సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ 65 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టారు. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో రెండు నెలల తర్వాత ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. మార్చి 20న చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో చంద్రబాబు తన కుటుంబంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఇక కరోనాతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు సైతం వినిపించాయి.
కాగా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయనకు అనుమతి లభించలేదు. తాజాగా రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. ప్రత్యేక పరిస్థితి(స్పెషల్ కేస్)గా పేర్కొంటూ ఈ–పాస్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా విశాఖకు వెళ్లి ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాల్సి ఉంది. అయితే అక్కడికి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన పర్యటన కూడా రద్దు అయింది.
Comments
Please login to add a commentAdd a comment