చెప్పేదొకటి..చేసేదొకటి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడమంటే ఇదే..! తిరుపతిని ఐటీ హబ్‌గా మార్చుతామని ఓసారి.. ఐటీఐఆర్ ఏర్పాటుచేస్తామంటూ మరోసారి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇదే మాటలను ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా వల్లె వేశారు. కానీ.. ప్రభుత్వం ప్రకటించిన ఐటీ విధానం(ఐటీ పాలసీ)లో మాత్రం ఆ ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికార పీఠమెక్కాక నీరుగార్చిన చంద్రబాబు.. వాటిని ఏమార్చేందుకు సరి కొత్త వరాలు ఇస్తున్నారు. ఆ వరాలను సైతం కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈనెల 9న ప్రకటించిన ఐటీ విధానమే అందుకు తార్కాణం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జూలై 24న హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడగానే ఆశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తిరుపతికి చేరుకున్నారు. ఎస్‌టీపీఐ(సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా)లో ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఐటీఐఆర్‌ను వేగంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా మార్చుతామని.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆగస్టు 20న శాసనసభలో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లో తిరుపతిలో ఐటీఐఆర్ ఏర్పాటుకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటుపై ఈనెల 4న శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై ప్రజ ల్లో అసంతృప్తి వ్యక్తం కాకుండా ఉండేందుకు వరాల వర్షం కురిపించారు.
ఆ క్రమంలోనే తిరుపతిని ఐటీ హబ్‌గా మార్చుతామని ప్రకటించారు. జూలై 24న చేసిన ప్రకటనకూ.. ఆగస్టు 20న బడ్జెట్ కేటాయింపులకూ.. ఈనెల 4న శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ ఏమాత్రం పొంతన కుదరలేదన్నది స్పష్టమవుతోంది. ఈలోగా ఈనెల 9న ప్రభుత్వం ఐటీ విధానాన్ని ప్రకటించింది. ఆ మేరకు ఐటీశాఖ కార్యదర్శి సంజయ్‌జాజు ఐటీ విధానాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం:16) జారీచేశారు. విశాఖపట్నంలో ఐటీఐఆర్‌తోపాటూ మెగా ఎలక్ట్రానిక్ ఐటీ హబ్ ఏర్పాటుచేస్తామని ఐటీ విధానంలో ప్రకటించారు. కాకినాడలో మెగా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ హబ్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఐటీ విధానంలో తిరుపతి ప్రస్తావనే కన్పించని నేపథ్యంలో యువ పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు మండిపడుతున్నారు.