జేసీ బ్రదర్స్‌కు బాబు గ్రీన్ సిగ్నల్ | Chandrababu naidu given green signal to JC brothers | Sakshi
Sakshi News home page

జేసీ బ్రదర్స్‌కు బాబు గ్రీన్ సిగ్నల్

Published Tue, Feb 25 2014 2:32 PM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM

జేసీ బ్రదర్స్‌కు బాబు గ్రీన్ సిగ్నల్ - Sakshi

జేసీ బ్రదర్స్‌కు బాబు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించారు. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం లోక్‌సభ టికెట్ ఇవ్వలేమని, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ మెలిక పెట్టారు.


జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడమని హెచ్చరించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు వెనక్కి తగ్గారు. ఆ ఇద్దరూ జేసీ బ్రదర్స్‌తో రాజీపడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. సీమాంధ్ర టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.

సమావేశం పూర్తయిన తర్వాత అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై.. పార్టీ స్థితిగతులను సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే అంశంపైనే చంద్రబాబు ఎక్కువగా చర్చించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల తర్వాత జిల్లాలో రఘువీరా ఆధిపత్యం మొదలైంది. దీంతో మనస్థాపం చెందిన జేసీ దివాకర్‌రెడ్డి మూడేళ్ల నుంచి టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ క్రమంలోనే రెండున్నరేళ్ల క్రితం అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతు పలికి గెలిపిస్తే, అనంతపురం లోక్‌సభ స్థానంతోపాటూ రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు.

ఇందుకు అంగీకరించిన జేసీ దివాకర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయానికి బాహాటంగా కృషి చేశారు. దీంతో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ టికెట్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డికి చంద్రబాబు కట్టబెట్టిన విషయం విదితమే. ఆ ఒప్పందంలో భాగంగానే ఇపుడు జేసీ బ్రదర్స్‌ను చంద్రబాబు పార్టీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాజీపడిన పరిటాల, కాలవ...

జేసీ బద్రర్స్‌ను టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలను ఆదిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. తన భర్త పరిటాల రవి హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి నిందితుడని పరిటాల సునీత అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలోనే పరిటాల సునీత 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రొటెం స్పీకర్‌గా జేసీ దివాకర్‌రెడ్డి ఉండటంతో ప్రమాణస్వీకారం చేసేందుకు కూడా నిరాకరించారు. ఇదే అంశాన్ని పరిటాల సునీత ఎత్తిచూపుతూ జేసీ బద్రర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పరిటాల సునీతకు మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు మద్దతు పలికారు.

తాడిపత్రిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకుంటే అవసరమైతే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోనని స్పష్టీకరించారు. కాలవ శ్రీనివాసులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ.. సోమవారం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ నోరుమెదపలేదని టీడీపీ నేతలు వెల్లడించారు.

పదేళ్లుగా ఆర్థిక  ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించేందుకే జేసీ బ్రదర్స్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించానని, మార్చి మొదటి వారంలో వారు పార్టీలో చేరుతారని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అలాగైతే తాడిపత్రి ప్రాంత టీడీపీ నేతలకు సర్దిచెప్పి.. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు చంద్రబాబుకు సలహా ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు నివ్వెరపోయారని సమాచారం. సునీత, కాలవ జేసీ సోదరులతో రాజీ పడటంపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

చంద్రబాబు మెలిక..
తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి దివాకర్ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలో నిర్వహించిన సర్వేలో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ప్రతికూల పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  కాగా, ఈ ప్రతిపాదనకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏ మేరకు అంగీకరిస్తారన్నది వెల్లడి కావాల్సి ఉంది. తాడిపత్రిలో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీ చేయించి.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన జేసీ దివాకర్‌రెడ్డి.. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అంగీకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement