
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్‌ని అవినీతి రహిత రాష్ట్రంగా రూపుదిద్దడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని.. వాటిన్నింటినీ ప్రక్షాణళ చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని టీడీపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వంలో కావాల్సినంత సమయం ఇస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అంతా త్వరలోనే బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు.
సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లలో రాష్ట్రం అవినీతి మయంగా మారింది. రూ.2.7 వేల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారు. లక్ష కోట్ల వరకు పనులు పెండింగ్‌లో పెట్టారు. వ్యవస్థలను క్రమబద్దీకరించే బాధ్యత సీఎం వైఎస్ జగన్‌పై పడింది. క్రింది స్థాయి నుంచి రెవిన్యూ, పోలీసు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టు వంటి వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తాం, అవినీతి నిర్మూలన కోసం మీడియా సహకారం ఎంతో అవసరం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయుటకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం. ఎప్పుడు లేని విధంగా వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ప్రైవేటు స్కూల్స్ దోపిడిని నివారించేందుకు ఫీజు రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 20 బిల్లులు ప్రవేశపెట్టాం. ఇంటింటికి కుళాయి ఇవ్వడానికి రివర్స్ టెండరింగ్ వేస్తున్నాం. ఉగాదికి లోపల 25 లక్షల మంది నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేస్తాం. 130 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో సీపీ రోడ్లు మంజూరుచేశాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment