మోసం దా‘రుణం’
‘‘దా‘రుణం’గా మోసపోయాం. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన పాపానికి చంద్రబాబు తమను నిలువునా ముంచాడు’’ అంటూ రైతులు సీఎం చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి తొలి సంతకం రుణమాఫీ అన్న బాబు ఎట్టకేలకు ఆరునెలల తర్వాత గురువారం రైతు రుణమాఫీపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల పదో తేదీ నుంచి అర్హులైన వారి ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తామని ప్రకటించారు. అయితే వాటికి కొన్ని ఆంక్షలు విధించడంపై రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.50 వేలలోపు వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని, మిగిలిన వారికి దశలవారీగా ఐదేళ్ల కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రైతుల్లో కలవరం మొదలైంది. అధికారపార్టీ మద్దతుదారులు, మిత్రపక్ష నాయకులు బాబు ప్రకటనను స్వాగతించినా, సగటు రైతు ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. జిల్లాలో సగం మంది రైతులకు కూడా మాఫీ వర్తించకపోవడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రకటనపై పలు రాజకీయ పార్టీల, వివిధ సంఘాల నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
బాబు ప్లేటు మార్చారు
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ గద్దెనెక్కిన చంద్రబాబు పంట రుణాలంటూ ప్లేటు మార్చారు. వాటిని కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా రకరకాల ఆంక్షలతో లబ్ధిదారుల జాబితాను అడ్డంగా కుదించేశారు. తొలిదశలో కొందరికే రుణమాఫీ అంటూ మిగిలిన వారికి బాండ్లు ఇస్తామంటున్నారు. బాండ్లతో రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు.
- కర్రి పాపారాయుడు, జిల్లా కన్వీనర్,
వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం, మండపేట
మసిపూసి మారేడుకాయ
చంద్రబాబు ఎన్నికల రుణమాఫీ హామీ మసిపూసి మారేడుకాయ చందాన ఉంది. ముఖ్యమంత్రి మాటల్లో విశ్వసనీయత లేదు. ఎంత మాఫీ చేస్తారనే విషయమై మొదట్నుంచి ఆయన తీరు అనుమానంగానే ఉంది. రైతు రుణమాఫీ ప్రకటించిన వెంటనే కుటుంబానికి రూ.లక్షన్నర అని, తరువాత 20 శాతం అని, ప్రస్తుతం రూ.50 వేలు రద్దు చేస్తామని చెప్పారు. రుణమాఫీకి ఆధార్, రేషన్ కార్డులు లంకె పెట్టడం కప్పదాటు వ్యవహారంలా ఉంది.
- కందుల దుర్గేష్, డీసీసీ అధ్యక్షుడు
రైతులకు నమ్మకాన్ని కల్పించలేదు
ఎన్నికల వాగ్దానమైన రుణమాఫీని టీడీపీ సక్రమంగా నిర్వహించలేదు. రైతులకు నమ్మకాన్ని కల్పించలేకపోయింది. రుణమాఫీ జాబితాలో తాము ఉన్నామో! లేమోనన్న ఆందోళనలో ఉన్నారు. పేద రైతులకు అన్యాయం చేశారు. చాలా మంది రైతుల పేర్లు జాబితాలో లేవు.
- కర్నాకుల వీరాంజనేయులు, రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి
రుణమాఫీతో రైతులకు న్యాయం
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులకు న్యాయం జరుగుతుంది. రైతులకు రూ.50 వేలలోపు రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ అవుతాయి. రూ.50 వేలు పైబడిన రుణాలను 20 శాతం చొప్పున ఐదు విడతల్లో మాఫీ చేయడం జరుగుతుంది. సుమారు 43 లక్షల మందికి రుణ మాఫీ వర్తిస్తుంది.
- పర్వత చిట్టిబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
బాబు వాగ్దానాలు ఎడారిలో ఎండమావి
చంద్రబాబు వాగ్దానాలు ఎడారిలో ఎండమావిలా మిగిలిపోయాయి. రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి, ప్రస్తుతం దశలవారీగా చేస్తాననడం దారుణం. ఈ ఐదే ళ్లలో బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేయవు. రూ లక్ష రుణ మాఫీ చేస్తానని, ఇప్పుడు రూ.50 వేల లోపు మాత్రమే రుణ మాఫీ అంటున్నారు. రైతులు తమ తీర్పును స్పష్టంగా చెప్పేరోజు దగ్గరలోనే ఉంది.
- మీసాల సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి
హామీని నిలబెట్టుకున్నారు
ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. రూ.50వేల లోపు రుణాలన్నీ ఒక్కసారిగా మాఫీ చేయడం సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేసినట్టే. మిగిలిన రుణాలన్నీ దశలవారీగా మాఫీ చేస్తామని ప్రకటించడం వెనుక చిత్తశుద్ధి కనిపిస్తోంది. ఉద్యాన పంటలకు కూడా ఎకరాకు రూ.10వేలు మాఫీ చేస్తామనడం ఆహ్వానించదగ్గ విషయం.
- వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
మొత్తం మాఫీ చేయాలి
ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని తొలి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే సగం మంది రైతులకు కూడా మాఫీ చేయకపోవడం అన్యాయం. నిబంధనలు పక్కనబెట్టి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తేనే చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని వాణిజ్య పంట రైతులకు కేవలం రూ.పది వేలు ప్రోత్సహం ఇవ్వడం భావ్యం కాదు.
- దొంగ నాగేశ్వరరావు, బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు, అంబాజీపేట
రైతులకు ద్రోహం చేయడమే
ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. రూ.లక్షా 50వేలు రుణమాఫీ చేస్తానని చెప్పి, ఈ రోజు అనేక పరిమితులు విధించి రైతాంగాన్ని కుంగదీశారు. దాదాపు కోటి మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా, చివరకు రూ.30 లక్షల మందికి కుదించడం రైతులకు ద్రోహం చేయడమే.
- దడాల సుబ్బారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి,
కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు