పేదవాని చౌక పంట | Cheap poor man's crop | Sakshi
Sakshi News home page

పేదవాని చౌక పంట

Published Thu, Sep 11 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

పేదవాని చౌక పంట

పేదవాని చౌక పంట

  •     తక్కువ నీటితో బూడిద గుమ్మడి సాగు
  •      పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ
  •      మొగ్గు చూపుతున్న రైతులు
  • వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పది బోర్లలో రెండింట మాత్రమే నీళ్లొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూరగాయ, వాణిజ్య పంటలు సాగు చేయడం రైతులకు కష్టతరంగా మారింది. ఉన్న నీటితో తక్కువ పెట్టుబడితో సాగు చేసే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి రైతులకు బూడిద గుమ్మడి వరంలా మారింది.
     
    పలమనేరు: పలమనేరు మండలంలోని తొప్పనపల్లెకు చెందిన యువరైతు గజేంద్ర (9849830207) తన నాలుగెకరాల పొలంలో ఈ దఫా బూడిద గుమ్మడి సాగు చేశాడు. బోర్లో వచ్చే తక్కువ నీటితో ఎకరాకు రూ.10 వేలు ఖర్చు పెట్టి రూ.లక్ష వరకు గడించాడు. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాంతంలోని పలువురు రైతులు ప్రస్తుతం బూడిద గుమ్మడి సాగుకు సమాయత్తమవుతున్నారు. సాగుకు సంబంధించిన పలు అనుభవాలను రైతు వివరించాడు. ఆయన మాటల్లోనే చూద్దాం..
     
    సాగు విధానం..

    ఈ పంటకు వేడి వాతావరణం అనుకూలిస్తుంది. 20 రోజులకు ఒకసారి తడి అందించినా సరిపోతుంది. తేలికపాటి బంకమట్టి నేలలు ఎంతో అనుకూలం. జూన్, జూలై నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. ముఖ్యంగా మామిడి తోటల్లో ఈ పంటను సాగు చేస్తే ఓ వైపు మామిడితో పాటు మరోవైపు గుమ్మడి ద్వారా అదనపు ఆదాయం గడించవచ్చు. ఇది తీగ పంట కావడంతో తీగలు మామిడి చెట్లపైకి అల్లుకుని కాయలు కాశాయి. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న రైతులు డ్రిప్ ఆధారంగా పంట సాగు చేసుకోవచ్చు. విత్తనాలను రెండు సెంటిమీటర్ల లోతులో నాటాలి. విత్తే ముందు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, ఓ బస్తా భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంతల్లో వేసుకోవాలి. నత్రజనిని సమపాళ్లుగా చేసి పూత, పిందె దశలో వేయాలి.
     
    పెట్టుబడి రూ.10వేలు.. ఆదాయం రూ.లక్ష

    తమిళనాడు నుంచి బూడిద గుమ్మడి విత్తనాలను తెప్పించా. నా మామిడి తోటలో పాదులు చేయించి డ్రిప్ ద్వారా పంట సాగు చేశా. ఎకరా భూమికి విత్తనాల కోసం రూ.3,500  ఖర్చైంది. ఇతరత్రా ఖర్చులు కలుపుకొని మొత్తం మీద పెట్టుబడి ఎకరాకు రూ.10 వేలు అయ్యింది. కేరళ, తమిళనాడు, స్థానిక వ్యాపారులు బూడిద గుమ్మడిని కొనుగోలు చేశారు. ఎకరా పంటకు రూ.1.10 లక్షలు రాబడి రాగా ఖర్చులు పోను రూ.లక్ష వరకు మిగిలింది. బోరు లో వచ్చే నీరు తక్కువగా ఉండడంతో వేరే పంటకైతే అర ఎకరా సాగుచేసే నీటితోనే నాలుగెకరాలు బూడిద గుమ్మడిని సాగు చేశా. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న రైతులకు ఈ పంట ఎంతో మేలు. మార్కెట్లో ధరలు కూడా ఆశాజనకంగానే ఉంటాయి.
     
    బూడిద గుమ్మడిలో సస్యరక్షణ..


    బూడిద గుమ్మడికి సంబంధించి సస్యరక్షణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న (8374449205) వివరించారు. కలుపు నివారణకు మెటలాక్లోర్ మందును పిచికారీ చేయా లి. మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నపుడు లీటర్ నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతుంది. ఈ పంటకు ఎక్కువగా గుమ్మ డి పెంకు పురుగు, పం డు ఈగతో నష్టం వాటిల్లుతుంది. దీనికోసం కార్బరిల్ 50 శాతం పొడిని మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవచ్చు. పండు ఈగ నివారణకు పది మిల్లీల మలాథియాన్‌ను 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం నీటితో కలిపి తోటలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పోసి పెట్టాలి. ఇక బూజు, బూడిద, వేరుకుళ్లు తెగుళ్లు తదితరాలకు మాంకోజెబ్ లేదా డైనోకాప్ తదితర మందులను పిచికారీ చేయొచ్చు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement