సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్‌ఐఏ విచారణను రీకాల్ చెయ్యాలని మోదీని కోరారు. కేసు విచారణను అడ్డుకునేందుకు పలు అభ్యంతరాలను చూపుతూ ఐదుపేజీల లేఖను మోదీకి రాశారు. నిందితుడు శ్రీనివాసరావుని వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు లేఖపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దాడితో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోతే ఎన్‌ఐఏ విచారణకు ఎందుకు బయపడుతున్నారని ఆపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment