కవిటి: మండలంలోని జాడుపుడి ఆర్‌ఎస్ సమీపంలోని భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన శాంతి ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ కోళ్ల దూర్వాసులు అలియాస్ దేవరాజు రూ.25.43 లక్షల నిధులు అక్రమంగా దారిమళ్లించాడని కవిటి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 8న పెట్రోల్ బంక్ యాజమాన్య ప్రతినిధి శేషగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు దర్యాప్తు చేసి నిందితున్ని శనివారం ఇచ్ఛాపురం కోర్టుకు తరలించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. దేవరాజు మేనేజర్ హోదాలో పెట్రోల్‌బంక్‌లో ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, బ్యాంక్ లావాదేవీలు చూస్తుండేవాడు. కొన్నాళ్లుగా బంక్ యజమానుల కళ్లుగప్పి భారీ మొత్తంలో నిధులు అవకతవకలకు పాల్పడినట్టు యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాస్తవం వెలుగుచూసింది. బ్యాంక్ లావాదేవీలు, పెట్రోల్‌బంక్ రికార్డులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవకతవకలు గుర్తించి దేవరాజును కోర్టులో హాజరుపర్చినట్టు ఎస్‌ఐ పారినాయుడు విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment