ఆత్మస్తుతి..పరనింద
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆత్మస్తుతి..పరనింద అన్నట్టుగానే చంద్రబాబు ప్రసంగం మొత్తం సాగింది. స్థానిక అయోధ్య మైదానంలో ప్రజాగర్జన పేరిట బుధవారం నిర్వహించిన సభలో బాబు తన గొప్పలు చెప్పుకొని, ఇతర పార్టీల నేతలపై నిందారోపణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా తన వల్లే రాష్ట్రం బాగుపడిందని సొంతబాకా ఊదుకున్నారు. తనకు అనుకూలంగా ప్రశ్నలు వేసుకొని సభికులను చప్పట్లు కొట్టాలని కోరారు. ముందుగా ప్రకటించిన స్థాయిలో ప్రజా గర్జన సాగలేదు. గత సభల కన్నా మెరుగ్గా ఈ సభ జరగడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మూడు జిల్లాల నుంచి జనాల్ని తరలించారు. 15 రోజులుగా ప్రజాగర్జన కోసం టీడీపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 3 గంటలకే విజయనగరం జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నా ఆ సమయానికి అయోధ్య మైదానంలో ఐదు వేల మంది జనాలు కూడా లేరు.
కానీ సాయంత్రం 6 గంటల తర్వాత, వాతావరణం చల్లబడ్డాక వచ్చారు. దీంతో నాలుగు గంటలకు ప్రారం భం కావల్సిన సభ 6.30 గంటలు దాటితే గానీ మొదలు కాలేదు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఎప్పటిలాగానే వైఎస్ జగన్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. సోనియాగాంధీ,బొత్స సత్యనారాయణ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్సనైతే గంజాయి మొక్కగా అభివర్ణించారు. లిక్కర్, ఇసుక, ల్యాండ్ మాఫియాలన్నింటికీ ఆయనే ఆద్యుడన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర మీడియాపై కూడా ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆవేదనతో విషం చిమ్మారు.
పోలీసులను సైతం వదల్లేదు. ఖబడ్దార్ పోలీసులంటూ హెచ్చరించారు. ‘మీ అంతు చూస్తానంటూ’ బెదిరించే ధోరణిలో మాట్లాడారు. అంతలోనే నోరు జారానని అనుకున్నారేమో ‘మా పోలీసుల తప్పులేదు’ పనికి మాలిన కాంగ్రెస్ నాయకులు పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయకపోవడమే కారణమని నాలిక తిప్పారు.ఆంధ్రప్రదేశ్‌ను తానే నిర్మించానన్నట్టుగా మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే తన ఘనతేనని, జిల్లాలోని తోటపల్లి, పెద్దగెడ్డ ప్రాజెక్టులు తానే చేపట్టానని కూడా నమ్మబలికారు. విడిపోయిన రెండు రాష్ట్రాలను పునర్నిర్మాణం చేసే సత్తా తమకే ఉందని, ఇంకొకరికి అంత సామర్థ్యం లేదని గొప్పలు చెప్పుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని చెప్పుకొచ్చారు.