అన్నదాతకు వెన్నుపోటే | CM Chandrababu Naidu is cheating farmers | Sakshi
Sakshi News home page

అన్నదాతకు వెన్నుపోటే

Published Sun, Feb 22 2015 12:14 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM Chandrababu Naidu is cheating farmers

పట్టిసీమ ఎత్తిపోతలకు సిద్ధమవుతున్న సర్కారు
     డెల్టా ఎడారవుతుందన్నా ఖాతరు చేయని మొండితనం

 (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానానికి తావిస్తున్నాయి. ఒక రంగంతో ముడిపడి ప్రత ్యక్షంగా, పరోక్షంగా పలు రంగాలపై ప్రభావం చూపే అంశాల్లో కూడా ప్రజాభిప్రాయానికి సర్కార్  విలువ నివ్వడం లేదు. భవిష్యత్తరాలకు భరోసా ఇవ్వలేని నిర్ణయాన్ని సర్కార్ ఏ ప్రయోజనం కోసం తీసుకున్నా తప్పే. ఈ వారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ని ర్ణయం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ధుల మంజూరు, త్వరలో శంకుస్థాపన. గత రెండు, మూడు నెలలుగా పట్టిసీమకు చంద్రబాబు సర్కార్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిసినప్పటి నుంచి గోదావరి జిల్లాల రైతులు కంటిపై కునుకు లేకుండా ఉన్నారు.
 
 బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కుతున్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతలు వద్దేవద్దని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పార్టీరహితంగా కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలు మొండి సర్కార్‌ను కదిలించలేదు. రుణమాఫీపై ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబుపై నెలకొన్న వ్యతిరేకతను పళ్లబిగువున అదిమిపట్టుకుంటే పట్టిసీమ ఎత్తిపోతలతో మరోసారి నడ్డివిరిచారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏటా వచ్చే వరదలతో సుమారు 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంటే.. దాన్ని సద్వినియోగం చేసేందుకే పోలవరం ప్రాజెక్టు తలపెట్టారు.
 
 అలాంటప్పుడు మధ్యలో  ఎత్తిపోతలు ఎందుకంటే రాయలసీమ కోసమేనంటున్న చంద్రబాబు సర్కార్‌కు గోదావరి జిల్లాల్లో ఏటా రబీలో ఎదురవుతున్న సాగునీటి ప్రతిబంధకాలు కనిపించడం లేదా అని రైతు ప్రతినిధులు నిలదీస్తున్నారు. ఒక్క మన జిల్లాలోని గోదావరి డెల్టాలో వరి రబీలో 3.50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇవి కాక చేపల చెరువులు, తీరప్రాంత మండలాల్లోని కొబ్బరితోటలకు డెల్టా కాలువలే ఆధారం. ప్రస్తుతం వీటన్నింటికీ సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటప్పుడు ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా భూములు బీడువారి ఎడారులు కాక ఏమవుతాయనే విజ్ఞుల ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కానీ నిరంకుశ ధోరణితో పట్టిసీమ  శంకుస్థాపనకు సిద్ధమవుతోంది.
 
 హోం మంత్రి సొంత మండలంలోనే దళిత సర్పంచ్‌పై దౌర్జన్యం
 అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా జిల్లాలో అధికారపార్టీ నేతల తీరు మారడం లేదు. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులతో అసలు పాలకులు ఎటు పోతున్నారా అనే అనుమానం కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు పెచ్చుమీరుతున్నాయి. తునిలో మొదలైన ఈ తరహా దాడులు కోనసీమకు కూడా పాకాయి. కోనసీమలో సామాజిక వర్గ పోరు ఎప్పటి నుంచో వేళ్లూనుకుని ఉంది. ఒక సామాజికవర్గమంటే మరో సామాజికవర్గం పొడగిట్టని పరిస్థితి. ఇది గ్రామాల్లో మరీ ఎక్కువనే చెప్పొచ్చు. యువత ఆలోచనలు విద్య, వ్యాపారాల వైపు మళ్లడంతో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.
 
 ఈ తరుణంలో కోనసీమలోని ఎస్.యానాంలో సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై టీడీపీ నాయకులు దాడికి దిగడమే కాక ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చిన 108ని కూడా ధ్వంసం చేశారు. దాడులకు పాల్పడ్డ వారికి తెరవెనుక అధికారపార్టీ పెద్దలు ప్రోత్సాహమో, ఏమైనా వారు చూసుకుంటారన్న ధీమాయో ఈ బరితెగింపునకు కారణం. అధికారం ఉందని అనవసర వివాదాలను ప్రోత్సహిస్తే ‘కొరివితో తలగోక్కున్నట్టే’నని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. హోం మంత్రి రాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తం పరిధిలోని ఎస్.యానాంలో.. అందునా ఎమ్మెల్యేగా, ఎంపీగా దళితులే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. దళిత సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై దాడి జరిగిన విషయంలో పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ ఘర్షణల విషయంలో పోలీసుల తీరు కూడా పలు సందేహాలకు తావిచ్చింది. సామాజిక నేపథ్యం ఉన్న ఇలాంటి ఘర్షణలప్పుడే పోలీసులు మరింత చురుకైన పాత్ర పోషించాలి. లేదంటే భారీ మూల్యం తప్పదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.
 
 కాగా అమలాపురంలో పోలీసుల చొరవను కోనసీమవాసులు అభినందిస్తున్నారు. అక్కడ పాతుకుపోయి సెటిల్‌మెంట్‌లు, భూ కబ్జాలు చేస్తున్న రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం, ఆ ప్రాంతానికి చెందిన చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రితో కూడిన హోంమంత్రి పదవి రావడంతో రౌడీషీటర్లు పేట్రేగిపోయారని చెప్పొచ్చు. విషయాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన మీదట జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కొంత కఠినంగా వ్యవహరించబట్టే సర్కిల్ స్థాయిలో పోలీసులు కూడా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు.
 
 గొల్లవిల్లిలో జాతీయస్థాయి క్రీడాపర్వం
 మొదటి నుంచి క్రీడలకు పెద్దపీట వేసే ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ఈ వారం జాతీయస్థాయి నిమ్మకాయల వెంకటరంగయ్యనాయుడు మెమోరియల్ పేరుతో వాలీబాల్‌పోటీలకు ఆతిథ్యమిచ్చింది. రెండోసారి మహిళా వాలీబాల్‌పోటీలు సైతం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ , తమిళనాడు, కర్నాటక సహా మహరాష్ట్రలతో పాటు రైల్వే ప్రాంతీయ జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. నాలుగు రోజులు జరిగిన పోటీల్లో అంతర్జాతీయ వాలీబాల్, బీచ్‌వాలీబాల్ క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించి స్ఫూర్తిగా నిలిచారు.  
 
 ఇద్దరిని బలిగొన్న గ్యాస్ రీఫిల్లింగ్
 తునిలో వంట గ్యాస్ రీ ఫిల్లింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రమాదమని తెలిసీ కొందరు స్వార్థపరులు వంట గ్యాస్ అక్రమ రీఫిలింగ్ చేస్తూనే ఉన్నారు. దుర్ఘటనలు జరిగినప్పుడు సివిల్ సప్లయిస్ అధికారులు, పోలీసులు హడావిడి చేయడం, తరువాత పట్టనట్టు వదిలేయడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇళ్లలో పెద్దఎత్తున గ్యాస్ నిల్వ చేస్తున్నారంటే ఇందుకు ఏజెన్సీలు సహకరించడం కూడా కారణమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement