
ఏకగ్రీవంగా చంద్రబాబు మళ్లీ ఎన్నిక
విశాఖ: టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి ప్రకటించారు. చంద్రబాబుకు అనుకూలంగా 30సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. కేంద్రంలో ఏర్పడ్డ అన్ని కాంగ్రెస్సేతర ప్రభుత్వాల్లో టీడీపీ భాగస్వామి అయిందని తెలిపారు. ఈవీఎంలపై ప్రజలు సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన ఒకే సారి ఎన్నికపై సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఒకే సారి ఎన్నికలను బలపరుస్తుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను త్వరగా ఆములు చేయాలని కోరారు.
ఇతర రాష్ట్రాల తో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం ఆదుకోవాలని తెలిపారు.కేంద్రంలోని బీజేపీతో విడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని అయితే, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. మహానాడుకు ఇప్పటి వరకు రూ.7.51కోట్లు వరకు విరాళాల రూపంలో పోగయ్యాయని నేతలు ప్రకటించారు.