మంత్రుల పేర్లు లేని ఛార్జిషీట్లు
క్విడ్ ప్రోకో కేసులో ఈరోజు సీబీఐ దాఖలు చేసిన మూడు ఛార్జ్‌షీట్లలో మంత్రుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ ఛార్జి షీట్లలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి సబితలకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇండియా సిమెంట్స్ కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. ఆయనను కేవలం సాక్షిగా మాత్రమే పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో మంత్రి పొన్నాలను సిబిఐ రెండు రోజులు విచారించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే 8, 9 తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు ఈరోజు చార్జ్షీటు దాఖలు చేశారు.
నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున గగన్‌విహార్ కోర్టులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీబీఐ డిఐజి వెంకటేశ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇండియా సిమెంట్స్ ఛార్జిషీటులో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, శ్రీనివాసన్, ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్, శామ్యూల్, రఘురాం, ఇండియా సిమెంట్స్, జగతి, కార్మెల్ ఏసియాలను నిందితులుగా పేర్కొంది. పెన్నాసిమెంట్స్ ఛార్జిషీటులో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పెన్నా ప్రతాపరెడ్డి, పీఆర్ ఎనర్జీ, జగతి, కార్మెల్ ఏసియా, పెన్నా సిమెంట్స్, పయనీర్ హోల్డింగ్స్‌లను నిందితులుగా పేర్కొన్నారు. రఘురాం సిమెంట్స్ ఛార్జిషీటులో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, రఘురాం సిమెంట్స్, జగన్మోహన్, రాజగోపాల్, వీఎన్ ప్రభు, బి.కృపానందం, శంకర్‌నారాయణలను నిందితులుగా పేర్కొంది. 26 జీవోల అంశంలో అభియోగాలు ఎదుర్కొన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
సుప్రీం ఆదేశాల ప్రకారం సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు వైఎస్ జగన్మోన రెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తెలిపారు. పెన్నా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్, ఇండియా సిమెంట్స్‌లపై ఛార్జిషీట్లు దాఖలుచేసినట్లు వివరించారు. మరో 2-3 రోజుల్లో మిగిలిన ఛార్జిషీట్లు దాఖలుచేస్తామని సీబీఐ చెప్పినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఛార్జిషీటు మిగిలి ఉందని సీబీఐ తెలిపినట్లు అశోక్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైఎస్ జగన్మోహన రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.