రైతును ముంచడమే టీడీపీ లక్ష్యం
కొయ్యలగూడెం : రైతును భూస్థాపితం చేయడమే టీడీపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కనపడుతోందని, ఇందుకు రైతుల భూములను బలిపెట్టి వారి జీవితాలను పణంగా పెడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. సోమవారం కొయ్యలగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ జిల్లా నాయకులు తాడికొండ మురళికృష్ణ, జిల్లా సర్పంచ్‌ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవి గంజిమాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించటానికి కృషి చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానిని మరుగునపరిచే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ కొత్త వివాదాన్ని సృష్టించారన్నారు. ఇప్పటికే ఏజెన్సీ, మెట్టప్రాంతంలో చింతలపూడి, కొవ్వాడ ఎత్తిపోతల పథకాలు, పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ నిర్మాణం వలన వేలాది ఎకరాల భూములను రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు పట్టిసం ఎత్తిపోతల పథకం పేరుతో మరికొన్ని వందలాది ఎకరాలు భూములను రైతులు వదులుకోవాల్సి పరిస్థితి నెలకొందన్నారు. ఏ మాత్రం ఉపయోగం లేని వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని దారిని మళ్లించడం చంద్రబాబునాయుడు ఎత్తుగడలలో భాగమేనన్నారు. రైతు రుణమాఫీని మర్చిపోవటానికి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కనుమరుగు చేయటానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలతో ఉద్యమాలు నిర్వహిస్తుదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన యూరివర్సిటీ పేరును మార్పు చేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుందని మురళి, గంజిమాల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యాన వర్సిటీ పేరు మారిస్తే ప్రజలు తరిమికొడతారు
జంగారెడ్డిగూడెం : తాడేపల్లిగూడెం మండలం వెంకట్రాయన్నగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచనను టీడీపీ నాయకులు విరమించుకోకపోతే ప్రజలు వారిని తరిమికొడతారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తక్కువ సాగు నీటితో వాణిజ్యపు విలువలున్న పంటలను రైతులు పండించాలంటే ఉద్యాన అధికారుల సహాయ సహకారాలు అవసరమని వైఎస్ రాజశేఖరరెడ్డి వెంకటరామన్నగూడెం ప్రాంతంలో ఉద్యాన వర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించి రైతులకు ఎంతో మేలు జరిగేలా కృషి చేయడం జరిగిందన్నారు. తరువాత వైఎస్సార్ అకాల మృతి, అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి యూనివర్సిటీకి వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీగా పేరుపెట్టారన్నారు. ఆయన పేరును తొలగించే అర్హత టీడీపీ నాయకులకు ఎక్కడిదని బాలరాజు ప్రశ్నించారు. అబద్దపు వాగ్ధానాలతో రైతులను, ప్రజలను ఘోరంగా మోసంచేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను అయోమయంలో, గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాలే కారణమన్నారు. అటువంటి గోదావరి జిల్లాల ప్రజలను ఆందోళన పరిచేవిధంగా టీడీపీ పాలన సాగుతోందని విమర్శించారు. వర్సిటీ పేరు తొలగించే ప్రయత్నం మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.