చంద్రబాబుపై డ్వాక్రా మహిళల కన్నెర్ర
కాకినాడ క్రైం :రుణాలు మాఫీ అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చనుకున్న తమ ఆశలను చంద్రబాబు నీరుగార్చారని కాకినాడ నగరానికి చెందిన వందలాదిమంది డ్వాక్రా మహిళలు నిప్పులు కక్కారు. ఎన్నికల పబ్బం గడవగానే.. మాట మారుస్తున్న టీడీపీ అధినేత తీరును దుయ్యబట్టారు. ప్రచారసమయంలో ఇంటింటికీ తిరిగి రుణాల రద్దు చేస్తామనడమే కాక.. వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం ఇప్పిస్తామన్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పత్తా లేకుండా పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కదం తొక్కారు. స్థానిక జగన్నాథపురం చర్చిస్క్వేర్ సెంటర్‌లోని సిటీ ఎమ్మెల్యే వనమాడి ఇంటిని ముట్టడించారు.
డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని వనమాడి మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ జరుగుతుందని ఆశపడి ఓట్లేసి గద్దెనెక్కిస్తే తెలుగుదేశం నేతలు ముఖం చాటేశారని దుయ్యబట్టారు. నగర పరిధిలోని 28, 29, 31 వార్డుల్లో సుమారు 550 డ్వాక్రా గ్రూపులున్నాయని, రుణాల రద్దుకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే వారంతా టీడీపీ ఓట్లేసి పట్టం కట్టారని ఎలుగెత్తారు. అయితే రుణాలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేయడంతో ఎమ్మెల్యే వనమాడి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా అందుబాటులో లేరని నిరసించారు. నాలుగైదుసార్లు వచ్చినా ఆయన లేకపోవడంతో విధి లేక ఇంటిని ముట్టడించామంటూ తమకు న్యాయం జరిగే వరకూ అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు.
ముఖం చాటేస్తున్న వనమాడి..
ఎన్నికల సమయంలో ఇళ్లకు వచ్చి డ్వాక్రా రుణాలు కట్టవద్దనడమే కాక తమ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తామన్న వనమాడి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని డ్వాక్రా మహిళలు విమర్శించారు. మరోపక్క బ్యాంకులు తమను రుణాలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వనమాడి డ్వాక్రా మహిళలతో ఇంతవరకూ కనీసం సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రుణాలు తిరిగి చెల్లించేది లేదని కరాఖండిగా చెప్పారు. కాగా ఎమ్మెల్యే ఇంటిని మహిళలు ముట్టడించిన సంగతి తెలిసి పలువురు తెలుగుదేశం నాయకులు అక్కడకు చేరుకున్నారు. చివరికి ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ వచ్చి డ్వాక్రా మహిళలతో చర్చించారు. ఎమ్మెల్యే ఊర్లో లేరని, తాను విషయం చెప్పి డ్వాక్రా మహిళలతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని నచ్చచెప్పారు. దాంతో సుమారు రెండు గంటల పాటు సాగించిన ఆందోళనను విరమించారు.