ఫ్రీ అని చెప్పి అధ్వాన సరుకుల సంచి అందజేత
చంద్రన్న కానుకలో నాణ్యత లోపం
పండుగ వేళ అనారోగ్యం బారిన పడాలా?
గోధుమల్లో కలసినపొట్టు, రాళ్లు చేరిన కందిపప్పు
బెల్లం నీరుగారిపోతోంది. గోధుమపిండిలో పొట్టు కలిసి ఉంటుంది. నెయ్యి నాణ్యతగా లేదని, వంటలు పాడవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. కందిపప్పులో పొల్లు గింజలు అధికంగా ఉండడంతోపాటు నలుపురంగులో పప్పుబద్దలు ఉన్నాయని, బూజు పట్టి చేదు ఎక్కువగా ఉంటోందని ఒక గ్లాసుడు పప్పు ఉడికేందుకు పట్టే సమయం గంటపైమాటే అని గృహిణులు అంటున్నారు. పండుగ వేళ చంద్రన్న కానుకలు పేరుతో అందిస్తున్న సంచులు అందర్నీ నిరాశలో ముంచుతున్నాయి.
శ్రీకాకుళం టౌన్: పండుగపూట ప్రచారం ఆర్భాటంతో పౌరసరఫరాలశాఖ చేపట్టిన చంద్రన్న కానుక పథకం కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తుంటే లబ్ధిదారులను తీవ్ర అసంతృప్తిలో ముంచుతోంది. సరుకుల నాణ్యత అధ్వానంగా ఉండటంతో తీసుకున్న వారు లబోదిబోమంటున్నారు. తీసుకునేందుకు సిద్ధమైన వారు అవి తెచ్చుకుని ఏం చేయాలా అని మధనపడుతున్నారు. ఉచితం గా వచ్చినవి ఎందుకు విడిచిపెట్టాలని బారులుతీరి తీసుకెళుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు 20 శాతం సరకులు పంపిణీ చేసిన పౌరసరఫరాల శాఖ ఇప్పుడు సంక్రాంతి కానుకల పంపిణీకి సిద్ధమవుతోంది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా చంద్రన్న కానుకలు పంపిణీ కానున్నాయి.
జిల్లాలో పౌరసరఫరాలశాఖ పరిధిలో 7.8 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. కొత్తగా మరో 22 వేల కార్డులను జన్మభూమి గ్రామసభల్లో పంపిణీకి సిద్ధం చేశారు. ఈ కార్డుదారులందరికీ సంక్రాంతి, క్రిస్మస్ పర్వదినాలు సందర్భంగా ఉచితంగా చంద్రన్న కానుకలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో బెల్లం, శనగపప్పు, గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, నెయ్యి ఉన్న బ్యాగులను లబ్ధిదారులకు అందించాలని సంకల్పించారు. క్రిస్మస్ ముందుగా రావడంతో క్రైస్తవులకు సరుకులను పంపిణీ చేశారు. ఎంతో ఆర్భాటంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటి పంపిణీ చేపట్టారు.
అయితే సరకులు అందుకున్న లబ్ధిదారుల్లో సంతోషం ఎంతసేపోలేదు. ఇంటికెళ్లి చూసే సరికి ఖరీదు పెరిగిన కందిపప్పులో రాళ్లు కలిశాయి. బెల్లం నీరుగారి పోయింది. గోధుమపిండిలో పొట్టుకలసిపోయింది. నెయ్యి అదోరకమైన వాసనతో రుచి లేకుండా ఉంది. పండుగ వేళ ఇలాంటి సరుకులతో పదార్థాలు వండుకుంటే అనారోగ్యం పాలవకతప్పదని పలువురు అంటున్నారు. నాణ్యత లేకుండా ఈ సరుకులు జిల్లాకు సరఫరా కావడంతో దిక్కుతోచని అధికారులు వచ్చిన సరకులు వచ్చినట్టు పంపిణీ చేసి చేతులు దులుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.
పంపిణీకి సిద్ధం
జిల్లాలో గురువారం నుంచి సంక్రాంతికి చంద్రన్నకానుకలు పంపిణీ చేయనున్నారు. అందుకోసం 421.65 క్వింటాళ్ల బెల్లం, 39.8 కిలోలీటర్ల పామాయిల్, కందిపప్పు 404.9 క్వింటాళ్లు, గోధుమపిండి 418.625 కింటాళ్లు, 418 క్వింటాళ్లు, నెయ్యి 83.61కిలోలీటర్లు జిల్లాకు చేరాయి. జిల్లాలో క్రిస్మస్ సమయంలో పంపిణీ చేసిన వారికి సంక్రాంతి జాబితాల నుంచి తొలగించి పంపిణీ చేయనున్నారు.
ఇది ..ఉచితమా?
Published Thu, Jan 7 2016 12:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement