
హామీలకు చంద్రబాబు తిలోదకాలు: రఘువీరా
నెల్లూరు: ఎన్నికలకు ముందు వందలకొద్దీ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. పంట రుణమాఫీ, పొదుపు రుణాల మాఫీపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నెల్లూరులో రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్ర పాలనను చంద్రబాబు కార్పొరేట్ గా మార్చారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ మాట-కాంగ్రెస్ మాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.