సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో వ్యవసాయ రంగం భూగర్భ జలాలపైనే ఆధారపడింది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు వినియోగం పెరిగిన నేపథ్యంలో భూగర్భజలాలు పడిపోయాయి. అందుబాటులో ఉన్న జలాలను వినియోగించి సాగు చేపట్టాలని భావించిన రైతులకు కరెంటు కోతలు ఇరకాటంలో పడేస్తున్నాయి. దీంతో ఉద్యాన రైతు పరిస్థితి రెంటికీ చెడినట్టైంది. నగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో ఉద్యాన దిగుబడులకు డిమాండ్ బాగా పెరిగింది.
దీంతో రైతులు కూరగాయల పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నా.. పరిస్థితులు అనుకూలించక నిరుత్సాహానికి గురవుతున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 12వేల హెక్టార్లలో సాధారణ విస్తీర్ణం ఉన్నప్పటికీ.. గత ఏడాది 20వేల హెక్టార్ల వరకు వివిధ పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం ఉద్యాన సాగు విస్తీర్ణం 8వేల హెక్టార్లకు పడిపోయింది. ఇందులోనూ కరెంటుకోతల ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒక్కో హెక్టారులో గరిష్టంగా 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ సాగు విస్తీర్ణం భారీగా పడిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడనుంది.
ధరలు భగభగ..
కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పడిపోవడంతో మార్కెట్లో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే టమాటా పంట సాగు దాదాపు 5వందల హెక్టార్లు తగ్గింది. మరోవైపు కరెంటు కోతలతో దిగుబడిపై ప్రభావం చూపడంతో తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా మార్కెట్లో కిలో టమాటా ధర రూ.70 వరకు చేరింది. బీర, సొర, దోస వంటి పంటల విస్తీర్ణం కూడా సగానికి పడిపోయింది. ప్రస్తుతం బీర, సొర, చిక్కుడు, దోసకాయలు కిలో రూ.50 ధర పలుకుతున్నాయి. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు భారీగా ఎగుమతయ్యే క్యారెట్, క్యాబేజీ పంటల విస్తీర్ణం తగ్గడంతో ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు.
కూరగాయలపై కరువు దెబ్బ!
Published Mon, Aug 4 2014 12:34 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement