తెలుగు గడ్డను రెండుగా చీల్చి, జనం గుండెను రంపపుకోతకు గురిచేసే ప్రక్రియకు ఆది అంతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఖరేనని జనానికి పూర్తిగా అర్థమైపోతోంది. రాజకీయమంటే మోసం, దగా, పచ్చి అబద్ధం, రెండు నాల్కలు అన్న అపప్రథను బాబు, ఆయన పార్టీ నిజం చేయడంపై జిల్లాలోని కొందరు టీడీపీ కార్యకర్తలుసహా జనం ఏవగించుకుంటున్నారు. ఆయన దీక్షల అర్థం, పరమార్థం తెలుసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలుగువారి గుండెలను రంపపుకోతకు గురిచేసిన పాపాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఏ విధంగా తప్పించుకోవాలనే ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ అధినేత దొంగజపం చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఆయన రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తే.. ఇప్పుడు ఆ పార్టీలో ద్వంద్వనీతి చోటుచేసుకుంది. దీంతో టీడీపీలో మునుపెన్నడూ లేని చిత్ర విచిత్ర పరిస్థితి నెలకొంది. అధినేత ఏం చెబుతున్నాడో.. పార్టీ కేడర్ ఏం మాట్లాడుతున్నదో అర్థంగాని అయోమయ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలోబాబు ఢిల్లీలో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లాలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నాయి.
ఇంతకీ ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఎవరి సమాధానం వారు చెబుతున్నారు. వీరి ధోరణి ఒక ప్రశ్న రెండు సమాధానాలన్న తంతుగా సాగుతుంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏం కోరి దీక్ష చేస్తున్నారు.. ఇంతకీ ఆయన తెలంగాణ లేదా సమైక్యత దేనికి అనుకూలం? అనేది తేల్చిచె ప్పలేక సమన్యాయం జపంతో ఆమరణ దీక్ష చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఆయన వైఖరి ఏమిటో జాతీయ మీడియాకు సైతం అర్థంగాక జుట్టుపీక్కుంటోంది.
ఈ దీక్ష తమకే అనుకూలమంటూ తెలంగాణ, సీమాంధ్రలోని టీడీపీ శ్రేణులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన దీక్షకు సంఘీభావంగా విజయవాడతో పాటు జిల్లాలో పలుచోట్ల పార్టీ శ్రేణులు, నేతలు రిలే దీక్షలు చేస్తున్నారు. బాబుకు మద్దతుగా దీక్షంటూనే సమైక్యాంధ్ర పరిరక్షణే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నారు. ఇలా జనాన్ని గందరగోళం చేయడం ద్వారా రెండు వైపులా ఎన్నికల లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తోంది. వాస్తవానికి ఆ పార్టీ అధినేత, జిల్లాలోని ముఖ్యనేతల అసలు ఉద్దేశం విభజనకు అనుకూలమేననేది ఈ దీక్షలను బట్టి అర్థమవుతోందని పలువురు మేధావులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. జనం కూడా ఆ అనుమానాలే వ్యక్తంచేస్తున్నారు.
ఈ విషయమై జిల్లాలోని ఆ టీడీపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలతో సహా పలువురు ప్రశ్నల పరంపర సంధిస్తున్నారు. సమైక్యవాదుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు కళ్లు తేలేస్తున్నారు. ఆ పార్టీ నేతలు కొందరు మౌనముద్ర దాల్చుతున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు ఇప్పుడు దొంగజపం ఎందుకు చేస్తున్నారు? ఆ దీక్షను రెండు ప్రాంతాల్లోని నాయకులు తమకే అనుకూలమని చెప్పేలా దొంగనాటకం ఎందుకు ఆడుతున్నారు? రాజకీయపార్టీగా మీకు ఒక ఏజెండా ఉండదా? ఒకేమాటకు కట్టుబడి ఉండలేరా? ప్రాంతానికో మాట మార్చి ప్రజలను ఏమారుస్తారా? అంటూ పలువురు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సంకటస్థితిలో ఆ పార్టీనేతలు ఉన్నారు.
అధినేత తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొందరు తెలుగుతమ్ముళ్లు తీవ్ర అంతర్మథనానికి గురవుతున్నారు. రాష్ట్ర విభజనపై తమ పార్టీ వైఖరి ఎలా ఉన్నా జిల్లాలో టీడీపీని బతికించుకోవడానికి జై సమైక్యాంధ్ర అనడం మినహా వేరే దారిలేదనే ఆలోచనతోనే ఈ దీక్షలు చేస్తున్నట్లు ఆ పార్టీలోని కొందరు నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వీరి తీరును నిశితంగా పరిశీలించిన కార్యకర్తలు, జనం టీడీపీ దీక్షలు నిజంగా సమైక్యత కోసం సాగడంలేదని, కేవలం ఆ పేరుతో పార్టీ ఉనికిని నిలబెట్టుకునే రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని బహిరంగంగా విమర్శిస్తున్నారు. అధినేత ధోరణికి విసిగిపోయిన కొందరు కార్యకర్తలు ఆపార్టీని వీడుతున్నారు. రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారడం, ప్రస్తుత రిలే దీక్షలకు జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో తొలినుంచి పార్టీకి కట్టుబడి ఉన్న తెలుగుతమ్ముళ్లు మరింత కుంగిపోతున్నారు.
జనంలోకి రావడానికే జడుపు..
టీడీపీ జిల్లా ప్రజాప్రతినిధులు జనంలోకి వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. జనం అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక ఎంపీ, ఎమ్మెల్యేలకు జడుపు పట్టుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమ సెగను తట్టుకోలేక బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు జిల్లాను వీడి తిరుగుతున్నారు. విభజన నిర్ణయం సమయంలో పార్లమెంటు సమావేశాలు అంటూ కాలక్షేపం చేశారు. పార్లమెంట్‌లో సస్పెండైనా ఆయన ఢిల్లీని వీడి రాలేదు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత బాబు ఆత్మగౌరవ యాత్రలో కొనసాగారు.
జనం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో అర్ధాంతరంగా యాత్ర ముగించుకుని బాబు వెళ్లిపోవడంతో కొనకళ్ల అటు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారేగాని జిల్లాలో పర్యటించలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా సైతం ఒకటి రెండుచోట్ల సమైక్యాంధ్ర అంటూ హడావుడి చేయడం మినహా ఉద్యమంలో పాలుపంచుకున్నది లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో దీక్ష చేపట్టిన చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లారు.
తొలుత ఆమరణ దీక్షతో హడావుడి చేసిన కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ సైతం ఇప్పుడు ఉద్యమం ఊసెత్తడంలేదు. ఆయన కూడా ఢిల్లీ వె ళ్లారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. ఆపై సమన్యాయం అంటూ దీక్ష చేస్తున్న చంద్రబాబుకు మద్దతుగా రిలే దీక్షలు చేయడం, ఆయనను స్వయంగా పరామర్శించడానికి వెళుతున్న జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విభజనవాదులా? సమైక్య వాదులా? ప్రజలే తేల్చాలి.
విభజనపై స్పష్టతలేని చంద్రబాబు
Published Fri, Oct 11 2013 2:10 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement