దొరికితే గాలిని కూడా లీటర్లలా అమ్మేస్తారు...
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. అందుకే నంద్యాల ఎన్నికలో గెలుపు కోసం ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నంద్యాలలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను పక్కన పెడుతున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, టీడీపీ నగదు పంపిణీకి పోలీసులు కాపలా కాస్తున్నారని తమ్మినేని ఆరోపించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు నంద్యాలలో తిష్టవేసి పోలీస్ పహారాలో డబ్బులు, మద్యం ఏరులై పారించడం దారుణమని అన్నారు. రాత్రికి రాత్రే శిలాఫలకాలు లేకుండా టెంకాయలు కొడుతున్నారని..దేవాలయాలు, దర్గాలు, ప్రార్థనామందిరాలని చెప్పి డబ్బులు పంచుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందులో చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. బాబుకు గాలిచిక్కడం లేదు గానీ లేకపోతే దాన్ని కూడా లీటర్ల కొద్దీ ప్యాకెట్లు కట్టి అమ్ముకునేవాడని ఎద్దేవా చేశారు.
నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబుపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ తప్పులేదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సజావుగా సాగాలంటూ కేంద్ర బలగాలు మోహరించాలని గవర్నర్, ఈసీకి ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరపాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా నవ్వుల పాలు జేస్తున్నారో, ఎన్నికలను ఎంత అపహాస్యం చేస్తున్నారో ఇక్కడి దురాగతాల్ని మీడియా ఎండగట్టాలని విన్నవించారు