చీరాల, న్యూస్‌లైన్:
సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ పదకొండు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవ యాత్ర పేరుతో తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కపట నాటకాలు పక్కనపెట్టి సీమాంధ్ర ఉద్యమంలో భాగస్వామి కావాలన్నారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేశారని.. పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశారని.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా దీక్ష
చేశారన్నారు.
తెలంగాణే ముందంజ..
వ్యవసాయం, విద్యుత్, ఉపాధి రంగాల్లో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని బత్తుల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో కోస్తాంధ్రలో 18లక్షల హెక్టార్లు సాగులో ఉండగా 2009లో 23 లక్షలకు చేరిందని.. రాయలసీమలో 3.8లక్షల హెక్టార్ల నుంచి 6.3 లక్షలకు చేరుకుందని.. అయితే తెలంగాణలో 4 లక్షల హెక్టార్ల నుంచి ఏకంగా 18 లక్షల హెక్టార్లకు చేరుకుందని వివరించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కూడా ఆ ప్రాంతంలోని రైతులే అధికంగా ఉపయోగిస్తున్నారన్నారు. నిజాం నవాబుల పరిపాలనలో మచిలీపట్నం, మోటుపల్లి రేవు పట్టణాల ద్వారా 1.50 లక్షల పౌండ్ల కప్పం కట్టారని, దాని ద్వారానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ దేటా జోసఫ్, నాయకులు మేడిద రత్నకుమార్, దేవరపల్లి బాబూరావు, అక్కల కోటిరెడ్డి, కర్నేటి రవికుమార్, విల్సన్, బంగారు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబువి కపట నాటకాలు
Published Sun, Sep 8 2013 6:06 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement