
ఐసేకీ, టోయోడా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: జపాన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5వ రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఐసేకీ, టోయోడా ప్రతినిధులతో చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే పరిశ్రమలపై తమకు ఆసక్తి ఉందని ఐసేకీ, టొయోడా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే చైనాలో రెండు పెద్ద పరిశ్రమలు స్థాపించామని చెప్పారు. ఈ విషయమై భారత్లో కూడా రెండేళ్ల కిందట సర్వే చేశామని ఐసేకీ, టొయోడా ప్రతినిధులు గుర్తుచేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో వ్యవసాయ దిగుబడి చాలా తక్కువగా ఉందని చెప్పారు. తాము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు కొత్త టెక్నాలజీ అనుసంధానం చేసుకోవడంలో చొరవ చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లగా, ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.