
సీఎం సభ కోసం ముమ్మర ఏర్పాట్లు
కైకరం (ఉంగుటూరు) :రైతు సాధికార సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కైకరం రానుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డి, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు బుధవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్, సీఎం సభావేదిక స్థలం, రైతుల ప్రదర్శనలు ఏర్పాటు చేసే చోటు, రైతులు కూర్చోనే ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్ సౌకర్యాలు, ఇతర సదుపాయాలు గురించి ఉన్నతాధికారులతో చర్చించారు. హెలిప్యాడ్‌ను జాతీయ రహదారిని ఆనుకొని ఏర్పాటు చేయాలని, రైల్వే విద్యుత్‌లైన్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆర్‌అండ్‌బీ ఏస్‌ఈ శ్రీమన్నారాయణకు సూచించారు.
సీఎం ఇలా వస్తారు : హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చే సీఎం మధ్యాహ్నం 2 గంటలకు కైకరంలో దిగుతారు. రైతుస్టాల్‌ను పరిశీలించిన అనంతరం సదస్సులో మాట్లాడతారు. రైతులకు రుణ అర్హత పత్రాలను అందజేస్తారు.
300 బస్సులు సిద్ధం : సీఎం పాల్గొనే సాధికార సదస్సుకు జిల్లాలో 11 మం డలాల నుంచి పొల్గొనే రైతుల కోసం 300 ఆర్టీసీ బస్సులు సిద్ధం చేశారు. 15 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
తాత్కాలికంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
సదస్సుకు విద్యుత్ సౌకర్యం కోసం తాత్కా లికంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యుత్ ఎస్‌ఈ జి.సత్యనారాయణ చెప్పారు. హెలిప్యాడ్ వద్ద, సీఎం సభా వేదిక వద్ద రెండు పెద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలి వద్ద ఉన్న పంటపొలాల్లో సదస్సు పూర్తయ్యే వరకు వరి నాట్లు వేయకుండా రైతులకు సూచనలు ఇచ్చారు. పంట పోలాలకు నీరు పెట్టరాదని చెప్పారు. ఐదు జేసీబీలతో సదస్సు జరిగే ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. సదస్సు రోజున మూడు గంటలపాటు తాడేపల్లిగూడెం వైపు వెళ్లే వాహనాలను నిలుపుదల చేయనున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కైకరంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణలో ఏలూరు ఆర్డీవో తేజ్ భరత్, డీఎస్పీ కేజీవీ సరిత, విద్యుత్ ఏడీ చంద్రశేఖర్, జేడ్పీటీసీ సభ్యులు చింతల శ్రీనివాస్, కర్ణం పెద్దిరాజు, భీమడోలు సోసైటీ అధ్యక్షుడు గన్ని నాగగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.