
వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో మంగళవారం అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, ఇతర అధికారులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ద్వారా పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీరు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్ల పాలనా కాలం ముగుస్తున్నా ఆ హామీలు నెరవేరలేదు. పనులు పూర్తి కావడం సంగతి దేవుడెరుగు... ఆగిన పనులు మొదలు పెట్టడం కూడా టీడీపీ సర్కారుకు చేత కాలేదు. ఏడు నెలలుగా టన్నెల్ పనులు ఆగి పోయినా ప్రభుత్వం స్పందించలేదంటే వెలిగొండపై సీఎం చంద్రబాబుకు ఏ పాటిదో శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతుంది. వెలిగొండ పూర్తి చేసి పశ్చిమ ప్రకాశానికి నీరు ఇవ్వడమే చంద్రబాబుకు ఇష్టం లేదని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం ఉంది. టీడీపీకి ఓట్లు, సీట్లు కట్టబెట్టలేదన్న అక్కసుతోనే చంద్రబాబు వెలిగొండను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి.
తీరా ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు బాబుకు మళ్లీ వెలిగొండ గుర్తొచ్చింది. ఓట్ల కోసం వెలిగొండ నీళ్లంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. పోనీ ఆ హామీ అయినా నెరవేరుతుందా అంటే అదీ లేదు. పనులు మొదలు కాకుండానే పూర్తికావడం అసాధ్యం. ఆగస్టులో వెలిగొండ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగితే వెంటనే వెలిగొండను పూర్తి చేస్తున్నామంటూ టీడీపీ సర్కారు హడావిడి చేసింది తప్ప పనులు మొదలు పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు తరహాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నెలనెలా రివ్యూ చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. చెప్పిన మూడు నెలల తర్వాత చంద్రబాబు శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు రావడం గమనార్హం.
కమీషన్ల కోసం కొత్త పనులు..
పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య వివాదంతో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్ పనులు నిలిచి పోయాయి. ఆర్థిక లబ్ధే పరమావధిగా టీడీపీ ముఖ్యనేతలు వెలిగొండ పనుల అంచనాలను పెంచుకోవడంతో పాటు కమిషన్ల కోసం పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో వివాదం కోర్టుమెట్టెక్కింది. దీంతో టన్నెల్–1 పనులు ఏప్రిల్ నెలలో నిలిచిపోగా టన్నెల్–2 పనులు ఫిబ్రవరిలోనే ఆగిపోయాయి. వెలిగొండ పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఆ పార్టీ ఒంగోలు మాజీఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగష్టు 15 నుంచి వెలిగొండ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. దీంతో బెంబేలెత్తిన భారీ నీటిపారుదల శాఖా మంత్రి ఆగస్టు 15 నాటికి వెలిగొండ టన్నెల్–1 పనులను మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర ముగిసేలోపే పనులు ప్రారంభమవుతాయని అందరూ భావించారు. మంత్రి, ముఖ్యమంత్రి, ఇచ్చిన హామీ నీటి మూటగానే మారింది. నవంబర్ ప్రారంభమైనా పనులు మొదలు కాలేదు. మరో వైపు ఫేజ్ 2 లో భాగంగా పూర్తి చేయాల్సిన టన్నెల్– 2 పనులు సైతం మొదలు కాలేదు. టన్నెల్–1లో 18.820 కి.మీ. తవ్వాల్సి ఉండగా ఇప్పటి
వెలిగొండ మళ్లీ గుర్తొచ్చింది
వరకు 15.167 కి.మీ. మాత్రమే తవ్వారు. ఇక టన్నెల్–2లో 18.838 కి.మీ. తవ్వాల్సి ఉండగా 10.703 కి.మీ. మాత్రమే తవ్వారు.
ఫేజ్–1 పూర్తయ్యే దెన్నడో..
ఫేజ్ 1లో టన్నెల్–1 పనులను పూర్తి చేసి సంక్రాంతి నాటికే వెలిగొండ ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇది జరగాలంటే తొలుత టన్నెల్–1 పనులతో పాటు ప్యాకేజ్–2 పరిధిలోని తీగలేరు, సుంకేశుల డ్యామ్, మూడో ప్యాకేజీ పరిధిలోని గొట్టిపడియ డ్యామ్, కెనాల్స్, నాల్గవ ప్యాకేజీ పరిధిలోని తూర్పు ప్రధాన కాలువ, కాకర్ల డ్యామ్, ప్యాకేజీ 5లో టన్నెల్–2 పనులు, 6వ ప్యాకేజీలో తూర్పు ప్రధాన కాలువ, 7వ ప్యాకేజీ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి కావాల్సి ఉంది. టన్నెల్–1 పనులు ఇప్పటి వరకు 82 శాతం పూర్తి కాగా తీగలేరు, సుంకేశుల డ్యామ్ పనులు 73.1 శాతం, గొట్టిపడియా డ్యామ్, కెనాల్స్ 99 శాతం, తూర్పు ప్రధాన కాలువ, కాకర్ల డ్యామ్ 82 శాతం, టన్నెల్–2 64 శాతం, తూర్పు ప్రధాన కాలువ 66.8 శాతం, ఎడమ ప్రధాన కాలువ 61.6 శాతం చొప్పున మొత్తంగా సగటున 67 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మూడు కిలోమీటర్లు మేర టన్నెల్–1లో కాలువ తవ్వాల్సి ఉంది. దివంగత నేత వైఎస్ హయాంలో 12 కిలోమీటర్ల మేర టన్నెల్–1 కాలువ తవ్వారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు సర్కారు తవ్వింది 3 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా మూడు కిలోమీటర్లకు పైగా తవ్వాల్సి ఉంది. నాలుగున్నరేళ్లలో మూడు కిలోమీటర్లు తవ్వి మరో రెండు నెలల్లో మూడు కిలోమీటర్లు కాలువ తవ్వి నీరిస్తాననడాన్ని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు.
బాబు హామీల పరంపర : అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది వెలిగొండ ద్వారా కరువు ప్రాంతం పశ్చిమ ప్రకాశానికి నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఇవిగో నీళ్లంటూ మాట ఇవ్వడం తప్ప నెరవేర్చింది లేదు.
♦ నాలుగు నెలలక్రితం ఈ డిసెంబర్‌కు నీరిస్తామంటూ కందుకూరు సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత కనిగిరి సభలో సంక్రాంతికి వెలిగొండ నీరంటూ మరోమారు మాట మార్చారు.
♦ వెలిగొండ పనులను మొదలు పెడుతున్నట్లు మంత్రి దేవినేని ఉమ, జిల్లా టీడీపీ నేతలు మూడు నెలల క్రితం హడావిడి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ సందర్శిస్తున్నట్లు చెప్పారు. పోలవరంలాగే ప్రతినెలా వెలిగొండపై సీఎం రివ్యూ నిర్వహిస్తారని గొప్పలు చెప్పారు. ముఖ్యమంత్రి సైతం ఇదే చెప్పారు. నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు సీఎం వెలిగొండను సందర్శించింది లేదు. వెలిగొండ పనులు మొదలైంది లేదు.
♦ తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండను సందర్శిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా పనులు మొదలవుతాయోమో చూడాలి. మరి పనులు ఎప్పటికి పూర్తి అవుతాయన్నది చంద్రబాబుకే తెలియాలి.
అంచనాల పెంపుపైనే శ్రద్ధ..
వెలిగొండ పనులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు అంచనాలను మాత్రం భారీగా పెంచుకున్నారు. తొలుత రూ.5,150 కోట్ల అంచనాలతో ఉన్న ప్రాజెక్టు వ్యయం తాజాగా రూ.1,784 కోట్లకు చేరింది. ఈ లెక్కన రూ.2,634 కోట్లు పెంచుకున్నారు. బాబు సర్కారు పెంచిన వెలిగొండ అంచనాలను చూసి సీనియర్ ఇంజినీరింగ్ ప్రముఖులే నివ్వెరపోతున్నారు. ఇదేం దోపిడీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment