‘మాఫీ’పై ఇదేం మడత? | chandrababu naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

‘మాఫీ’పై ఇదేం మడత?

Published Wed, Jul 23 2014 12:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

‘మాఫీ’పై ఇదేం మడత? - Sakshi

‘మాఫీ’పై ఇదేం మడత?

సాక్షి, కాకినాడ / అమలాపురం టౌన్ :‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న...ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అతికినట్టు సరిపోతుంది. అధికారమిస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికి ఓట్లు దండుకున్నారు.తీరా అధికారంలోకి వచ్చాక ఏదోవిధంగా ఎగ్గొట్టేందుకు రంధ్రాన్వేషణ చేసిన బాబు చివరకు రుణమాఫీని రూ.లక్షన్నరతో సరిపెట్టాలని చూస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు.జిల్లాలో 3.60 లక్షల మంది రైతులకు సంబంధించిన పంట రుణాలు రూ.2,350 కోట్లున్నాయి. వాటిలో పాతబకాయిలు సుమారు రూ.450 కోట్ల వరకు ఉన్నాయి. మరో 4.50 లక్షల మంది రైతులకు రూ.3,860 కోట్ల మేర బంగారంపై తెచ్చుకున్న రుణాలు ఉన్నాయి. టర్మ్ లోన్స్ మరో రూ.2,270 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో రూ. 650 కోట్లకు పైగా కన్వర్టడ్ క్రాప్ లోన్స్ ఉన్నాయి.
 
 అంటే రైతుల రుణాలు ఎంత తక్కువ లెక్కేసుకున్నా 8,480 కోట్లున్నాయి. ఈ మొత్తం రుణాలన్నీ మాఫీ అయిపోతాయని గంపెడాశతో ఉన్న రైతులకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం అశనిపాతంగా మారింది. కుటుంబానికి రుణమాఫీ రూ.లక్షన్నరకు పరిమితం చేస్తూ  బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో రైతులకు గరిష్టంగా రూ.3,500 కోట్లకు మించి రుణాలు మాఫీ అయ్యే పరిస్థితి లేదని బ్యాంకింగ్ వర్గాలే చెబుతున్నాయి. రూ.లక్షన్నర పరిమితి ఏ విధంగా వర్తింపజేయాలి? కుటుంబం యూనిట్‌గా అంటే ఏఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే మార్గదర్శకాలు వస్తే కానీ కచ్చితంగా ఎంతమందికి, ఏ మేరకు రుణాలు మాఫీ అవుతాయో చెప్పలేమని     బ్యాంకు అధికారులు చెబుతున్నారు. లిఖిత పూర్వకంగా మార్గదర్శకాలు వస్తే పైన పేర్కొన్న మొత్తం ఇంకా తగ్గే అవకాశాలుండవచ్చు..లేదా కాస్త పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
 
 మిగిలిన రుణాలకు వడ్డీ రాయితీ లేనట్టే
 అయితే రూ.లక్ష న్నరకు పరిమితి విధించడం వల్ల వడ్డీలేని రుణంగా తీసుకున్న మిగిలిన పంట రుణాలకు వడ్డీ రాయితీ వర్తించే అవకాశం ఉండదు. రుణమాఫీ ఆశతో ఇన్నాళ్లు వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో ఇప్పటికే  ఈ రుణాలు తడిసిమోపెడయ్యాయి. ఇప్పటికిప్పుడు వడ్డీతో సహా ఈ మొత్తం చెల్లించలేని దుస్థితిలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు తీసుకున్న రుణాలు గరిష్టంగా రూ. లక్షన్నర నుంచి రూ. రెండులక్షల వరకు ఉంటాయి. వీరి రుణాల్లో 75 శాతం రుణాలు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే వీటికి ఏమేరకు కొర్రీలు వేస్తారోననే భయం వారిని వెన్నాడుతోంది.
 
 ‘ఆధార్’సాకుతో కొర్రీలకు సిద్ధం
 ఏమాత్రం అవకాశం ఉన్నా రుణమాఫీ భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకు ఆధార్‌ను ఆయుధంగా చేసుకుంటోంది. ఒక కుటుంబంలో ఒకే రుణాన్ని అదీ రూ. లక్షన్నరకు కుదించిన ప్రభుత్వం ఆధార్ సాకుతో కొర్రీలు మీద కొర్రీలు వేసి ఆ భారం కూడా మరింత తగ్గించుకోవాలని చూస్తోంది. జిల్లాలో 293 సహకార సంఘాల పరిధిలో దాదాపు 90 వేల మంది రైతులకు సుమారు రూ. 900 కోట్లు మేర రుణాలున్నాయి. ఆధార్ లింక్ పెట్టడంతో వాటి జిరాక్స్‌ను తెప్పించేందుకు మంగళవారం నుంచి ఆయా సంఘాలు రంగంలోకి దిగాయి. రుణాలు తీసుకున్నట్టుగా ఆధారాలు సంఘాల్లో ఉన్నా... రుణమాఫీకి లింకు చేసిన ఆధార్‌కార్డును రైతు తెచ్చి చూపించి జిరాక్సు కాపీ ఇస్తేనే మాఫీకి అర్హుడిగా నిర్ధారించే పరిస్థితి నెలకొంది. అప్పున్న రైతులంతా ఆధార్ కార్డులు తెచ్చి చూపించాలని, బుధవారం సాయంత్రానికి జిరాక్స్ కాపీలు ఇవ్వాలంటూ మంగళవారం సంఘాల పరిధిలో లౌడ్ స్పీకర్లు, దండోరాలతో ప్రచారం చేయించారు. దీంతో పలువురు రైతులు తమ ఆధార్‌కార్డులతో సహకార సంఘాలకు వెళ్లి వాటి ఆధారాలు చూపిస్తున్నారు.
 
 ఇదీ ఆధార్ వెనుక అసలు మర్మం
 ఏ రైతైనా తన కుటుంబంలో మరొకరి పేర ఉన్న రుణం... లేదా వేరే గ్రామంలో ఉన్న పంటలకు పొందిన రుణం మాఫీ చేయించుకోకుండా ఆధార్ అస్త్రాన్ని సంధించేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఉదాహరణకు వెంకయ్య అనే రైతు తనకు చెందిన పంట భూమికి సంబంధించి సహకార సంఘం లేదా వాణిజ్య బ్యాంకులో రుణం పొంది ఉంటాడు. వెంకయ్య కుటుంబంలోనే అతని  భార్య లేదా కూతురు... కోడలు ఇలా ఎవరైనా కుటుంబ సభ్యుల పేరుతో వేరే గ్రామంలో ఉన్న పంట భూములపై రుణాలు పొంది ఉంటారు. ఒక కుటుంబం.. షరతుతో కుటుంబంలో ఎందరికి రుణాలున్నా అందులో రూ.లక్షన్నర మాత్రమే మాఫీ అవుతుంది.
 
 ఆ రైతుకు వేరే చోట ఉన్న రుణాలు... కుటుంబంలోని ఇతర సభ్యుల పేరుతో వేరే చోట ఉన్న రుణాలు కూడా రద్దు చేయించుకుని లబ్ధి పొందుతారన్న అనుమానంతో ఆధార్ కార్డు అనుసంధానం నిబంధన విధించారు. ఆధార్‌కార్డు పూర్తి ఆన్‌లైన్‌తో కూడుకున్నది. ఆధార్‌కార్డు నంబరును విశిష్ట గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. ఆధార్‌లో కార్డుదారుని కనుబొమ్మలు(ఐరిష్) వంటి ఆధారాలు నిక్షిప్తమై ఉంటాయి. కుటుంబంలోని వారు వేరేచోట రుణం (రూ.లక్షన్నరకు మించి) రద్దుకు ప్రయత్నించినా ఆధార్‌కార్డు ఆ గట్టు రట్టు చేస్తుంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిఘా రూపంలో అనుమానించి ఆధార్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. మొత్తమ్మీద ప్రభుత్వ నిర్ణయం అన్నదాతలకు అశనిపాతంగా ఉంది.
 
 మిగిలిన రుణానికి వడ్డీ భారమౌతుంది
 చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పి అంచెలంచెలుగా రూ.1.50 లక్షలకు కుదించడంతో ఇబ్బందుల్లో పడ్డాం. అది కూడా కుటుంబంలో ఒకరికే రుణమాఫీ వర్తింస్తుందని చెప్పడం మరింత కుంగదీస్తోంది. నాకు రూ. 2.5 లక్షల రుణం ఉంది. రూ.1.50 రుణమాఫీ చేస్తే మిగిలిన రూ.1లక్షకు  వడ్డీ తడిసి మోపెడవుతుంది. మొత్తం రుణం మాఫీ అవుతుందని ఆశిస్తే అవేదనే మిగిలింది.
 - పంబల శివన్నారాయణ, నేదునూరు, అయినవిల్లి మండలం.
 
 రూ.లక్షన్నర పరిమితి సరికాదు
 చంద్రబాబు రుణమాఫీ అమలులో ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నర పరిమితి విధించడం సరికాదు. రూ.లక్షన్నరకు మించి పంటల కోసం రుణాలు తీసుకున్న కుటుంబాలున్నాయి. అలాంటి కుటుంబాల రైతులు ఎన్నికల ముందు మొత్తం రుణం మాఫీ చేస్తారన్న హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయారు. ఇప్పుడు వారికి రుణాలపై వడ్డీ పెరిగిపోతోంది. తొలుత సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదు.
 - ముత్యాల జమీలు, బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
 
 మార్గదర్శకాలొస్తే కానీ చెప్పలేం
 రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై అధికారిక ప్రకటన చేసిన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే కానీ ఎంతమందికి, ఏ మేరకు రుణాలు మాఫీ అవుతాయి? ఏ మేరకు లబ్ది చేకూరుతుంది? అనేది చెప్పలేం. ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలందితే క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు చేసి జాబితాలు సిద్ధం చేసేందుకు మరింత సమయం పడుతుంది.
 - జగన్నాధస్వామి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement