
రూ.2.52 కోట్ల షేర్లు రూ.273.84 కోట్లకు పెరిగాయి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా ఆయన కుటుంబ సభ్యుల కంపెనీ హెరిటేజ్ పుడ్స్ షేర్ల ధరలు ఊహించనంతగా పెరుగుతున్నాయని,
♦ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ వెల్లడి
♦ మా కంపెనీ షేర్ల ధర పెరగడం వల్లే నా ఆస్తుల విలువ పెరిగింది
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా ఆయన కుటుంబ సభ్యుల కంపెనీ హెరిటేజ్ పుడ్స్ షేర్ల ధరలు ఊహించనంతగా పెరుగుతున్నాయని, దీని వెనుక క్విడ్ ప్రో కో వ్యవహారాలు దాగి ఉన్నాయని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వస్తోంది. తమ కంపెనీ షేర్ల ధర పెరగడం వల్లే తన ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పెరిగిందని చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అంగీకరించారు. ‘లోకేశ్ ఆస్తులు.. 5 నెలల్లో 22 రెట్లు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై లోకేశ్ స్పందించారు.
హెరిటేజ్ పుడ్స్‌లో తన పేరిట ఉన్న రూ.2.52 కోట్ల విలువైన షేర్లు రూ.273.84 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఆఫిడవిట్‌లో తాను ప్రకటించిన ఆస్తుల వివరాలను తీసుకొని ‘సాక్షి’ పత్రిక చిలవలు పలవలుగా కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. లోకేశ్ గురువారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ‘సాక్షి’కి ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ లోకేశ్ ఆస్తుల వివరాలు రాసిన ‘సాక్షి’ తన బాధ్యతగా ఆయన స్పందన రాయాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియా ద్వారా ఆయన ఇచ్చిన వివరణ మేరకు.. ‘‘హెరిటేజ్ సంస్థలో నాకు రూ.1.64 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. గంటగంటకూ షేర్ల ధరలు మారుతుంటాయి.
మా ఆస్తులు ప్రకటించినప్పుడు షేర్లపై నా పెట్టుబడి ఎంతో అదే చెప్పాను. కానీ, ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఇప్పుడు ఆ షేర్ల విలువ ఎంత ఉందో అది డిక్లరే చేశారు. ఈ మధ్య హెరిటేజ్ పుడ్స్‌లో రిటైల్ విభాగాన్ని ప్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కు విక్రయించారు. కేవలం రూ.2.52 కోట్ల విలువైన నా వాటా షేర్లు రూ.273.84 కోట్లకు పెరిగాయి. హెరిటేజ్ పుడ్స్‌లో రిటైల్, డెయిరీ విభాగాలు ఉన్నాయి. రిటైల్ విభాగాన్ని ప్యూచర్ గ్రూపునకు అమ్మడం వల్ల హెరిటేజ్ పుడ్స్ వద్ద మిగిలిన డెయిరీ విభాగం లాభపడింది. దీనివల్ల నా వాటా షేర్ల విలువ పెరిగింది’’ అని లోకేశ్ పేర్కొన్నారు.