శ్రీకాకుళం పాతబస్టాండ్: నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తామని, చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థిక ఆసరా కల్పిస్తామని టీడీపీ పాలకులు చెప్పిన మాటలకు కేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులకు పొంతనలేదు. ప్రభుత్వ సాయం అందుతుందని ఎదురు చూస్తున్న జంటలకు నిరాశే మిగులుతోంది. బడుగు, బలహీన వర్గాల వారికి ఈ పథకంపై ప్రభుత్వం ఎన్నో అశలు కల్పించించి. అధికారులు ఎప్పుడు వచ్చిన దరఖాస్తులు అప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా.. ఏదో ఒక కారణం చూపి ఆ నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న కొత్త జంటల ఖాతాలకు ఒక్క రూపాయి జమ చేస్తోంది. మిగిలిన మొత్తం కోసం ఎవరైనా ప్రశ్నిస్తే.. అకౌంటు సరిగా ఉందో, లేదో చెక్ చేయడానికి జమ చేశామని అధికారులు చెబుతున్నారు.
అందని ద్రాక్షలా..
చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది. 2018 ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ డ్వాక్రా సంఘాల నుంచి వివాహ మిత్రలను నియమించారు. పెళ్లికి 15 రోజుల ముందుగా చంద్రన్న పెళ్లికానుకకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లి రిజిస్ట్రేన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తోపాటుగా 100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలు తెలియజేయాలి. దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్లకు వివాహ మిత్రలు వెళ్లి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. వాటిని ప్రజా సాధికార సర్వేతో అనుసంధానం చేసి సరిపోల్చుతారు. ఇప్పటి వరకు చాలా మంది ఖాతాలకు నగదు జమ కాకపోవడంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల మాత్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని చెబుతున్నారు. మూడు నెలలు కావస్తున్నా పెళ్లికానుక జమకాలేదు. ఒక్క రూపాయి మాత్రమే కొందరికి జమకావడంతో వారంతా విస్తుపోయారు.
దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు..
జిల్లాలో చంద్రన్న పెళ్లికానుక పథకానికి ఇప్పటివరకు 4,820 జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 3,890 జంటలకు చెందిన దరఖాస్తులు మాత్రమే ఇప్పటి వరకు పరిశీలిన పూర్తి చేసి ఆర్హులుగా గుర్తించారు. వీరికి 16.80 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 930 జంటలకు ఈ కానుకకు సుమారుగా రూ.3.5 కోట్లు చెల్లించాల్సింది. వీటిలో 492 జంటలకు చెందిన దరఖాస్తులను అనర్హులుగా గుర్తించారు. ఆధార్ లింక్ కాలేదని, కుల ధ్రువపత్రాలు లేవని, పుట్టిన తేదీ ధ్రవపత్రం జత చేయలేదని, రెండో వివాహం, వరుడు ఉద్యోగి అనే కారణాలతో నిలిపివేశారు. గతేడాది అక్టోబర్ నుంచి వరుడు ఉద్యోగి అయినా, వధువు కుటుంబం బీపీఎల్ పరిధిలో ఉంటే వారికి పెళ్లికానుక మంజూరు చేయవచ్చనే నిబంధనలు మారినా.. ఆ నిబంధనలు అమలులోకి రాలేదు.
పెళ్లి కానుక మొత్తం జమఅవుతుంది
పెళ్లి కానుక మొత్తం జమ అవుతుంది. లబ్ధిదారులు అందోళన చెందవద్దు. దరఖాస్తులు వెరిఫికేషన్ పూర్తియిన జంటలకు కానుకలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్నవాటికి కూడా తగిన ధ్రువపత్రాలు అందజేస్తే.. వారి కూడా చెల్లిస్తాం. పంచాయతీ కార్యదర్శులు పెళ్లి ధ్రువపత్రాలు అన్‌లైన్‌లో జమ చేయడం ఆలస్యం వల్ల అక్కడక్కడా జాప్యం జరుగుతోంది. కొన్ని బ్యాంకు ఖాతాలు పనిచేయడంలేదు. వాటిని సరిచేయాలని సంబంధిత మండల అధికారులకు సూచించాం. – ఎ.కల్యాణచక్రవర్తి, డీఆర్‌డీఏ పీడీ
చంద్రన్న పెళ్లికానుక ఇలా.. (కులాలవారీగా)
♦ ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకొంటే రూ.50వేలు,
♦ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్సీలకు రూ.40వేలు,
♦ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎస్టీలైతే రూ.50వేలు,
♦ విభిన్న ప్రతిభావంతులైతే ఏ కులానికి చెందిన వారైనా రూ.లక్ష వంతున అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment