‘అన్నదాత’కు మళ్లీ టోకరా! | Chandrababu One More Fraud in the name of Sukhibhava | Sakshi
Sakshi News home page

‘అన్నదాత’కు మళ్లీ టోకరా!

Published Thu, Feb 14 2019 3:40 AM | Last Updated on Thu, Feb 14 2019 11:36 AM

Chandrababu One More Fraud in the name of Sukhibhava - Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాత సుఖీభవ పేరుతో మరో వంచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీశారు. ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టి ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇచ్చి చివరకు పంచ పాండవులు అంటే మంచపు కోళ్లు అనే మాదిరిగా వ్యవహరించారు. తాను ఏం ఇస్తారో చెప్పడానికి బదులు తనకు సంబంధం లేని మొత్తాన్ని కలిపేసుకుని అంకెల గారడీ చేస్తున్నారు. చివరకు రైతు కుటుంబాలను, సాగు విస్తీర్ణాన్ని సైతం తారుమారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేను బుట్టదాఖలు చేసి మోసానికి మారుపేరుగా నిలిచారు. తానిస్తానని ప్రచారం చేసుకున్న రూ.10 వేలకు కత్తెర వేసి రూ.4 వేలకు కుదించారు. రైతు కుటుంబాల సంఖ్య, నిధుల్లోనూ దారుణంగా కోత వేశారు. చంద్రబాబు దిగిపోయే ముందు ప్రవేశపెట్టిన తనది కాని చివరి బడ్జెట్‌లో రైతులకు తూతూమంత్రంగా రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి దాంట్లోనూ సగం కోత విధించారు. మరోపక్క ప్రధాని మోదీ రాష్ట్రానికి ద్రోహం చేశారని దేశ రాజధాని ఢిల్లీ మొదలు గల్లీ వరకు ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన ప్రకటించిన సాయాన్ని కూడా కలిపేసుకుంటున్నారంటే పరమార్థం ఏమిటి? ఒపక్క మోదీ తిరిగి అధికారంలోకి రాడని చెబుతూ మరోపక్క ఆయన సాయాన్ని కలిపేసుకుంటున్నారంటే మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నట్లు ఉందనే భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

లెక్కల్లోనూ మోసం...
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేల సాయం ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అశ్వత్థామ హతఃకుంజరః అన్నట్టు కేంద్ర సాయం కలుపుకొని చావుకబురు చల్లగా– చెప్పారు. ఈ మోసం ఇంతటితో ఆగలేదు. రాష్ట్రంలో రైతు కుటుంబాలలోనూ కోత వేశారు. వ్యవసాయ శాఖ 2015–16 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 85,35,150 రైతు కుటుంబాలున్నాయి. వీరిలో ఐదు ఎకరాలలోపు ఉన్న వారు 75 లక్షలకు పైగా ఉన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వీరిని 54 లక్షలకు కుదించింది.  అంటే సన్న,చిన్నకారు రైతులను సైతం మోసగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. 5 ఎకరాల పైబడి ఉన్న వారి సంఖ్యలోనూ చేతి వాటం చూపి అంకెల గారడీ చేశారు. కౌలు రైతుల విషయంలోనూ ఇదే జరిగింది. 2015లో ప్రభుత్వ అంచనా ప్రకారం 17 లక్షల మంది కౌలు రైతులున్నారు. వారందరికీ రుణ అర్హత పత్రాలు, సాగు ధృవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు వారి సంఖ్యను 15 లక్షలకు కోత వేశారు. ఇలా రైతుల సమాచారం మొత్తాన్ని తిమ్మిని బమ్మిని చేసి మాయాబజారు సినిమా చూపించారు.

నిధుల్లో కోత..
నిధుల వ్యవహారంలోనూ చంద్రబాబు దగాకు పాల్పడ్డారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.60 కోట్ల ఎకరాలు. ఈ లెక్కన చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం ఎకరానికి పది వేల చొప్పున రూ.16 వేల కోట్లు కావాలి. నవరత్నాలను కాపీ కొడుతున్న చంద్రబాబు.. రైతు భరోసా పథకాన్ని అయినా సరిగా చేశారా అంటే అదీ లేదు. 2017లోనే వైఎస్‌ జగన్‌ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన దాని ప్రకారం ప్రతి రైతుకుటుంబానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12,500 ఇస్తానన్నారు. రాష్ట్రంలో 86 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన కుటుంబానికి రూ.12,500 అనుకున్నా రూ.10,600 కోట్లు కావాలి. కానీ చంద్రబాబు తనది కాని తాత్కాలిక బడ్జెట్‌లో కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి మోసం చేశారు. ఆ మోసంలోనూ మరో ఘరానా మోసం ఏమిటంటే దాంట్లో సగం కూడా రైతన్నలకు విదల్చకపోవడమే. కుటుంబాల సంఖ్యను కోత వేసి సాయాన్ని తగ్గించి వేశారు. ప్రతి ఎకరానికి రూ.10 వేలని ఊదరగొట్టి ఇప్పుడు దాన్ని రూ.4 వేలకు పరిమితం చేశారు. చంద్రబాబు మోసాలు ఇంతటితో ఆగలేదు. 

కాపీ కొట్టడంలోనూ ఫెయిల్‌..
వ్యవసాయం సంక్షోభంలో చిక్కి, అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్న స్థితిలో రెండేళ్ల కిందటే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం కింద ప్రతి ఖరీఫ్‌కు ముందు చెల్లిస్తానని చెప్పారు.  దీంతో ఎన్నికల ముందు చంద్రబాబు రైతుబంధు, రైతు రక్ష అంటూ రకరకాల లీకులు ఇచ్చి చివరకు అన్నదాత సుఖీభవ పథకం తెచ్చారు. జగన్‌ చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలోని రైతు కుటుంబాలన్నింటికీ రూ.12,500 చొప్పున చెల్లించడానికి ఏడాదికి రూ.10,600 కోట్లు అవసరం. రైతుల్ని ఆదుకుంటామని నమ్మబలుకుతూ తాజా బడ్జెట్‌లో చంద్రబాబు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించి మళ్లీ అందులోనూ మోసం చేసి సగానికిపైగా కోత విధించారు. 

మోదీ మళ్లీ రారంటూ ఆయన సాయాన్ని కలిపేసుకుంటారా?
నరేంద్ర మోదీ అంతుచూస్తాననంటూ ఆయన ప్రకటించిన సాయాన్ని చంద్రబాబు కలిపేసుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలలో విస్మయం వ్యక్తమవుతోంది. రైతులకు ఆర్థిక సాయం పేరిట కేంద్రం సన్నచిన్న కారు రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని తన బడ్జెట్‌లో పెట్టినప్పుడు ముష్టి వేసినట్టు వేస్తారా? అని దుమ్మెత్తిపోసిన చంద్రబాబు ఇప్పుడు ఆ సాయంతో కలుపి రూ.10వేలు ఇస్తాననడం విడ్డూరం. ఓపక్క మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానంటున్న చంద్రబాబు రాష్ట్రంలో రైతుల్ని మాత్రం అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నారు. ఎకరానికి పది వేల రూపాయల సాయం చేస్తానని చెప్పిన పెద్దమనిషి ప్లేట్‌ ఫిరాయించి కేంద్రం డబ్బును కలిపి ఇస్తానంటున్నారు. అంటే దాని అర్థం తిరిగి మోదీ అధికారంలోకి వస్తారనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి ఇది పరాకాష్ట కాదా? అని నిలదీస్తున్నారు. 

తనది కాని బడ్జెట్‌లో ఇలా చేయవచ్చా?
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 5 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రవేశపెట్టింది కేవలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌. నిజానికి ఇందులో ఎటువంటి విధానపరమైన వాటికి కేటాయింపులు ఉండకూడదు. కేవలం జీతభత్యాలు, దైనందిన అవసరాల ఖర్చులు మాత్రమే చూపాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు పెట్టారు. ప్రజల తీర్పు అనంతరం వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. రైతుల్ని రుణమాఫీ పేరిట, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పేరిట మోసం చేయడం తెలిసిందే. ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందాన కేంద్రం సొమ్ముతో తానే రైతు కుటుంబానికి పది వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం విడ్డూరం. ఇదేదో బ్రహ్మాండం బద్ధలయిపోయినట్టుగా ఎల్లో మీడియా ద్వారా ఊదరగొట్టించడం, చర్చలు పేరిట రాద్దాంతాలు సృష్టించారు. తాను ఇవ్వాల్సింది ఇస్తానని చెప్పడానికి బదులు కేంద్రం డబ్బులు కలిపి రూ.పది వేలని హడావిడి చేయడం గమనార్హం. 

తొలి సంతకానికే దిక్కులేదు...
అధికారం కోసం రుణమాఫీని ప్రకటించి తొలిసంతకం అంటూ ప్రచారం చేసుకుని  రైతుల్ని నిలువునా వంచించిన చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ప్రాధమిక మిషన్‌లో చేర్చి ఆర్భాటం చేశారు. కోటయ్య కమిటీ, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్, పలు వడపోతలతో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా రైతులను అప్పుల ఊబిలోకి దించారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.3వేల కోట్లు ఇంతవరకు రాలేదు. రబీ పరిహారం ఇంతవరకు లెక్క తేలలేదు. గత ఏడాది రైతులకు బీమా, పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన మరో వేయి కోట్లు అలాగే ఉండి పోయాయి. ఇవన్నీ వెరసి రూ.15 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని ఎగ్గొట్టి అన్నదాతా సుఖీభవా అంటూ కేంద్రం సాయాన్ని కలిపేసుకోవడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement