నా మనవడు నాకంటే ముందున్నాడు: చంద్రబాబు
అమరావతి: తన మనవడు తనకంటే టెక్నాలజీ వినియోగంలో ముందున్నాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయనిక్కడ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ .. అంతా బాగుంటే మీడియాకు రాయటనికి ఏమీ ఉండదు, నెగెటివ్ ఉంటే చూస్తారనేది వారి ఆలోచన అని చెప్పారు. ఐటీ ని సామాన్యులకు తీసుకువెళ్లటం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలమన్నారు. టెక్నాలజీ ద్వారా రైతులకు వర్షాల గురించి, తుఫాన్లు గురించి ముందే చెప్పి వారిని కాపాడగల్గుతున్నామని చెప్పారు. ఈ ప్రగతి ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నదే తన ఆలోచన అని తెలిపారు.
సాంకేతికతను ఎప్పటికపుడు తెలుసుకుని ముందుకి వెళితే అద్భుత ఫలితాలు వస్తాయని వివరించారు. ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. గతంలో ఉద్యోగుల మీద కోపం తెచ్చుకునే వాడినని.. ఇపుడు ఉద్యోగులను అభినందిస్తున్నానని వెల్లడించారు. మెరుగైన పనితీరు చూపించడానికి టెక్నాలజీ కూడా బాగా ఉపయోగ పడుతోంది అనేది వాస్తవమన్నారు. ఈ ప్రగతి త్వరలోనే చరిత్ర సృష్టిస్తుందన్నారు.