చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల
మచిలీపట్నం టౌన్ : గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు డిమాండ్ చేశారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వీఐపీ ఘాట్లో స్నానాలు చేయకుండా షూటింగ్‌కు భక్తుల రద్దీ ఉండాలనే కారణంతో నాలుగు గంటల పాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు, పూజలు చేయడం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు.
చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. జిల్లాలోని పలు గ్రామాల్లో జ్వరాల తాకిడి అధికమైనా ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన విమర్శించారు. మాజేరులో విష జ్వరాలు ఉన్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నాయకులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోగా అధికార టీడీపీ నాయకులు తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ఈ నెల 24న అనంతపురం జిల్లాలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్వహించనున్న రైతు భరోసా పాదయాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి చలమలశెట్టి ఆదికిరణ్, పార్టీ నాయకులు కె.వెంకటేశ్వరరావు, కె.చంద్రశేఖర్, నాగరాజు, బ్రహ్మానందం, శామ్యూల్, రజియాసుల్తానా, కుమారి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.