కమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
టీడీపీలో తిరుగుబాటు నేతలకు చంద్రబాబు హెచ్చరిక
సాక్షి, అమరావతి: మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కక తిరుగుబాటు చేసిన టీడీపీ నేతలపై పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రాజీనామాలు చేయడం, పెడన నియోజకవర్గంతోపాటు కొన్ని చోట్ల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం రాత్రి బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా విస్తృతంగా చర్చించాకే ఇచ్చామని, మంత్రివర్గ విస్తరణ కూడా అలాగే జరిగిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవులు కేటాయించామని తెలిపారు.
దీనిపై అసంతృప్తి మంచిది కాదని, స్పోర్టివ్‌గా తీసుకోవాలని నేతలకు సూచించారు. పార్టీ విషయాలను అంతర్గత వేదికలపై చర్చించాలని, అంతేగాని పత్రికలకు ఎక్కడం సరికాదని పేర్కొన్నారు.కొలిక్కిరాని శాఖల కేటాయింపు: కొత్త మంత్రులతో ప్రమాణం చేయించినా వారికి శాఖల కేటాయింపులో అనిశ్చితి నెలకొంది. ఆదివారం సాయంత్రానికి శాఖల కేటాయింపు జరగాల్సి వున్నా తెలుగుదేశం పార్టీకి రాజీనామాల సెగ తగలడంతో చంద్రబాబు ఈ అంశంపై ఆలస్యంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆదివారం రాత్రి వరకు దీనిపై చంద్రబాబు అధికారులు, సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు.
తన కుమారుడు లోకేష్‌కు పంచాయతీరాజ్, ఐటీ శాఖలిచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావుల శాఖల్లో మార్పులుండవని చెబుతున్నారు. అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోంశాఖను కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడుల్లో ఒకరికి ఇవ్వొచ్చని పార్టీవర్గాల సమాచారం. అదే జరిగితే చినరాజప్పకు మరో శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శాఖల కేటాయింపు, మార్పులపై ఉత్కంఠ నెలకొంది.