
సీఎం ప్రజలను మోసగిస్తున్నారు
వంగర : రైతు, డ్వాక్రా రుణాల మాఫీ వంటి హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. సోమవారం ఆమె మండలంలోని సంగాం గ్రామంలోని పవిత్ర సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె తొలిసారిగా వంగర మండలానికి రావడం, ఈ మండలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల వలస రాజశేఖరానికి దశబ్దాల తరబడి ఇక్కడి ప్రజలతో సత్సం బంధాలుండడంతో ఆమెకు వంగర నాయకులు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలందించి స్వాగతించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతు, డ్వాక్రా రుణాల హామీతో ఎన్నికల్లో గెలిచిన బాబు, అనంతరం ఎటువంటి మాఫీ చేయకుండా ప్రజలకు అన్యాయం చేశారన్నారు. పింఛన్ల ఎంపికలో వైఎస్సార్ సీపీ అభిమానులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
పచ్చచొక్కాల వారికి లబ్ధి చేకూర్చే క్రమంలో జిల్లాలో 28 వేల పింఛన్లు తొలగించారని విమర్శించారు. పేదవాడు ఇల్లుకట్టుకోవడమే గగనంగా మారిందని, నిరుపేదలకు అందుబాటులో ఉండే ఇసుక ఇప్పుడు రూ.వేలల్లో పలుకుతోందని అన్నారు. నిర్మాణాలు లేక కూలీలకు పనులు దొరకడం లేదని అన్నారు. దీనితో వారు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు.
రానున్న కాలంలో తమ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని, ప్రజల్లో టీడీపీపై ఇప్పటికే వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పచ్చ చొక్కాలకే పరిమితం చేస్తుండడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాలవలస ఇందుమతి, ధవళేశ్వరరావు, పార్టీ మండల నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, కరణం సుదర్శనరావు, మజ్జి వెంకటనాయుడు, కర్రి గోవిందరావు, ఉదయాన మురళీకృష్ణ, గేదెల రామకృష్ణ, కిమిడి సన్యాసినాయుడు, ఆవు చిన్నప్పలనాయుడు, గణేష్ బెనర్జీ, బెవర అప్పలనాయుడు, ఉగిరి ముత్యాలు, కళావతి, కిమిడి చిట్టిబాబు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.