పసుపు కుంకుమ సభలో మాట్లాడుతున్న డ్వాక్రా మహిళ
సాక్షి, విశాఖపట్నం: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వేదికగా శుక్రవారం పసుపు–కుంకుమ–2 పేరిట హంగామా చేశారు. సభకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైగా సాయంత్రం 4.30 గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల ఆలస్యంగా 6.30 గంటలకు చేరుకున్నారు. దీంతో సభకు వచ్చిన మహిళలంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తొలుత నాలుగు జిల్లాలకు చెందిన డ్వాక్రా సంఘాల జిల్లా అధ్యక్షులతో మాట్లాడించారు. వారంతా తనను పొగుడుతుంటే వేదికపై కూర్చున్న చంద్రబాబు తెగ మురిసిపోయారు. సరిగ్గా 6.45 గంటల నుంచి దాదాపు 7.40 గంటల వరకు సీఎం ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం డ్వాక్రా మహిళలను ప్రాధేయపడడంతోనే సరిపోయింది.
నన్ను నమ్మండి అంటూనే.. మిమ్మలను నమ్మొచ్చా అంటూ మాట్లాడారు. ఎప్పటిలాగే డ్వాక్రా ఉద్యమానికి తానే మూల పురుషుడినని, డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రికలని, 94 లక్షల సైన్యం నాకు ఉందంటూ గొప్పలు చెప్పుకున్నారు. రేపటి నుంచి గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ కార్యకర్తల్లా పనిచేయాలని సీఎం పిలుపు ఇవ్వగా.. మహిళల నుంచి కనీస స్పందన కరువైంది. ‘పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తున్నా.. నమ్మండి ఈ చెక్కులన్నీ క్యాష్ అవుతాయి’ అంటూ మహిళలను నమ్మించేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కిమిడి కళా వెంకటరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు ‘సాక్షి’పై తమ అక్కసు వెళ్లగక్కారు. ఇక చివరగా రూ.10 వేల కోట్ల నమూనా చెక్కును నాలుగు జిల్లాల డ్వాక్రా సంఘాల అధ్యక్షులకు అందజేశారు. కాగా సభ నిర్వహణ ఆలస్యం కావడంతో తిరుగు ప్రయాణంలో మహిళలు తాము వచ్చిన బస్సులు ఎక్కడున్నాయో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా పలువురు మహిళలు తప్పిపోవడం.. వారి కోసం పదేపదే మైకుల్లో చెప్పడం కనిపించింది. పొరుగు జిల్లాలకు 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు వెళ్తూనే కన్పించాయి. రాత్రి భోజనంగా పులిహోర పొట్లాలు ఇవ్వడంపై మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment