కేబినెట్ చిచ్చు.. చంద్రబాబుకు చిక్కు
అమరావతి: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో పార్టీలో ఎగసిన అసంతృప్తిని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం సమతమవుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంకావడంతో అగ్రనాయకత్వం తలపట్టుకుంది. సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో ఊహించనివిధంగా వ్యతిరేకత వ్యక్తమయింది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా బుజ్జగింపులకు దిగారు. అసంతృప్త నాయకులను తన దగ్గరికి పిలిపించుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి అనూహ్యంగా ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ విప్ పదవిని వదులుకున్నారు. తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రాజీనామా చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ ప్రస్తుత రాజకీయాలు రోత కలిగిస్తున్నాయని ఈసడించారు. ఉత్తరాంధ్ర సీనియర్ ఎమ్మెల్యేలు గౌతు శివాజీ, బండారు సత్యనారాయణ మూర్తి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిరసన గళం విన్పించారు.
దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలకు సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. బొజ్జలకు మూడుసార్లు ఫోన్ చేశారు. బొండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్ లను పిలిపించుకుని మాట్లాడారు. ధూళిపాళను బుజ్జగించే బాధ్యతను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించారు. పల్లె రఘునాథరెడ్డికి మంత్రి పరిటాల సునీత, మండలి బుద్ధప్రసాద్ నచ్చజెప్పారు.