అక్షర మాంత్రికుడు మరిలేరు | Character Wizard marileru | Sakshi
Sakshi News home page

అక్షర మాంత్రికుడు మరిలేరు

Published Sun, Sep 28 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

Character Wizard marileru

  •  అనారోగ్యంతో  కేవైఎల్.నరసింహం మృతి
  •  సంస్కృతం మాస్టారుగా  సుపరిచితులు
  •  7వేలకు పైగా సన్మాన పత్రాలు రాసిన ఘనత
  • మచిలీపట్నం : అక్షర మాంత్రికుడు మరిలేరు. మచిలీపట్నంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ సంస్కృతం మాస్టారుగా పిలిపించుకునే కేవైఎల్.నరసింహం (64) విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య సావిత్రి ఇన్‌కంటాక్స్‌లో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు. కుమారులు ఇద్దరు ఫిన్‌ల్యాండ్‌లో ఉంటున్నారు.  64వ వసంతంలోకి శనివారం ఆయన అడుగుపెట్టారు. పుట్టినరోజునే ఆయన మరణించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
     
    బహుముఖ ప్రజ్ఞాశాలి...

    ఆంధ్రజాతీయ కళాశాల ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో 40 సంవత్సరాల పాటు సంస్కృతం పండితులుగా ఆయన పనిచేశారు. ఇన్ని సంవత్సరాల పాటు ఇంటి వద్ద ఉచితంగా సంస్కృతాన్ని నేర్పారు. రంగస్థల నటుడిగా, గాయకుడిగా, ఈలపాట విద్వాంసుడిగా, హాస్యచతురిడిగా ఆయన పేరెన్నికగన్నారు. ఆంధ్ర సారస్వత సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జరిగే అష్టావధానం కార్యక్రమాల్లో అవధాని ఏకగ్రతను దెబ్బతీసేందుకు  కేవైఎల్. నరసింహం పృచ్ఛకుడిగా వ్యవహరించేవారు.

    ఉగాది వేడుకలు, శ్రీరామనవమి, వివాహా వేడుకల్లో ఆయన పాల్గొని భార్య, భర్తల సంబంధం తదితరాలను తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ వివరించేవారు. రామాయణ, మహాభాగవతాలను తనదైన శైలిలో వివిధ ఆలయాల్లో భక్తులకు వివరించేవారు. ప్రతి ఉగాదికి కోనేరుసెంటరులో కార్యక్రమం ఏర్పాటు చేసి పంచాంగ శ్రవణం చేసేవారు.ఆయన సైకిల్‌పైనే నిత్యం తిరిగేవారు.
     
    7వేలకు పైగా సన్మాన పత్రాలు రాసిన ఘనత..
     
    కేవైఎల్. నరసింహం సన్మానపత్రాలు రాయడంలో దిట్ట. 7వేలకు పైగా సన్మాన పత్రాలు ఆయన రాశారు. హాస్యనటుడు బ్రహ్మానందంతో పాటు తమిళనాడు గవర్నర్ రోశయ్య, మరెందరికో ఆయన సన్మాన పత్రాలు రాశారు. ఎవరి వద్ద ఒక్క రూపాయి ఆశించకుండా తనదైన శైలిలో సన్మాన పత్రాలు రాసిన ఘనత ఆయనకే దక్కింది. నడిచే అక్షరంగా పిలుచుకునే సంస్కృతం మాస్టారి మరణం సాహితీ లోకానికి తీరనిలోటని ప్రముఖ కవి, మానసిక శాస్త్రవేత్త విడియాల చక్రవర్తి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రముఖ కవులు రావి రంగారావు, మాదిరాజు రామలింగేశ్వరరావు, యూటీఎఫ్ వెంకటేశ్వరరావు, మహ్మద్ సిలార్ సంతాపం వ్యక్తం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement