుకు రూ.57,600 మాత్రమే మాఫీ వస్తుందని ఆన్‌లైన్‌లో వచ్చింది. అదేమంటే ‘పై నుంచి అలా వస్తే మమ్మల్నేం చేయమంటారు?’ అని బ్యాంకోళ్లు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇస్తే ఇవ్వాలి.. లేకపోతే మానేయాలి..
‘ఇస్తే ఇవ్వాలి. లేకపోతే మానేయాలి. ఎన్నిసార్లు తిప్పుతారు? అమ్మకు బాగోక నేనొచ్చాను. ఇక్కడికొచ్చాక కాకినాడ ఎల్లమంటున్నారు’ అని వాపోతున్నారు సీతానగరానికి చెందిన బొల్లంపల్లి శాంత. తల్లి శ్యామల 2012లో రూ.12 వేలు అప్పు తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.18 వేలైంది. ఇంతా చేస్తే అదే సర్వే నంబరు మీద కౌలుదారులు మాఫీ పొందారని సమాచారం రావడంతో శ్యామల, శాంత అయోమయానికి గురవుతున్నారు.
అన్నదాతతో సర్కారు ఆటలు
Published Tue, May 12 2015 1:59 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement