ఈ చిత్రంలో నూతన వధూవరులు కురిటి అచ్యుతరావు, సాయికుమారిల స్వగ్రామం రేగిడి మండలం చిన్నపుర్లి. వీరు చంద్రన్న పెళ్లికానుక నిమిత్తం ఐదు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. కల్యాణమిత్రలు వచ్చి ఫొటోలు తీసుకెళ్లడంతోపాటు వివరాలన్నీ ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత వీరి ఖాతాలో రూ. 10 వేలు జమయ్యాయి. మరో రూ. 25 వేలు ఇంతవరకూ రాలేదు. ఇప్పటికే ఐదు పర్యాయాలు రేగిడి వెలుగు కార్యాలయానికి వచ్చారు. తిరిగే ఓపిక లేక అధికారుల నుంచి భరోసా లేక ఊరుకున్నారు
శ్రీకాకుళం, రాజాం: పొరుగున తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వెనుకబడిన వర్గాలను మైనార్టీలను ఆకట్టుకోవడానికి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లికానుక అభాసు పాలవుతోంది. జిల్లాలో వేలాది మంది నూతన వధూవరులకు ఈ కానుక అందక ఉసూరుమంటున్నారు. మరోవైపు బ్యాంకు ఖాతాల్లో నిధులు జమవుతాయని అధికారులు చెప్పడంతో ఇప్పటికీ ఎంతోమంది ఆశగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
అంతా గాలివాటం..
గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన చంద్రన్న పెళ్లికానుక పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అర్హులుగా ప్రకటించారు. నూతన వధూవరులు 15 రోజులు ముందు కల్యాణమిత్రలకు సమాచారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రతీ మండలానికి ఇద్దరు కల్యాణ మిత్రలను నియమించారు. వీరు వధూవరులు పెళ్లికార్డులతోపాటు ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఉన్నతాధికారులు అందిస్తారు. పెళ్లి సమయంలో ఫొటోలు తీసి ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేస్తారు. ఈ తంతు ముగియగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆరంభంలో కొంతమందికి మాత్రమే తూతూమంత్రంగా అందించారు. ఆ తర్వాత దరఖాస్తులు పేరుకుపోతున్నా కానుక మాత్రం అందలేదు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల కోడ్ రానుంది. ఈ లోపు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లుగా దాఖలాలు లేవు. దీనిబట్టి చూస్తే.. కానుక దరఖాస్తులు బుట్టదాఖలవుతాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతా బూటకమే..
చంద్రన్న పెళ్లికానుక అంతా బూటకమే. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏవో పథకాలు పెట్టి లబ్ధిదారులకు ఆశ చూపించడమే సీఎం చంద్రబాబు పని. వీటిని నమ్మి ప్రజలు మోసపోవద్దు. పెళ్లి చేసుకున్న జంటలకు ఏడాది వరకూ కానుక ఇవ్వకపోవడం దారుణం.– కంబాల జోగులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, రాజాం
త్వరలో వచ్చే అవకాశం ఉంది
చంద్రన్న పెళ్లికానుక అమలులో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో ఉంది. గతేడాది మే వరకూ దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో నిధులు వచ్చాయి. అనంతరం రూ. 8 కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో వీటిని విడుదలచేసే అవకాశం ఉంది. నిధులు కూడా వచ్చినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. – జీ దేవుడునాయుడు, చంద్రన్నపెళ్లికానుకల పథకం జిల్లా సమన్వయకర్త, శ్రీకాకుళం
నిధులు వస్తాయో రావో...
మా గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన నూతన జంటలకు చంద్రన్న పెళ్లికానుక అందలేదు. వీటికితోడు టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు అనుమతి ఉంటేనే కొంతమందికి ఇవి వస్తున్నాయి. లేకుంటే రాని పరిస్థితి ఉంది.– కెంబూరు సూర్యారావు, మాజీ సర్పంచ్, కొండగూడేం, సంతకవిటి మండలం
Comments
Please login to add a commentAdd a comment