అన్నదాతకు అష్టకష్టాలు | Andhra Pradesh CM Chandrababu Naidu is cheating farmers | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అష్టకష్టాలు

Published Mon, Jan 26 2015 4:51 AM | Last Updated on Sat, Jun 2 2018 4:51 PM

అన్నదాతకు అష్టకష్టాలు - Sakshi

అన్నదాతకు అష్టకష్టాలు

 రైతుకూ బాబు వెన్నుపోటు
 అప్పులతో కుదేలు.. మాఫీ కాక దిగాలు
 8నెలల పాలనలో అన్నివిధాలా నష్టాలు
 నిరాశ, నిస్పృహలతో కర్షకులు
 సంక్షోభం దిశగా వ్యవసాయం

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : భారతదేశ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులు మునుపెన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలో.. ప్రతికూల వాతావరణమో కాదు.. కేవలం రైతన్నపై పగపట్టినట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లనే పశ్చిమ రైతు కాడి కిందపడేసే దుస్థితి నెలకొంది. హుదూద్ తుపానును సైతం తట్టుకుని పంట పండించిన జిల్లా రైతు సర్కారు దెబ్బకు మాత్రం విలవిల్లాడిపోతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో అన్నదాత కష్టాల సాగుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రుణమాఫీపై సర్కారు నయామోసం, సాగుకోసం బ్యాంకులు కొత్త రుణా లు ఇవ్వని నిర్వాకంతో ఎక్కువ వడ్డీకి ప్రైవేటు అప్పులు చేయడం, సాగునీటి అవస్థలు, యూరియా కష్టాలు, విత్తన మోసాలు, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించలేక నష్టపోవడం, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ లేక.. అన్నీ కలగలిపి రైతన్నను తీవ్ర అగాధంలోకి నెట్టి వేస్తున్నాయి. అన్నదాతలపై కనీస కనికరం లేని సర్కారు తీరుతో తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశా నిస్పృహలతో జిల్లా రైతులు కుంగిపోతున్నారు.
 
 1. రుణం నిజం.. మాఫీ మోసం
 చంద్రబాబు రుణమాఫీ  మాయాజాలంలో చిక్కుకుని పశ్చిమ రైతు నిండా మునిగిపోయాడు. జిల్లావ్యాప్తంగా 8లక్షల 79 వేలమంది రైతుల అకౌంట్లు, మరో లక్షకి పైగా ఉన్న డ్వాక్రా సంఘాల అకౌంట్లకు గాను దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే లక్షన్నర పరిమితి, ఇంటిలో ఒక్కరికే మాఫీ మెలికతో జిల్లాలో రైతుల రుణమాఫీకి సర్కారు విదిల్చంది కేవలం రూ.369 కోట్లు మాత్రమే. కనీసం కేటాయించిన ఆ రూ.369 కోట్లయినా రైతుల ఖాతాల్లో జమ అయిందా అంటే అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటే జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ ప్రసహనం ఎలా కొనసాగుతుందో అర్థమవుతుంది.
 
 2. ప్రైవేటు అప్పుల ఊబిలో రైతన్నలు
 రుణమాఫీ జాప్యం, అమల్లో అస్తవ్యస్త విధానాలు చివరికి రైతులకు బ్యాంకు నుంచి అప్పులు పుట్టకుండా చేశాయి. 2013-14లో పంటరుణాల లక్ష్యం రూ.4,374కోట్లు కాగా, రూ.6,084 కోట్ల రుణాలను బ్యాంకర్లు రైతులకు అందించారు. ఆ ఏడాది లక్ష్యానికి మించి అప్పులు తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని రూ.5221 కోట్లకు పెంచారు. కానీ సర్కారు రుణమాఫీ మోసంతో  పంటరుణాల పంపిణీని బ్యాంకులు నామమాత్రం చేసేశాయి. గడిచిన ఖరీఫ్ సీజన్‌లో కేవలం రూ. 900 కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేయగా,  ప్రస్తుత రబీ సీజన్‌లో ఇంతవరకూ రుణాల పంపిణీనే మొదలు కాలేదు. ఇక కౌలు రైతులకు రెండు సీజన్లలోనూ నయా పైసా కూడా బ్యాంకుల నుంచి అప్పు పుట్టలేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు.
 ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లోనే తిష్టవేసి అధిక వడ్డీలను రైతుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. మరో పక్క ధాన్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి కుదించడంతో మిల్లర్లు కమిషన్‌దారుల ద్వారా రైతులకు ఇప్పించే రుణాలను తగ్గించేశారు. దీంతో కొన్నిచోట్ల సాగుదారులు అప్పులు దొరక్క  విల్లవిల్లాడే పరిస్థితి కూడా నెలకొంది.
 
 3. యూరియా కష్టాలు
 ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో యూరియా వినియోగం పెరిగిన ప్రస్తుత నేపథ్యంలో రైతులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. అందుబాటులో ఉన్నచోట డీలర్ల మాయాజాలం, ఇష్టారాజ్యంగా అధిక రేట్లకు విక్రయించడంతో  చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ వద్ద యూరియా బస్తా ధర రూ.280లు ఉండగా ప్రైవేటు డీలర్లు రూ.320 నుంచి రూ.330లు చొప్పున  విక్రయిస్తున్నారు. సొసైటీలకు ఎరువు వచ్చినా రైతులకు సకాలంలో సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది. రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నప్పటికీ చాలా మండలాల్లో  రైతుకి ఒక్క బస్తా చొప్పున మాత్రమే అందిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి పంటతో పాటు మెట్టలో సాగ వుతున్న వర్జీనియా పొగాకు, చెరుకు, మొక్కజొన్న, అరటి, కూరగాయలు పంటలకు సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల తాళ్లపూడి మండలం మలకపల్లిలో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలే లేవు.
 
 4. ధాన్యం విక్రయాలతో నష్టాలు
 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబడి అమ్మిన రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాడు. జిల్లా మొత్తం మీద 171 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా  ఇప్పటికే ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు డివిజన్‌లలో కేంద్రాలను మూసివేశారు. నర్సాపురం డివిజన్‌లో మాత్రం అక్కడక్కడా తెరిచి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా 37,454 మంది రైతుల నుంచి 4,67 లక్షల క్యూబిక్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ.650 కోట్లు కాగా వీటిని నిర్వహించినందుకు గాను డ్వాక్రా సంఘాలకు రూ.15 కోట్లు కమీషన్‌గా ఇచ్చారు. ఇందులో ధాన్యం అమ్మిన రైతులకు రూ.32 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
 
 5. చి‘వరి’ భూములకు సాగునీటి అవస్థలు
 ప్రస్తుత రబీ సీజన్‌లో సాగునీటి సమస్యతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో నాట్లు పడని దుస్థితి తలెత్తినా అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవువుతుండగా, ప్రస్తుత దాళ్వాలో ఒక్క పశ్చిమ డెల్టాలోనే 2.32 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆచంట ప్రాంతాల్లోని శివారు భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. వేసవికాలానికి ఇంకా రెండు నెలల ముందుగానే గోదావరిలో నీటి లభ్యత రోజురోజుకీ తగ్గిపోతుండటంతో సాగునీటికి తీవ్ర కటకట తలెత్తింది.
 
 6. విత్తన మోసాలు
 విత్తనాల కంపెనీల మోసాలతో పశ్చిమ రైతులు నిలువునా దగా పడుతున్నారు. బహుళ జాతి విత్తన కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీసీడ్స్ సరఫరా చేసిన విత్తనాలతో కూడా పంటలు దెబ్బతింటున్నాయంటే ఇక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్‌లో నల్లజర్ల, పోలవరం, తాళ్లపూడి, మండలాల్లో వేలాదిమంది రైతులు ఏపీ సీడ్స్ పంపిణీ చేసిన విత్తనాలు సాగు చేశారు. అయితే వేసిన అన్ని చోట్లా మొత్తం పంట దెబ్బతింది. పరిహారం కోసం రైతులు చెప్పులు కాదు.. కాళ్లరిగేలా తిరిగినా ఇంతవరకు ఏపీ సీడ్స్ పట్టించుకోలేదు. ఇక ప్రైవేటు కంపెనీల మాయాజాలం సరేసరి. కేంద్రమంత్రి సుజనాచౌదరి సమీప బంధువుకు చెందిన విభాసీడ్స్ కంపెనీ విత్తనాలను లింగపాలెం, పెదవేగి, చింతలపూడి మండలాల్లోని సుమారు రెండువేల మంది మొక్కజొన్న రైతులు కొనుగోలు చేశారు. నిర్ణీత సమయానికి పంట కోసి తిరిగి అదే కంపెనీకి విక్రయించారు. 35 రోజుల్లోపు ఆ  సొమ్మును చెల్లించాల్సిన కంపెనీ ఆర్నెల్లు దాటినా పైసా కూడా ఇవ్వలేదు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ రైతుల సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు.
 
 7. బీమా లేక
 పంటల బీమా పథకాలున్నా పశ్చిమ రైతులకు కొరగాకుండా పోతున్నాయి. ఏటా వందల రూ.కోట్లు బీమా ప్రీమియం చెల్లిస్తున్నా అక్కరకు మాత్రం రావడం లేదు. హెలెన్, పెలైన్, లెహర్ తుపాను దెబ్బలకు వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. అయితే బాబు సర్కారు వచ్చిన తర్వాత రెండు నెలల కిందట వచ్చిన బీమా  పరిహారం కేవలం రై. 200 కోట్లు. ఇది కూడా వాస్తవ సాగుదారులకు కాకుండా భూయజమానులకు మాత్రమే అందుతోందన్న ఆరోపణలున్నాయి. ఇక రుణమాఫీ జాప్యం ఫలితంగా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయలేదు. దీంతో బీమా ప్రీమియం కూడా రైతులు చెల్లించలేదు. ఫలితంగా బీమాకు రైతులు దూరమయ్యారు.
 
 8. అటకెక్కిన ఇన్‌పుట్ సబ్సిడీ
 ప్రకృతి వైపరీత్యాల కంటే సర్కారు కొట్టే చావు దెబ్బే రైతును బాగా కుంగదీస్తోందనడానికి ఇన్‌పుట్ సబ్సిడీ ప్రసహనమే ఉదాహరణ. ఏడాదిన్నర కితం కురిసిన భారీ వర్షాలకు, హెలెన్, లెహెర్ తుపానులకు జిల్లాలో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు జిల్లాలో పర్యటించి వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వెంటనే ఆదుకుంటానని హామీనిచ్చారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది నెలలు గడుస్తున్నా, బాబు ఎక్కడా  దీని గురించి  మాట్లాడిన దాఖలాలు లేవు. ఆహార పంటలకు ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.20 వేలు ఇవ్వాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న బాబు నోట ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ మాటే పెగలడం లేదన్న విమర్శలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement