సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన అంతా ఎన్నికల హడావుడిని తలపించింది. షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఆయన శంకుస్థాపనలు.. ప్రారంభాలతో హడావుడి చేశారు. ఆయన ప్రసంగంలో హామీలు వరదలై పారాయి. నాలుగేళ్లుగా ప్రజలు, రైతన్నలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని చంద్రబాబు, అధికార పార్టీ నేతలకు ఒక్కసారిగా జిల్లా సమస్యపై మమకారం పెరిగి హామీల వర్షం కురిపించారు. ఎవరూ చేయని విధంగా తాను చేసినట్లు ఎన్నికల డప్పు కొట్టుకున్నారు.
కావలి/నెల్లూరు టౌన్ : నెల్లూరు జిల్లాలో నాకు తక్కువ సీట్లు ఇచ్చారు. ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నాకు మూడే సీట్లు ఇచ్చింది. కానీ నేను వివక్ష చూపకుండా నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేశానని సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. జిల్లాను అభివృద్ధి విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా కావాల్సిన పనులు అన్ని పూర్తి చేస్తున్నాని చెప్పారు. శుక్రవారం జిల్లాలోని కావలి నియోజకవర్గంలో సీఎం జన్మభూమి–మా ఊరు ఆరో విడత కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. తొలుత బోగోలు మండలం జువ్వలదిన్నెకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి చిప్పలేరు హైలెవల్ వంతెను ప్రారంభించారు.
అక్కడి నుంచి జువ్వలదిన్నెలోని పొట్టిశ్రీరాములు స్మారక భవనాన్ని సందర్శించి అనంతరం అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి బోగోలు చేరుకుని జన్మభూమి సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా కలుపుకుని అన్నీ అభివృద్ధి పనులు తామే చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా చెన్నై–బెంగళూరు కారిడార్ రూ.50 వేల కోట్లతో వస్తుందని, దాని వల్ల నెల్లూరు– చెన్నై–తిరుపతి ట్రై ఇండస్ట్రీయల్ జంక్షన్లుగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రూ.48 కోట్లతో పులికాట్ ముఖద్వారం పూడికతీత పనులు కూడా కొద్ది రోజుల్లో మొదలవుతాయని చెప్పారు. ఇప్పటికే ఈ జిల్లాలో పోర్టు, సెజ్ ఉందని కొద్ది రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కూడా వస్తే జిల్లా అన్ని విధాలా సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కావలి నియోజకవర్గంలో గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పట్టాల హడావుడి
బోగోలు జన్మభూమి సభలో సీఎం ప్రసంగానికి కంటే ముందే సీజేఎఫ్‌ఎస్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, అందరికీ మండలాల వారీగా ఇవ్వడానికి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో సీఎం ప్రసంగించడం మొదలు పెట్టగానే సభకు వచ్చిన వారు పట్టాల కోసం కౌంటర్ల ముందు బారులు తీరారు. సీఎం సభ పూర్తయినా రెండు గంటల వరకు పట్టాల పంపిణీ జరిగింది. అయితే సభలో ప్రకటించిన విధంగా 66,276.79 ఎకరాలకు సంబంధించి 60,956 మందికి పూర్తిస్థాయిలో పట్టాలు సిద్ధం కాకపోవడంతో అందరికీ ఇవ్వలేదు. దీంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు. ఈ క్రమంలో సీఎం సభలో మాట్లాడుతూ ఎక్కడ పైసా అవినీతి లేకుండా అందరికీ పట్టాలను పసుపు–కుంకుమ పేరుతో ఇస్తున్నామని ప్రకటించారు. సీజేఎఫ్‌ఎస్ పట్టాలు తయారు చేసిన రెవెన్యూ సిబ్బందికి వారి కోరిక మేరకు ఒక నెల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
మూడు జిల్లాల నుంచి బస్సులు
ముగింపు సభ కావడంతో జనసమీకరణకు నెల్లూరుతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్ని జనతరలింపునకు వినియోగించారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అన్ని మండలాలకు కలిపి 160 బస్సులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు సీజేఎఫ్‌ఎస్ పట్టాలు కూడా సభలో ఇస్తామని ప్రకటించిన క్రమంలో ప్రతి మండలానికి ఐదు బస్సులు ఏర్పాటు చేసి జనాల్ని సభకు తరలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సభాధ్యక్షత వహించారు. మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పరసా వెంకటరత్నం, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తానరావు, బొల్లినేని కృష్ణయ్య, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జెడ్పీ చైర్మన్ బి.రాఘవేంద్రరెడ్డి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment