
చంద్రబాబు సీమాంధ్ర ద్రోహి: భూమన
చంద్రబాబు నాయుడు చేపట్టనున్న యాత్ర ఆత్మగౌరవ యాత్ర కాదని, ఆత్మఘోష యాత్రని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల మనోభవాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
చంద్రబాబు సీమాంధ్ర ద్రోహి అని విమర్శించారు. ఆత్మఘోష యాత్రను తప్పి కొడతారని హెచ్చరించారు. వైఎస్ జగన్కు మద్దతుగా తిరుపతితో మహిళలు చేస్తున్న రిలే దీక్షకు భూమన సంఘీభావం ప్రకటించారు.
జగన్ చేస్తున్న నిరహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. జగన్ చేస్తున్న దీక్ష, వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాల పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. సీమాంధ్రను తెలంగాణలో భాగంగా ఉంచేంతవరకు తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వేర్పాటువాదులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. షర్మిల చేపట్టనున్న బస్సు యాత్రతో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతారని భూమన కరుణాకర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.