
దావోస్, సింగపూర్, జపాన్ అంటూ మోసం...
హైదరాబాద్ : ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఏలుగెత్తి చాటేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల పాటు దీక్ష చేపడుతున్నారని ఆపార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హామీల పరంపరతో అధికారంలోకి వచ్చి.. ఆనక రైతులను, డ్వాక్రా మహిళలను, అన్నివర్గాల ప్రజలను వంచనకు గురిచేస్తున్న చంద్రబాబు తీరు, సర్కారు విధానాలపై సమరశంఖం పూరించేందుకు వైఎస్ జగన్ తణుకులో రైతు దీక్షకు శ్రీకారం చుడుతున్నారన్నారు. రైతుల వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని, ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర నిర్వహిస్తామన్నారు.
మోసగించిన ప్రభుత్వాన్ని, పార్టీలను వ్యతిరేకిద్దామని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. దావోస్, సింగపూర్, జపాన్ అంటూ చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రజలను మోసగిస్తోందని ఆయన అన్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీన తణుకులో దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.