సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి అధికారికంగా కొన్నింటిని, అనధికారికంగా మరికొన్ని సంస్థలను వదిలేశానని, పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి అమరావతికి వెళ్లిపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటా చోరీ వ్యవహారంలో సాక్ష్యాధారాలు బయటపె డతానంటూ శనివారం మీడియా సమావేశం నిర్వహించి సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. ప్రజల ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన దాకవరపు అశోక్ తమ వద్దే ఉన్నాడని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించడం రాష్ట్ర ప్రజలను నివ్వెరపరిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్నే చదువుతూ అదే సాక్ష్యమన్నట్లుగా చూపించడం చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, బీజేపీల కుట్ర ఉందని, కేసీఆర్ ఆంధ్రులను అవమానించారంటూ చంద్రబాబు కొత్తగా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంపైనా జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంపై బురదజల్లబోయి తానే ఇరుక్కుపోయారని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.
విజయసాయిరెడ్డి ఫిర్యాదు పత్రం పట్టుకొని హల్‌చల్
డేటా చౌర్యం కేసులో సాక్ష్యాధారాలు అంటూ శనివారం ఉదయం నుంచి లీకులు ఇచ్చి ‘పచ్చ’మీడియాలో ఊదరగొట్టారు. విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుపత్రాన్ని మీడియా సమావేశంలో చూపించి, అదే ఆధారమని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిన వ్యవహారంపై జిల్లాల్లో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆధార్‌సంస్థకు ఇలా పలు విభాగాలకు విజయసాయిరెడ్డి ఫిర్యాదులు ఇచ్చారు. ఆ ఫిర్యాదులోనే డేటా చౌర్యం ఎలా జరిగి ఉంటుంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఏయే సంస్థలున్నాయి? తదితర అంశాలపై తమకున్న అనుమానాలను, సమాచారాన్ని కూడా వివరిస్తూ దానిపై కూలంకషమైన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు వీటిని పట్టుకొని ఒక్కొక్కటిగా చదువుతూ తాను శోధించి సాధించిన సాక్ష్యాలని చెప్పి నవ్వుల పాలయ్యారు.
పరస్పర విరుద్ధ ప్రకటనలు
ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్లు, ఓటరు జాబితా వివరాలు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా చేరాయన్న ప్రజల సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం సాధికార మిత్రల ద్వారా ప్రజా సాధికార సర్వేలో సేకరించిన సమాచారం ఐటీ గ్రిడ్స్‌కు, అక్కడి నుంచి సేవామిత్ర యాప్‌లోకి ఎలా చేరింది? అన్న దానిపైనా బాబు నోరు విప్పలేదు. పైగా మీడియా సమావేశంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఫిబ్రవరి 19న దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు రికార్డు చేశారని ఒకవైపు చెబుతూనే మరోవైపు కేసు లేకుండానే 23వ తేదీన ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించడం గమనార్హం. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమదేనని ప్రకటించిన చంద్రబాబు తరువాత అది తమ పార్టీ వ్యవహారాలు చూసే ఔట్‌సోర్సింగ్ సంస్థ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ డేటా చోరి అయిందని ఒకసారి, తమ పార్టీ డేటా పోయిందని మరోసారి చెప్పారు. ప్రభుత్వ డేటా పోయిందని, దానిపై ఫిర్యాదు వస్తే ఏపీకి చెప్పాలే తప్ప ఆ సంస్థపై మీరెలా దాడులు చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించడం విశేషం. అన్నింటి కంటే వింత ఏమిటంటే ప్రభుత్వ డేటా పోయిందని చెబుతూనే ఆ డేటా చోరీకి కారణమైన దాకవరపు అశోక్‌ను వెనుకేసుకురావడం. అతడు ఇప్పుడు ఎక్కడున్నాడని విలేకరులు ప్రశ్నించగా.. ఒకటి రెండు రోజుల్లోనే బయటకు వస్తాడని చంద్రబాబు బదులివ్వడం కొసమెరుపు. 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ పోలీసులు నోటీసులు జారీచేసిన అశోక్ తమ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే తంటాలు
తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి అధికారికంగా కొన్నింటిని, అనధికారికంగా మరికొన్ని సంస్థలను వదిలేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి అమరావతికి వెళ్లిపోయానని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై పదేళ్ల పాటు హక్కు ఉన్నా అర్ధాంతరంగా తమను కట్టుబట్టలతో అమరావతికి తరలించి నానా కష్టాలకు గురిచేసిన బాబు వైఖరిపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి తమ భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని, తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేటా చోరీ వ్యవహారంలో కీలకమైన అంశాలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు నీళ్లు నమిలారు. డేటా చౌర్యం నేపథ్యంలో ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు సెంటిమెంట్‌ను రాజేయడానికి ప్రయత్నించారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఇది ఏపీ, తెలంగాణ మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు బాబు తంటాలు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయినా బాబు మాటలను ప్రజలు విశ్వసించబోరని పేర్కొంటున్నారు. 14 ఏళ్ల ఉద్యమ కాలంలో కేసీఆర్ అడపాదడపా చేసిన వ్యాఖ్యలను ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం బాబు చేసినా అది పనిచేయదు. ఎందుకంటే గతంలో పలు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌తో కలిసి పనిచేశారు.
టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఆరాటపడింది బాబు కాదా?
2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు కేసీఆర్‌ను కలుపుకొని మహాకూటమిని ఏర్పాటు చేసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవిభజన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణలో నిర్వహించిన యాగానికి చంద్రబాబు స్వయంగా హారయ్యారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేశారు. ప్రత్యేకంగా విందు భోజనం వడ్డించారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం బాబు పాకులాడారు. తన బావమరిది హరికృష్ణ శవం పక్కనే పెట్టుకొని కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో పొత్తు మంతనాలు జరిపారు. కేటీఆర్ ఈ విషయం స్వయంగా ప్రకటించగా చంద్రబాబు కూడా అదే నిజమేనని అంగీకరించారు. ఈ ఎన్నిల కోసం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని, వైఎస్ జగన్‌కు మద్దతు పలుకుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలు కూడా నిస్పృహలో చేస్తున్నవేనని ప్రజలు కొట్టిపారేస్తున్నారు.
కేసీఆర్‌ను ఏనాడూ కలవని జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ మధ్య ఎప్పుడూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి భేటీలు, చర్చలు జరగలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ విజయం సాధించినప్పుడు అభినందలు తెలపడమే తప్ప జగన్‌మోహన్‌రెడ్డి ఆయనతో ఇప్పటివరకు మాట్లాడింది లేదు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే ఇటీవల కేసీఆర్ తనయుడు కేటీఆర్ వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌పైనే చర్చించామని వారిద్దరూ ఆరోజే స్పష్టం చేశారు.
చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్
సీఎం చంద్రబాబులోని అసహనం మీడియా సమావేశంలో స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి గురైతే దానిపై స్పందించకుండా, ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేస్తూ డ్రామాను రక్తికట్టించేందుకు ప్రయాస పడ్డారు. అసలు ఈ వ్యవహారంలో ఐటీ శాఖది కీలకపాత్ర. సంబంధిత శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు బయటకు రావడం లేదన్న ప్రశ్నకు బాబు వద్ద సమాధానం లేదు. దాకవరపు అశోక్‌ను దాచిపెట్టనట్లుగానే లోకేశ్ కూడా బయటకు రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతున్నట్లుగా ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ బయటకు వస్తే తమ బండారం మొత్తం బట్టబయలవుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రజల డేటా చోరీ గురించి చెప్పకుండా రేపు ఉదయం మీ పిల్లలు కిడ్నాప్ అవుతారు, మీ ఆస్తులను ఎత్తుకుపోతారంటూ సంబంధం లేని అంశాలు ఏవేవో మాట్లాడారు. అదేసమయంలో అధికారంలో ఉన్న తానేనన్న సంగతి మర్చిపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఏమిటని జనం విస్తుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment