- ఊట్ల నాగేశ్వరరావుపై ఆరోపణల వెల్లువ
- అమాయకుల్ని మోసగించి కోట్ల రూపాయలు కైంకర్యం
సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు ఊట్ల నాగేశ్వరరావు ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు విక్రయిస్తామంటూ నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. పెనుగంచిప్రోలు పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే ఊట్లపై ఒక కేసు నమోదు కాగా మరొకరు ఫిర్యాదుచేశారు.
ఊట్ల మోసాల చిట్టా
ఊట్ల నాగేశ్వరరావు ఆయన కుమారుడు ఊట్ల గోపీచంద్, కుమార్తె దండెం సుభాషిణి, జెడ్పీ మాజీ సభ్యుడు గజ్జి కృష్ణమూర్తి రూ.60 లక్షలకు మోసం చేశారంటూ వారిపై కొందరు ఫిర్యాదుచేయగా పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వరరావు తన కుమార్తె, కుమారుడు పేర్లతో సిరంగి ధనమ్మ నుంచి 1.26 ఎకరాల భూమిని 2010లో కొన్నారు. దీనిని ఖమ్మంలోని ఏలూరు వెంకటేశ్వర్లుకు 2011 నవంబర్ 28న రూ.99.44లక్షలకు విక్రయించేందుకు సిద్ధమై స్టాంపు వెండర్ కూడా అయిన గజ్జి కృష్ణమూర్తి సహకారంతో రూ.60లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ తరువాత మిగిలిన సొమ్ము చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెంకటేశ్వర్లు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వెంకటేశ్వర్లు నందిగామ డీఎస్పీకి ఫిర్యాదు చేయగా నిందితులపై క్రైం నం: 43/15 కేసు నమోదుచేశారు.
మరో వ్యవహారంలో విజయవాడ గుణదలలోని తమ వెంచర్‌లోని పది సెంట్లు విక్రయించేందుకు రూ.10.50 లక్షలతో ఊట్ల ఒప్పందం కుదుర్చుకుని 2013 జూన్‌లో రూ.10లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని మన్నే పద్మజ ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత తాను ఎన్నిసార్లు కోరినా అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు. వెకేషన్ కోర్టుకు వెళ్లగా ఇంజంక్షన్ ఆర్డరు ఇచ్చారన్నారు. గత వారం పెనుగంచిప్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశానన్నారు.
నాగేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన రమణమ్మ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.9లక్షలు తీసుకుని రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఏడు లక్షలు ఇవ్వకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్లారు.
మరో సంఘటనలో హుజూర్‌నగర్‌కు చెందిన రవి అనే స్టాఫ్‌వేర్ ఉద్యోగి వద్ద నాగేశ్వరరావు కుమారుడు ఇళ్ల స్థలాలు విక్రయిస్తామని చెబుతూ రూ.40లక్షలు తీసుకుని చెల్లించకపోతే రవి చెక్ బౌన్స్ కేసు వేశారు.
కాగా తనపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టిస్తున్నారని నాగేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదులో తాను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నానన్నారు. రమణమ్మ కేసును పెద్దల సమక్షంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు.
యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు : సతీష్, ఎస్‌ఐ
ఏలూరు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఊట్ల నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశాం. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. మన్నె పద్మజ ఇప్పటికే కోర్టుకు వెళ్లినందున నాగేశ్వరరావును, ఆయన కుటుంబసభ్యులు అరెస్టు చేయలేకపోతున్నాం.
టీడీపీ నేతపై చీటింగ్ కేసులు
Published Sat, May 23 2015 5:31 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement