ధర్మపోరాట దీక్షలు, టీడీపీ సమావేశాలతో ఇప్పటికే కోట్లలో పడిన చిల్లును పూడ్చుకోలేక ఆంధ్ర విశ్వవిద్యాలయం విలవిల్లాడుతోంది.ఇవేమీ పట్టని సర్కారు.. జ్ఞానభేరి పేరిట మరో దుబారా పర్వానికి తెరతీసింది. సొంత డబ్బా వాయించుకునేందుకు చంద్రబాబు సర్కారు నిర్వహిస్తున్న ఈ తంతుకు అయ్యే వ్యయాన్ని ఆయా వర్సిటీలే భరించాలని ఇప్పటికే స్పష్టం చేసింది.. దాంతో ఈ ఆర్థిక భారాన్ని ఏయూ నెత్తికెత్తుకోక తప్పలేదు.. ఈ భారంలో కొంత భరించమని తన పరిధిలోని కళాశాలలను ఆదేశించింది.సొంత ప్రచార డబ్బాలో వందలు, వేల కోట్లు పోసేస్తున్న సర్కారు పెద్దలు.. విశ్వవిద్యాలయాలనూ వదలడం లేదు.. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించనున్న జ్ఞానభేరికి అక్షరాలా కోటిన్నర రూపాయల చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని గంటలపాటు జరిగే కార్యక్రమానికి ఇంత భారీ ఖర్చా అన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే ఆర్ధిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. కోటిన్నర భారం మోపింది. ఏయూలో గురువారం విద్యార్ధులతో జ్ఞానభేరి పేరిట చంద్రబాబు ఒక రోజు ము ఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదివేలమంది విద్యార్థులు వచ్చేలా అట్టహాసంగా ఏర్పా ట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దానికయ్యే ఖర్చులు మాత్రం ఏయూనే భరించాలని స్పష్టం చేశారు. ఇందుకు కోటి ఖర్చవతుందని లెక్క వేసిన ఏయూ అధికారులు ఇటీవల కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. తలో కొంత విరాళాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే మహానాడు, టీడీపీ సమావేశాల పేరిట ఏయూపై ఆర్ధికభారం మోపుతున్న పాలకులు ఇప్పుడు వి ద్యార్ధులతో ముఖాముఖీ పేరిట భారం మోపడం వర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు
ప్రభుత్వ నిర్ణ?ఆలు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో టీడీపీ సమావేశాలు నిర్వహించి అద్దెలు ఎగ్గొట్టిన సర్కారు.. తాజా గా జ్ఞానభేరి పేరుతో ఏయు నెత్తిన ఖర్చు కుంపటి పెడుతోంది. ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మహానాడు, పట్టాల పండుగ సహా అనేక కార్యక్రమాలు చేపట్టినా ఏయూకు పైసా చెల్లించలేదు. కొన్ని సభలకు మాత్రం నామమాత్రపు రుసుం చెల్లించి చేతులు దులుపుకుంది. తిరుపతిలో నిర్వహించిన మొదటి జ్ఞానభేరికి రూ.3.50 కోట్లు ఖ ర్చు అయినట్లు అంచనా వేస్తుండగా, దాని కంటే బాగా ఇక్కడ చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో ఏయూ అధికారులు ఈసురోమంటూ పనులు ప్రారంభించారు. ఇందు కు రూ.4కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా ఇందులో 60 శాతం ఉన్నత విద్యా మండలి భరిస్తుందనీ, మిగిలింది ఏయూ భరించాలని ప్రభుత్వం తేల్చింది. ఈ లెక్కన కనీసం రూ.కోటిన్నర ఏయూ చేతి చమురు వదిలిపోతుంది. అయితే ఉన్నత విద్యామండలి ఇవ్వాల్సిన 60 శా తం నిధులు అనుమానమేనని కొందరు అధికారులంటున్నారు. ఇదే జరిగితే కోటిన్నర కాకుండా మొత్తం నాలుగు కోట్లు భరించాల్సిందే. ఇప్పటికే స్టేజ్, ఇతర ఏర్పాట్లకు రూ.కోటి ఖర్చయినట్లు ఏయూ అంచనా వేసింది. దీంతోపాటు విద్యార్థులు, స్టాఫ్, వీఐపీలు, అధికారులు, ఇతరులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికీ మరో రూ. కోటి ఖర్చయ్యే అవకాశముంది.
విద్యార్థులూ.. షరతులు వర్తిస్తాయి
పోనీ.. ఇంతా ఖర్చు చేస్తున్నారు.. కొంతైనా జ్ఞా నం సంపాదించుకుందామని విద్యార్థులు ఆశిస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దీనికి షరతులు వర్తిస్తాయి. ఎంపిక చేసిన కాలేజీల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన, డీఎస్సీ తదితర ప్రభుత్వ వైఫల్యాలకు చెందిన అంశాలను విద్యార్థులు లేవనెత్తే ప్రమాదముందని గ్రహించి.. ముందుజాగ్రత్త పడ్డారు. ప్రతి కాలేజీ నుంచి ప్రతిభావంతులు, మెరిట్ సర్టిఫికెట్ ఉన్న వారిని.. అందులోనూ గొడవ చెయ్యకుండా ఉండేవారిని మాత్రమే సెలక్ట్ చేసి జ్ఞానభేరి యాప్‌లో నమోదయ్యే అవకాశం ఇచ్చారు. దాని ద్వారా వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం పొందేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం గమనార్హం.
చంద్రబాబు స్వోత్కర్ష కోసమేనా..
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో 15 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ప్రముఖుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విద్యార్థులను వివిధ రంగాల్లో మోటివేట్ చేసేందుకు ప్రముఖులు ప్రసంగాలు ఇస్తారు. విశేషమేమిటంటే మోటివేషనల్ స్పీచ్‌కు ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయించారు. అదే.. చంద్రబాబు చర్వితచరణంగా చెప్పే ఊకదంపుడు ఉపన్యాసానికి గంట సమయం కేటాయించడం విశేషం.విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచే ప్రసంగాలకు కనీసం 20 నిమిషాలైనా ఇవ్వాల్సి ఉండగా అలాంటి వారికి తక్కువ సమయం కేటాయించడం వల్ల ఒరిగేదేమీ లేదని విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. పేరుకు జ్ఞానభేరి అయినా.. యువతలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను మాఫీ చేసుకొని తన వైపు తిప్పుకోడానికే టీడీపీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment